Tuesday 21 June 2022

 బ‌ల‌వంతంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయిస్తున్నారా?


అప్పుడు అద్వానీ.. ఇప్పుడు వెంక‌య్య‌నాయుడు


కేవ‌లం రెండు సీట్లున్న భార‌తీయ జ‌న‌తాపార్టీని ఈరోజు ఈస్థాయికి తేవ‌డంలో అద్వానీ పాత్ర మ‌ర‌వ‌లేనిది. ఆయ‌న లేకుండా, ఆయ‌న ర‌థ‌యాత్ర లేకుండా ఉంటే బీజేపీ ఎక్క‌డ ఉండేదో ఆ పార్టీ నేత‌ల‌కే తెలియాలి. దశాబ్దాల నుంచి బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను న‌మ్ముకున్న‌వారంద‌రికీ న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా వ‌చ్చిన త‌ర్వాత తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. అందుకు ఉదాహ‌ర‌ణ అప్పుడు అద్వానీ కాగా, ఇప్పుడు వెంక‌య్య‌నాయుడు.!!

లాల్‌కృష్ణ అద్వానీ ప్ర‌ధాన‌మంత్రి కావాల‌నుకున్నారు. కానీ ఉప ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్టుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక స‌మ‌యంలో అద్వానీ పేరే దేశ‌వ్యాప్తంగా విన‌ప‌డింది. కానీ రాజ‌కీయంగా తాను భిక్ష పెట్టిన న‌రేంద్ర‌మోడీకి మాత్రం త‌న గురువులో 'రాష్ట్ర‌ప‌తి' క‌న‌ప‌డ‌లేదు. ఎక్క‌డో ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను తీసుకొచ్చి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో అద్వానీ రాజ‌కీయాల నుంచి అంత‌ర్థాన‌మ‌య్యారు. శిష్యుడి చేతిలో ఎదురైన అవ‌మానం ఆయ‌న్ను జీవితాంతం బాధ‌పెడుతూనే ఉంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్న వెంక‌య్య‌నాయుడిని హ‌ఠాత్తుగా ఉప రాష్ట్ర‌ప‌తిని చేశారు. దీంతో ఆయ‌న గొంతు మూగ‌బోయింది.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇస్తార‌ని వెంక‌య్య ఆశ‌లు పెట్టుకున్నారు. బీజేపీ సిద్ధాంతాల‌కు అనుగుణంగానే త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. కానీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. వెంక‌య్య‌నాయుడిలో కూడా న‌రేంద్ర‌మోడీ, అమిత్ షాకు 'రాష్ట్ర‌ప‌తి' క‌న‌ప‌డ‌లేదు. ఒడిశాలో ఉన్న ద్రౌప‌ది ముర్ముకు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. అద్వానీ త‌ర‌హాలోనే వెంక‌య్య‌నాయుడిని కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి బ‌ల‌వంతంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయించబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మంచి వాగ్ధాటి, అన్ని పార్టీల నేత‌ల‌తో స‌న్నిహిత ప‌రిచ‌యాల‌నున్న‌వారిని ఉప‌యోగించుకొని పార్టీని బ‌లోపేతం చేసుకోవాలికానీ త‌మ రాజ‌కీయాల‌కు అడ్డు వ‌స్తార‌నే ఆలోచ‌నా రీతితో వారిని బ‌ల‌వంతంగా త‌ప్పించ‌డ‌మ‌నేది ఏ త‌ర‌హా రాజ‌కీయ‌మో త‌మ‌కు కూడా తెలియ‌డంలేద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అంటే భార‌త ప్ర‌జాస్వామ్యానికి గుండెలాంటిది. అటువంటి ప‌ద‌విలో రాజ‌కీయ ఉద్ధండుల‌ను నియ‌మించ‌డానికి అన్ని పార్టీలు ప్ర‌య‌త్నిస్తుంటాయి. వ‌ర్గ ప‌రంగా రామ్‌నాథ్ కొవింద్‌, ద్రౌప‌ది ముర్ముల‌ను ఎంపిక చేయ‌డంద్వారా ఆయా వ‌ర్గాల‌కు న్యాయం చేశామ‌ని అనుకుంటున్నారుకానీ ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పార్టీ ఎదుగ‌ల‌కు కార‌కులైన‌వారికి, కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నవారికి మాత్రం తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌నేది మ‌న క‌ళ్లెదుట కనపడుతున్న వాస్తవం.!!


