Thursday 18 August 2022

 

 కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది



ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తనను జాతీయ నేతగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఢిల్లీ సీఎంగా ప్రజలనుంచి మంచి మార్కులు కొట్టేసిన తర్వాత, ఇటీవలే పంజాబ్ ప్రజల నమ్మకాన్ని కూడా చూరగొని పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత.. కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి తాజాగా కేజ్రీవాల్ భారత యాత్ర చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 

కేజ్రీవాల్ తన భారతయాత్రకు ఒక మంచి నినాదం కూడా తయారు చేసుకున్నారు. ‘‘మేక్ ఇండియా నెంబర్ 1’’ అనేదే ఆ నినాదం. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని కేజ్రీవాల్ స్వప్నం నిజమే కావొచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్త పార్టీగా తీర్చిదిద్దడం, యావత్ దేశంలో అస్తిత్వాన్ని చాటుకునేలా సీట్లు గెలవడం కేజ్రీవాల్ లక్ష్యం. వీటన్నింటి పర్యవసానం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. నరేంద్రమోడీని రీప్లేస్ చేయడానికి విపక్షాలు అన్నీ జట్టు కడితే.. ప్రధాన పదవికి ప్రధాన పోటీదారుగా తనను తాను ఆవిష్కరించుకోవడం అనే లక్ష్యం బై డిఫాల్ట్ గా ఉంటుంది. 

ఆ ప్రయత్నంలో భాగంగానేనా అన్నట్లు కేజ్రీవాల్.. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ మీద నెక్ట్స్ ఫోకస్ పెట్టారు.. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని, 2023 తెలంగాణ ఎన్నికల్లో కొంత సీరియస్ గానే బరిలో ఉండవచ్చునని కూడా పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ఆప్ సారథి స్వయంగా గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగేశారు. అక్కడ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 

దేశవ్యాప్తంగా ప్రజలను ఆప్ వైపు ఆకట్టుకోవడానికి అయిదు హామీలతో ప్రణాళికను రూపొందించారు కేజ్రీవాల్. ఆ అయిదు అంశాలే.. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ కూడా చేస్తాయని అంటున్నారు.

 1) నాణ్యమైన ఉచిత విద్య,

2) ఉచిత వైద్యం- మందులు,

3) యువత అందరికీ ఉద్యోగాలు,

4)మహిళలకు సమానహక్కులతో కూడిన జీవితం,

5) రైతులకు గిట్టుబాటు ధరల హామీ

అనేవే ఈ పంచసూత్రాలు. ఒక రకంగా చెప్పాలంటే.. అద్భుతమైన హామీలు. యావత్తు దేశ మనుగడ మొత్తం ఈ పంచసూత్రాల్లోనే ఇమిడిపోయి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ అంశాల విషయంలో తాను సమర్థుడైన నాయకుడినే అని కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలనతోనే నిరూపిపించుకున్నారు కూడా.

కానీ.. ఫ్రీబీస్ కు అలవాటు పడిన, పార్టీలు విసిరే బిస్కట్లకు ఆశపడే ప్రజలు వీటిని నమ్మి ఆప్ కు కిరీటం పెడతారా అనేది సందేహం. వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేకంటే.. వారిలో నమ్మకం కలిగించడానికి కేజ్రీవాల్ 2024 ఎన్నికల్లోగా ఎంత కృషి చేస్తారనేది గమనించాలి.

 

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...