Tuesday 21 June 2022

 

కోట్లు ఖర్చు చేసి కట్టిన వంతెనలు-- కొద్దిరోజులు కూడా ఉండటం లేదు

 

 

ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల ప్రజలు వర్షాకాలం వస్తుందంటే భయపడిపోతున్నారు. మండల కేంద్రానికి రావడానికి వాగులు, వంకలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటడానికి వేసిన వంతెనలు నాణ్యతలోపం కారణంగా దెబ్బతిన్నాయి

ప్రజా సమస్యల పట్ల పాలకులే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే..కిందస్థాయిలో పని చేసే వారికి ఏమాత్రం నిజాయితీ ఉంటుంది. ప్రజలకు మౌళిక వసతులు, కనీస సౌకర్యాలను పకడ్బందీగా సమకూర్చాల్సిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ అసమర్ద, అనర్హత కలిగిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతోంది. ఫలితంగా ప్రభుత్వం పరిష్కరించామని చెప్పుకుంటున్న సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. తెలంగాణలోని ములుగు(Mulugu)జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులపై నిర్మించిన వంతెనలు(Bridges),వేసిన రోడ్లే(Roads) ఇందుకు అద్దం పడుతున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం(Eturnagaram) మండలంలోని దొడ్ల (Dodla)గ్రామం దగ్గర ప్రవహించే జంపన్న వాగుపై ప్రభుత్వం ఓ వంతెన నిర్మించింది. 2014వ సంవత్సరం మేడారం జాతర సమయంలో అక్షరాల నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేసి పనుల్ని ప్రారంభించారు. ఏడాది అంటే 2015లోగా వంతెన నిర్మాణం పూర్తైంది. ఆ తర్వాత కురిసిన వర్షాలు, జంపన్నవాగులో నీటి ఉధృతికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. మరుసటి ఏడాది కురిసిన వర్షాలు, వచ్చిన వరద నీటికి వంతెన పూర్తిగా కూలిపోతుందని దొడ్ల గ్రామంతో పాటు చుట్టు పక్కల ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. వంతెన కూలిపోలేదు. ఇప్పటి వరకు పిల్లర్‌ కుంగిపోయి అదే విధంగా ఉంది. దాంతో అధికారులు వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌కు చెడ్డ పేరు రాకుండా కుంగిపోయిన పిల్లర్ కింద జాకీ లాంటి ఇనుప గడ్డర్‌ని సపోర్ట్‌గా పెట్టారు. ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసి చేతులు దులుపుకున్నారు. ఈసారి భారీ వర్షాలు కురిసినా..జంపన్నవాగుకు వరద నీరు ఎక్కువగా వచ్చినా ఈ వంతెన కూలి పోతుందని ఐదు గిరిజన గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే జంపన్న వాగుకు అవతలి వైపున ఉన్న దొడ్ల, కొత్తూరు, మల్యాల, కొండాయి, ఐలాపురం గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇప్పటికే వర్షాకాలం మొదలవడంతో గిరిజన గ్రామాల ప్రజలు వంతెన ఎక్కడ కూలిపోతుందోననే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని ఏజెన్సీలో నివసించే ప్రజలకు రవాణామార్గం అంతంత మాత్రమే. వర్షకాలం వస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. దొడ్ల జంపన్నవాగుపై నిర్మించిన వంతెన ఒక్కటే కాదు ఈసంవత్సరం మేడారం జాతర సమయంలో ప్రయాణానికి వీలుగా ఎలిశెట్టిపల్లి వాగుపై రోడ్డు వేయించారు అధికారులు. దాదాపు 10లక్షలు ఖర్చు చేసి రోడ్డు వేస్తే పట్టుమని 10నెలలు కూడా నిలవలేదు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి అసలు రోడ్డు వేయనట్లుగా పూర్తిగా కొట్టుకుపోయింది. అందుకే ఎలిశెట్టిపల్లి వాగు దగ్గర తాత్కాలిక రోడ్లు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా వంతెన నిర్మించాలని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...