 

 

సర్కారు బడికి డిమాండ్..



తెలంగాణలో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ పట్టుకుంది. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందంటే పాత తరగతిలో ఉండే విద్యార్ధులను ప్రమోట్ చేసి అడ్మిషన్స్‌ క్లోజ్ చేసే పరిస్థితి నుంచి మా స్కూల్‌లో సీట్లు లేవు అడ్మిషన్స్‌ అయిపోయాయి అని బోర్డులు పెట్టే వరకు వచ్చింది. సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాలో ఇదే తరహాలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు కుస్తీ పడుతున్న దృశ్యాలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మా పిల్లలకు పాఠశాలలో ప్రవేశం కల్పించండి అంటు ఓ స్టూడెంట్ పేరెంట్స్.. లేదు మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఇంకో విద్యార్ది తల్లిదండ్రులు పోటీ పడ్డారు. ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది విద్యార్ధుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రాదేయపడ్డారు. ఇంతగా బ్రతిమిలాడుతున్నారంటే అది కచ్చితంగా ఫేమస్‌ కార్పొరేట్ స్కూల్‌ అయి ఉండవచ్చని అందరూ భావిస్తారు. కాని కాదు ప్రభుత్వ పాఠశాల. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్. ఈ స్కూల్‌లో చేర్పించడానికే తమ పిల్లల్ని తీసుకొని అడ్మిషన్ల కోసం వచ్చిన పేరెంట్స్‌తో స్కూల్‌ ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. సాధారణంగా సర్కారు బళ్లు, ఆసుపత్రులు ప్రజాదరణకు నోచుకోవు. సర్కారు బడిలో సరిగ్గా చదువు చెప్పరనే నానుడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరు, మంచి మందులివ్వరనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాని ఇందిరానగర్‌లోని ఈ జడ్పీ హైస్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. ఈ స్కూల్‌లో సుమారు 1200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 24 సెక్షన్లకు 14 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు, 40మంది నిబంధనల ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే ఈస్కూల్‌లో చదువుకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టే స్టూడెంట్స్‌ సంఖ్య పెరుగుతోందని చెప్పకనే చెప్పొచ్చు. గతేడాది విద్యార్ధుల సంఖ్యను పక్కనపెడితే ఈసారి కొత్తగా 6వ తరగతిలో చేరేందుకు మరో 300 మంది రెడీగా ఉన్నారు. ఇప్పటికే 7, 8, 9, 10వ తరగతుల్లో అడ్మిషన్లు లేవని ఫ్లెక్సీ ఏర్పాటు చేయారు స్కూల్‌ ఉపాధ్యాయులు. స్కూల్‌లో విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉండటంతో పెద్ద సంఖ్యలో వస్తున్న తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 6వ తరగతిలో సెక్షన్ల వారీగా 160 సీట్లు ఖాళీలు ఉండగా.. క్లస్టర్ పరిధిలోని 12 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మిగిలిన సీట్లను ఇతరులతో భర్తీ చేస్తామన్నారు. స్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత వల్లే అడ్మిషన్లు ప్రక్రియ జాప్యం జరుగుతోందన్నారు హెడ్‌మాస్టర్. ప్రభుత్వం తగినంత మందిని సమకూరిస్తే మరిన్ని సీట్లు సర్దుబాటు చేస్తామన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని సమాధానం ఇచ్చారు. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌ పత్రాలను పేరెంట్స్‌ నుంచి తీసుకున్నారు. సిద్దిపేటలోని ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి చూస్తుంటే గతంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ స్కూల్‌లో కూడా ఇంతే డిమాండ్ ఉండేది. స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండటంతో అక్కడి విద్యార్ధుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్‌ కంటే పోతిరెడ్డిపల్లి హైస్కుల్‌లో చదివించడానికే ఎక్కువ మొగ్గు చూపేవారు. స్కూల్‌లో సీటు కోసం రిఫరెన్స్ లెటర్స్ తెచ్చినప్పటికి అడ్మిషన్లు దొరికేవి కాదు. ప్రస్తుతం సిద్దిపేట జడ్పీ హైస్కూల్‌లో అదే పరిస్థితి తలెత్తిందంటున్నారు స్థానికులు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో కూడా అడ్మిషన్లు లేవని స్కూల్‌ ముందే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది.

