Wednesday 7 September 2022

 

కింగ్స్‌వే. రాజ్పథ్. కర్తవ్యపథ్



 

రాజ్‌పథ్... స్వతంత్ర భారతదేశంలో అనేక తరాలు ఈ పేరు వింటూ పెరిగాయి. దిల్లీలోని రాజ్‌పథ్ అనగానే భారత గణతంత్రదినోత్సవ సంబరాలు గుర్తుకొస్తాయి.

 

ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలైన రాజ్పథ్, సెంట్రల్ విస్టా ప్రాంతాల రహదారికి కర్తవ్యపథ్గా పేరు పెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. బానిసత్వ, బ్రిటీష్ పాలనను గుర్తుకు తెచ్చే ఈ పేర్లను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఈ రోడ్ల పేర్లను మార్చనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ బుధవారం ప్రత్యేక సమావేశంలో తీర్మానించింది. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న రోడ్డును ఇకపై కర్తవ్యపథ్గా మార్చనున్నారు

రాజ్‌పథ్‌లో కూర్చొని రిపబ్లిక్ డే పరేడ్‌ను, సైనిక విన్యాసాలను చూడటం ఒక మరపురాని అనుభూతి. ఇప్పుడు దీని పేరు మార్చాలనే చర్చ నడుస్తోంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడువున్న రాజ్‌పథ్‌ లుక్‌ను మార్చారు. దీనికి ఇప్పుడు 'కర్తవ్యపథ్' అనే పేరు పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

'న్యూదిల్లీ' నిర్మాణం పూర్తి అయినప్పుడు వైశ్రాయ్ హౌస్(నేటి రాష్ట్రపతి భవన్) నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మార్గానికి 'కింగ్స్‌వే' అని పేరు పెట్టారు. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ప్రొఫెసర్ పెర్సివల్ స్పియర్ ఈ పేరు ఇచ్చారు. 1924-40 వరకు ఆయన ఆ కాలేజీలో చరిత్రను బోధించారు.

న్యూదిల్లీలోని చాలా రోడ్లకు పెర్సివల్ సలహా మేరకే నాటి బ్రిటిష్ ప్రభుత్వం పేర్లు పెట్టింది. అక్బర్ రోడ్, పృథ్వీరాజ్ రోడ్, షాజహాన్ రోడ్ వంటివి అందులో కొన్ని. ఆయన టీచర్ మాత్రమే కాదు పరిశోధకుడు కూడా. భారతదేశ చరిత్ర మీద కూడా ఆయన పుస్తకాలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన దగ్గరగా గమనించారు. కానీ ఆ పోరాటాన్ని ఆయన వ్యతిరేకించలేదు. దానికి మద్దతు కూడా తెలుపలేదు. ఒక సాక్షిగా మాత్రమే ఉన్నారు.

సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పెర్సివల్ స్పియర్ చేరారు. భారతదేశం నుంచి వెళ్లిపోయిన తరువాత ఆయన అనేక పుస్తకాలు రాశారు.

ఇండియా, పాకిస్తాన్ అండ్ ది వెస్ట్(1949), ట్విలైట్ ఆఫ్ ది మొఘల్స్(1951), ది హిస్టరీ ఆఫ్ ఇండియా(1966) వంటి పుస్తకాలు అందులో ముఖ్యమైనవి.

స్వాతంత్ర్యం తరువాత 'రాజ్‌పథ్'

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1961లో ఆ పేరును 'రాజ్‌పథ్'గా మార్చారని న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) మాజీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ మదన్ థపలియాల్ తెలిపారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు ఉండే మార్గాన్ని 'రాజ్‌పథ్' అంటారు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరిగేది ఇక్కడే.

న్యూదిల్లీ నిర్మాణం గురించి మాట్లాడుకునేటప్పుడు సిటీని డిజైన్ చేసిన వారి గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాజ్‌పథ్‌తో పాటు దిల్లీలోని అనేక విశాలమైన రహదారులను నిర్మించిన ఆ వ్యక్తి మాత్రం ఎవరికీ గుర్తు ఉండరు. ఆయనే సర్దార్ నారాయణ్ సింగ్.

న్యూదిల్లీ నగరాన్ని నిర్మించేటప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. విశాలమైన రోడ్లు వేశారు. అందమైన పార్కులు నిర్మించారు. ఈ పనులు చేయడానికి 1920లలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం పనులు అప్పగించింది. అలా దిల్లీలో రోడ్లు వేసే కాంట్రాక్ట్ సర్దార్ నారాయణ్ సింగ్‌కు వచ్చింది.

