Tuesday 16 August 2022

  

ఉప ఎన్నిక పుణ్యమా అని మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లు నెరవేరేనా !!

 


భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేయకముందే ముఖ్యమంత్రి ఉపఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. మునుగోడు ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే మునుగోడు పై ఫోకస్ చేశారు. ఇది మునుగోడు ఉప ఎన్నికకు అధికార పార్టీ ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగస్టు 20న రానున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న సందర్భంగా మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించనున్నారని పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత, రాష్ట్రంలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్‌లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయలేదు. హుజూర్నగర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా, నాగార్జున సాగర్ ను సైతం టిఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. ఇక దుబ్బాక, హుజురాబాద్ లను బిజెపి కైవసం చేసుకుంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ మరియు శాసనసభకు రాజీనామా చేయగా తాజాగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లను యుద్దప్రాతిపదికన ఉపఎన్నికకు ముందు నెరవేర్చేందుకు నివేదికలు ఇవ్వాలని నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జి. జగదీష్‌రెడ్డిని, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో మునుగోడు ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని నల్గొండ జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, దశాబ్దాలుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదవర్గాలు ప్రభుత్వ కళాశాలలు లేక ప్రైవేటు కళాశాలలో డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నత విద్యను పొందలేకపోతున్నారు అని, ఇక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేక పోతున్నారని ప్రజల ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు
దీంతో సీఎం కేసీఆర్ ఆగస్టు 20న బహిరంగ సభలో ఈ రెండు డిమాండ్లను నెరవేరుస్తామని, అదే రోజు కళాశాలలు, ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన జిఓ (ప్రభుత్వ ఉత్తర్వులు) విడుదల చేస్తామని నల్గొండ పార్టీ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మరిన్ని వరాల జల్లు కురిపించాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వారు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారు.


               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...