 

 

రాయంగ్‌పూర్‌ నుండి రాష్ట్రపతిభవన్ కు




 

గత ఎన్నికల్లో అప్పటి బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ నామినేట్ చేయగా, ఈసారి ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును రంగంలోకి దింపింది.

ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్, గిరిజన గవర్నర్ కూడా.

పదవీ విరమణ తరువాత ఆమె తన సొంత రాష్ట్రం ఒడిశాలో మయూర్‌భంజ్ జిల్లాలోని రాయంగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఇది ఆమె స్వగ్రామం బైదాపోసిలోని బ్లాక్ ప్రధాన కార్యాలయం.

ఝార్ఖండ్ గవర్నర్‌గా పదవీ కాలం పైబడి (ఆరేళ్లకు పైగా) ఆమె పనిచేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ద్రౌపది ముర్ము భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతి కాగలరు. రెండో మహిళా రాష్ట్రపతి కూడా. ఎన్‌డీఏ ఓట్ల పరంగా చూస్తే ఆమె విజయానికి చేరువలో ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశాయి. మాజీ ఐఏఎస్ అధికారి యశ్వంత్ సిన్హా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. చాలాకాలం పాటు ఆయన బీజేపీలోనే ఉన్నారు. కానీ, ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై పలుమార్లు విముఖత ప్రదర్శించారు. ఆయన విధానాలను వ్యతిరేకించారు. దాంతో, పార్టీ విడిచిపెట్టాల్సి వచ్చింది.

తరువాత యశ్వంత సిన్హా, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఆయన కుమారుడు, హజారీబాగ్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ జయంత్ సిన్హా ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు.

భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రధాన అభ్యర్థులిద్దరూ ఝార్ఖండ్‌కు చెందిన వారు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ చిన్న రాష్ట్రంపై అందరి దృష్టి పడింది.

జూన్ 21 సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.

అప్పటికి ఆమె రాయంగ్‌పూర్ (ఒడిశా)లోని తన ఇంట్లో ఉన్నారు. జూన్ 20న తన 64వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. సరిగ్గా 24 గంటల్లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తుందని ఆమె ఊహించి ఉండరు. ఆ తరువాత ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.

"రాష్ట్రపతి పదవికి నన్ను నామినేట్ చేసినందుకు నాకు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. టీవీ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. దీనికి నేను ఎన్నికైతే రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల కోసం పనిచేస్తాను. రాజ్యాంగ నిబంధనలు, హక్కుల ప్రకారం పనిచేస్తాను. ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేను" అని ఆమె మీడియాతో అన్నారు.

అయితే, బీజేపీ ఆమె పేరును నామినేట్ చేయవచ్చనే ఊహాగానాలు ముందు నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆమె పేరు వినిపించింది. కానీ రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ నామినేట్ చేసింది. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు కూడా. ఆయన పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.

ద్రౌపది ముర్ము, 1979లో భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయిన తరువాత, ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

తరువాతి కాలంలో ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. రాయంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కష్టించి పనిచేసే ఉద్యోగిగా ఆమె గుర్తింపు పొందారు.

ద్రౌపది ముర్ము 1997లో వార్డు కౌన్సెలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాయిరంగపూర్ నగర పంచాయతీ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

తరువాత, రాయరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు (2000, 2009లలో) బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత, 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ క్యాబినెట్‌లో (బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం) వివిధ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్య శాఖలతో పాటు జంతు వనరుల శాఖలను నిర్వహించారు.

మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు.

ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ఆమె అందుకున్నారు.

రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఈ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలిగా ఉన్నారు.

దీని తరువాత ఆమెను జార్ఖండ్ గవర్నర్‌గా నామినేట్ చేశారు. క్రమంగా బీజేపీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు.