న్యూదిల్లీ చీఫ్ డిజైనర్ ఎడ్విన్ ల్యుటెన్సీ, ఆయన పార్టనర్ హెర్బర్ట్ బేకర్‌లు నేడు రాజ్‌పథ్‌గా పిలుస్తున్న మార్గాన్ని నిర్మించే బాధ్యతను కూడా నారాయణ్ సింగ్‌కు అప్పగించారు.

ఆయన న్యూదిల్లీలో అద్భుతమైన రోడ్లు నిర్మించారు. ముందుగా పెద్దపెద్ద రాళ్లను కింద వేసేవారు. వాటి మీద ఇసుక, తారు వేసి రోడ్లు నిర్మించేవారు. సుమారు 20 ఏళ్లపాటు రోడ్లు చెక్కుచెదరకుండా ఉండాలన్నది నారాయణ్ సింగ్ ఆలోచన.

నేడు రాజ్‌పథ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కంకర, తారుతో రోడ్లు సులభంగా వేస్తున్నారు. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నుతాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా గుర్రాలు, ఒంటెల నుంచి భారీ యుద్ధట్యాంకుల వరకు రాజ్‌పథ్ మీద కనిపిస్తాయి. రాజ్‌పథ్ మొదలయ్యే దగ్గర ఒకవైపు సౌత్ బ్లాక్ మరొకవైపు నార్త్ బ్లాక్ ఉంటాయి.

జంతర్ మంతర్ అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి తరచూ జరిగే ధర్నాలు. రెండు 1724లో మహారాజ జై సింగ్-2 నిర్మించిన ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ. దీనికి ఎదురుగా ఉండే వీధికి రెండు వైపులా ఉండే విశాలమైన బంగ్లాలను అయిదుగురు భారతీయ కాంట్రాక్టర్లు నిర్మించారు.

వారే ధరమ్ సింగ్ సేథీ, శోభా సింగ్, విశాఖ సింగ్, నారాయణ్ సింగ్. సర్దార్ నారాయణ్ సింగ్ కుటుంబం నేటికీ దిల్లీలోనే నివసిస్తోంది. తన కోసం ధరమ్ సింగ్ కట్టుకున్న ఇల్లు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైంది. ఆ తరువాత 1970లలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అక్బర్ రోడ్‌కు మారింది.

వైశ్రాయ్ హౌస్‌తోపాటు నార్త్, సౌత్ బ్లాకులకు నిరంతరం రాళ్లు తరలించే కాంట్రాక్టును ధరమ్ సింగ్ దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని ధౌల్‌పుర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి రాళ్లను తరలించే వారు.

ధరమ్ సింగ్‌తో కలిసి ఒకే ప్లాటులో ఒక బంగ్లా కట్టారు శోభా సింగ్. ఆ తరువాత అక్కడ కేరళ హౌస్ కట్టారు.

ఎన్నో ఏళ్లుగా దిల్లీ వాసులు రాజ్‌పథ్‌కు రెండు వైపులా ఉండే పచ్చని గడ్డి మైదానాల మీద కూర్చొని చలి కాలంలో సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, రైల్ భవన్‌లో పని చేసే వారు పేకాట ఆడుకుంటూనో లేక మధ్యాహ్నం భోజనం చేస్తూనో అక్కడ సేదతీరుతుంటారని చెబుతుంటారు.

కానీ ఇప్పుడు రాజ్‌పథ్‌లోని అనేక చెట్లను నరికివేశారు. వాటి వయసు సుమారు 90 ఏళ్లు. ఇక్కడి నేరుడు చెట్ల కాయలు తింటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాడు రాజ్‌పథ్ నిర్మిస్తున్నప్పుడు చెట్లను కూడా నాటారు. నాడు చెట్లను నాటించిన ఎడ్విన్ ల్యుటెన్సీ ఉద్యాన విభాగం సలహాదారు డబ్ల్యూఆర్ మస్టో, శీతకాలంలో ఆకురాల్చే చెట్లను నాటించలేదు. ఆ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు.

ఇక్కడి పార్కులను రాజస్థాన్ నుంచి వచ్చిన తోటమాలులు అందంగా తీర్చిదిద్దుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజాంఘర్, ఫైజాబాద్ నుంచి కూడా తోటమాలులు దిల్లీకి వస్తున్నారు. వీరంతా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వీరంతా రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్ లేదా దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరిలో రెండు మూడు తరాలుగా ఈ పని చేస్తున్న వారు కూడా ఉన్నారు.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...