2015 మే 18న ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు సంవత్సరాలకు పైబడి నెలా 18 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు.

జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నికైన మొదటి గవర్నర్ ఆమె. అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా గవర్నర్‌గా కొనసాగారు.

తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నారు.

 

 

కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసేందుకు ప్రణాళికా రచించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సారూ వర్థంతి ఈ రోజు. 

తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియశీల పాత్ర పోషించినవారిలో ప్రొఫెసర్ జయశంకర్ ముందు వరసలో ఉంటారు. మలిదశ ఉద్యమానికి తన మేధస్సును జోడించి రాష్ట్ర సాధనకు కావాల్సిన కార్యాచరణను రూపొందించారాయన. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రానికి రోడ్డు మ్యాప్ వేశారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్యార్థులు, ప్రజలు, ఉద్యమ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చేదాకా అలుపెరుగని పోరాటం చేశారు. ఇలా కొన్ని కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసేందుకు ప్రణాళికా రచించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి ఈ రోజు. ఉమ్మడి వరంగల్​ జిల్లా అక్కంపేటలో మహాలక్ష్మి, లక్షీకాంతరావు దంపతులకు 1934 ఆగస్టు 6న జయశంకర్​ పుట్టారు. హనుమకొండ, వరంగల్ లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివారు. బెనారస్ యూనివర్సిటీ, అలీగఢ్​​ యూనివర్సిటీ నుంచి వేరు వేరుగా పీజీ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ​ చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఆయనకు మంచి పట్టుంది. ఆరో తరగతి చదివేటప్పుడే స్కూల్​లో నిజాంను పొగుడుతూ పాడిన పాటను బహిష్కరించి వందేమాతరంఅని నినదించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చిన్నతనం నుంచే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మా తెలంగాణ మాగ్గావాలి. స్వయం పాలనలో శాసిస్తాం. కానీ ఇతరుల పాలనలో ప్రస్తుతం యాచిస్తున్నాంఅని బాధపడే వారు. 1952లో ముల్కి విధానాలను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి స్టూడెంట్​ లీడర్​ గా నడుంబిగించారు. లెక్చరర్​ గా సీకేఎం కాలేజీలో చేరిన ఆయన... తన రచనలు, బోధనల ద్వారా తెలంగాణ ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి స్టూడెంట్లకు నూరిపోసి వారిలో చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్నారు. 1954లోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫజిల్ ఆలీ కమిషన్ కు ఓ నివేదిక సమర్పించారు. 1969లో ఆర్.సత్యనారాయణ, శ్రీధరస్వామి మొదలైన పది మంది మేధావులతో ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపచేశారు. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ జనసభను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ ఆవశ్యకత గురించి ఎన్నో రచనలు చేశారు. ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించారు. తెలంగాణ వచ్చిన వెంటనే చెరువులను పునరుద్ధరించి గ్రామీణ వ్యవస్థను సస్యశ్యామలం చేయాలని తహతహలాడారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి పరుగులు పెట్టించారు.

1975 నుంచి 1979 వరకూ సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్ గా, 1979 నుంచి 1981వరకూ కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్ గా, 1982 నుంచి 1991వరకూ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 1994 వరకూ కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ గా పనిచేశారు. 1999-–2000 మధ్య అమెరికాలో పర్యటించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. అప్పట్లోనే తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం(టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటులో జయశంకర్​ ను కేసీఆర్ గురువుగా భావించారు. 2009లో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్​ చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కేసీఆర్​ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసి, చివరి వరకూ బ్రహ్మచారిగా‌‌ జీవనాన్ని కొనసాగించి, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే 2011 జూన్ 21న కనుమూశారు. జయశంకర్ సార్ పేరు మీద ఓ జిల్లాను, ఓ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టినప్పటికీ... ఆయన జయంతి, వర్థంతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదు. పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు తీరేలా ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణను సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు

 

 

తెలంగాణాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీ(టు) ను మారనుందా!!!??


ఉన్నట్టుండి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు మారడాన్ని బట్టి నేతలు కూడా తమ ప్రాధాన్యతలు మార్చుతుంటారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును (Jupallay Krishna Rao)ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. కొంతకాలంగా పార్టీ మారాలనే ఉద్దేశ్యంతో ఉన్న జూపల్లి కృష్ణారావును తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేటీఆర్(KTR) కోరినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జూపల్లిని టీఆర్ఎస్ నాయకత్వం లైట్ తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్(Kollapur) మున్సిపల్ పరిధిలో 10 మంది తన అనుచరులను పోటీలో నిలిపి గెలిపించుకున్నా.. టీఆర్ఎస్(TRS) నాయకత్వం మాత్రం ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టీఆర్ఎస్‌లో జూపల్లి కృష్ణారావు పనైపోయిందనే చర్చ జరిగింది. అయితే ఉన్నట్టుండి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇవ్వకుండా.. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సర్వేలు చేయిస్తోంది. ఆ సర్వేల్లో ఎవరికి మొగ్గు ఉంటే.. వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావుకు నివేదికలు అనుకూలంగా ఉన్నాయని.. అందుకే మరోసారి టీఆర్ఎస్ నాయకత్వం ఆయన వైపు మొగ్గుచూపుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా మళ్లీ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని జూపల్లి గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఆయన క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. నియోజకవర్గంపై తనుకున్న పట్టును మరింతగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటిక నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.

జూపల్లి కృష్ణారావు ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని.. ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా తేలిందని కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ జూపల్లి కృష్ణారావు బీజేపీ వైపు చూస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఆయన అటు వైపు చూడకుండా ఉండేందుకు ముందుగానే రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

కోట్లు ఖర్చు చేసి కట్టిన వంతెనలు-- కొద్దిరోజులు కూడా ఉండటం లేదు

 

 

ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల ప్రజలు వర్షాకాలం వస్తుందంటే భయపడిపోతున్నారు. మండల కేంద్రానికి రావడానికి వాగులు, వంకలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటడానికి వేసిన వంతెనలు నాణ్యతలోపం కారణంగా దెబ్బతిన్నాయి

ప్రజా సమస్యల పట్ల పాలకులే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే..కిందస్థాయిలో పని చేసే వారికి ఏమాత్రం నిజాయితీ ఉంటుంది. ప్రజలకు మౌళిక వసతులు, కనీస సౌకర్యాలను పకడ్బందీగా సమకూర్చాల్సిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ అసమర్ద, అనర్హత కలిగిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతోంది. ఫలితంగా ప్రభుత్వం పరిష్కరించామని చెప్పుకుంటున్న సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. తెలంగాణలోని ములుగు(Mulugu)జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులపై నిర్మించిన వంతెనలు(Bridges),వేసిన రోడ్లే(Roads) ఇందుకు అద్దం పడుతున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం(Eturnagaram) మండలంలోని దొడ్ల (Dodla)గ్రామం దగ్గర ప్రవహించే జంపన్న వాగుపై ప్రభుత్వం ఓ వంతెన నిర్మించింది. 2014వ సంవత్సరం మేడారం జాతర సమయంలో అక్షరాల నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేసి పనుల్ని ప్రారంభించారు. ఏడాది అంటే 2015లోగా వంతెన నిర్మాణం పూర్తైంది. ఆ తర్వాత కురిసిన వర్షాలు, జంపన్నవాగులో నీటి ఉధృతికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. మరుసటి ఏడాది కురిసిన వర్షాలు, వచ్చిన వరద నీటికి వంతెన పూర్తిగా కూలిపోతుందని దొడ్ల గ్రామంతో పాటు చుట్టు పక్కల ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. వంతెన కూలిపోలేదు. ఇప్పటి వరకు పిల్లర్‌ కుంగిపోయి అదే విధంగా ఉంది. దాంతో అధికారులు వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌కు చెడ్డ పేరు రాకుండా కుంగిపోయిన పిల్లర్ కింద జాకీ లాంటి ఇనుప గడ్డర్‌ని సపోర్ట్‌గా పెట్టారు. ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసి చేతులు దులుపుకున్నారు. ఈసారి భారీ వర్షాలు కురిసినా..జంపన్నవాగుకు వరద నీరు ఎక్కువగా వచ్చినా ఈ వంతెన కూలి పోతుందని ఐదు గిరిజన గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే జంపన్న వాగుకు అవతలి వైపున ఉన్న దొడ్ల, కొత్తూరు, మల్యాల, కొండాయి, ఐలాపురం గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇప్పటికే వర్షాకాలం మొదలవడంతో గిరిజన గ్రామాల ప్రజలు వంతెన ఎక్కడ కూలిపోతుందోననే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని ఏజెన్సీలో నివసించే ప్రజలకు రవాణామార్గం అంతంత మాత్రమే. వర్షకాలం వస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. దొడ్ల జంపన్నవాగుపై నిర్మించిన వంతెన ఒక్కటే కాదు ఈసంవత్సరం మేడారం జాతర సమయంలో ప్రయాణానికి వీలుగా ఎలిశెట్టిపల్లి వాగుపై రోడ్డు వేయించారు అధికారులు. దాదాపు 10లక్షలు ఖర్చు చేసి రోడ్డు వేస్తే పట్టుమని 10నెలలు కూడా నిలవలేదు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి అసలు రోడ్డు వేయనట్లుగా పూర్తిగా కొట్టుకుపోయింది. అందుకే ఎలిశెట్టిపల్లి వాగు దగ్గర తాత్కాలిక రోడ్లు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా వంతెన నిర్మించాలని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

జేఈఈ  మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్

 

అగ్నిపథ్ (Agneepath) నిరసనల నేపథ్యంలో జేఈఈ  మెయిన్‌ను (JEE Mains) వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. #postponejeemains2022 అనే

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చేపడతుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంలో జూన్ 20 నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ పేర్కొంది. ఇటీవల ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేసినప్పుడు, జేఈఈ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరుగుతాయని తెలిపింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానం అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో తమ ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం కష్టంగా మారుతుందని పేర్కొంటూ, జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల అభ్యర్థనలపై ఎన్‌టీఏ ఇంతవరకు స్పందించలేదు. మరోపక్క పరీక్షకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నా... ఇప్పటివరకు అడ్మిట్ కార్డును విడుదల చేయలేదు. సాధారణంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేస్తారు. కానీ, ఈసారి పరీక్షకు ప్రస్తుతం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ కోసం దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. #postponejeemains2022 అనే యాష్ ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు. ఓ ఔత్సాహిక అభ్యర్థి టిట్టర్‌లో ఇలా స్పందించాడు..‘‘ అగ్ని‌పథ్‌కు నిరసనగా కొన్ని రాష్ట్రాల్లో అల్లరు జరుగుతున్నాయి. దీంతో ఇన్ టైంలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోతున్నాం. మా వాయిస్‌ను వినిపించడానికి హెల్ప్ చేయండి.’’ అంటూ కోరాడు.

మరో అభ్యర్థి ఇలా ట్వీట్ చేశాడు.. ‘‘అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ చేరుకున్నా, ప్రశాంతంగా పరీక్ష రాయలేరు. కాబట్టి, జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయండి. ఎందుకంటే ఇది సులువైన పరీక్ష కాదు, విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.’’ అని పేర్కొన్నాడు.

ఇంకో అభ్యర్థి ఇలా స్పందించాడు. ‘‘అగ్నిపథ్ నిరసనల కారణంగా చాలా రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో జేఈఈ పరీక్ష సెంటర్ల నగరాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. దయచేసి జేఈఈ మెయిన్‌ను వాయిదా వేయండి.’’ అంటూ విజ్ఞప్తి చేశాడు.#Postponejeemains2022 అనే యాష్ ట్యాగ్‌ను ప్రధాని మోదీ, ఎన్‌టీఏ‌కు ట్యాగ్ చేశాడు.

ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు విదేశాల్లో కొత్తగా 22 నగరాల్లో నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి తర్వాత విదేశాల్లో పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో అగ్నిపథ్ నిరసన కారణంగా అనేక రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో తమ ప్రయాణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థులు వాపోతున్నారు. కాబట్టి జేఈఈ మెయిన్ వాయిదా వేయాలని కోరుతున్నారు

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...