Tuesday 5 July 2022

 

పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చిన కలెక్టర్..

 

సాధారణంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ పిల్లల్ని పెద్ద పేరున్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పంపుతుంటారు. అలాంటి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలవైపు చూడరన్న ప్రచారమూ లేకపోలేదు. ఐతే ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదువు అందుతుందని.. అక్కడ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని నిరూపించేందుకు ఓ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో Andhra Pradesh లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఏపీ ఐఏఎస్ ఆఫీసర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను Vijayawada పడమటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించారు.

మంగళవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో స్కూళ్లను తెరిచారు. దీంతో ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మీ.. తన ఇద్దరు పిల్లలను స్కూల్ కు తీసుకెళ్లి అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు చక్కగా ఉండటం, క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్స్ అన్నీ అభివృద్ధి చేయడంతో తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించినట్లు ఆమె తెలిపారు. గతంలో నెల్లూరు  జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి.. అప్పుడు కూడా తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివించారు. గతేడాది తన కుమార్తె ఎన్‌.అలెక్స్ శృతిని పొద‌ల‌కూరు రోడ్డులోని ద‌ర్గామిట్ట జెడ్పీ ఉన్న‌త పాఠ‌శాల‌లో, కుమారుడు ఎన్‌.క్రిష్ ధ‌ర‌ణ్‌రెడ్డిని వేదాయ‌పాళెం స్పిన్నింగ్ మిల్లు కాల‌నీ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 

 

చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య!

 

సరళవాస్తు నిపుణుడిగా కర్ణాటకలోనే కాక ఇతర రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్‌ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ జిల్లా కేంద్రంలోని ప్రెసిడెంట్‌ హోటల్‌లో ఈ దారుణం జరిగింది. ఆయన మాజీ శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు రివీల్ చేశారు. చంద్రశేఖర్‌ గురూజీ దగ్గర పని చేస్తున్న మహంతేష్‌ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు

 ఆయన చెప్పే వాస్తు సూచనలు ఇతర భాషల్లోకీ ట్రాన్స్‌లేట్ అవుతున్నాయంటే పాపురాలిటీ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన చంద్రశేఖర్ గురూజీ వాస్తు సూచనలను టీవీల్లో సైతం కోట్ల మంది వీక్షిస్తుంటారు. కర్ణాటకలోని వాస్తు నిపుణుల్లో దాదాపు టాప్ పొజిషన్ లో ఉన్న ఆయన అతి దారుణంగా హత్యకు గురయ్యారు. వాస్తు సూచనల కోసం భక్తుల ముసుగులో వచ్చిన దుండుగులు పట్టపగలే, కెమెరాల సాక్షిగా ఆయనను పొడిచిచంపారు. అయితే, హంతకులు గురూజీ మాజీ శిష్యులేనని వెల్లడైంది.

చంద్రశేఖర్ గురూజీని హుబ్లీలోని హోటల్ లో హతమార్చినప్పటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. నిందితుల్లో ఒకడు.. గురూజీ కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 60 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్‌ నుంచి తప్పించుకున్నారు. హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. హోటల్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల సాయంతో నిందితులను వెంటాడారు. హత్య జరిగిన 4 గంటల్లోనే బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు హుబ్లీ పోలీస్‌ కమిషనర్‌ లాభురాం వెల్లడించారు. కాగా,

వాస్తు నిపుణుడి హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. చంద్రశేఖర్‌ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్‌ పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు సమాచారం. కొంతకాలం కిందట మహంతేష్ ను శిష్యరికం నుంచి తొలగించిన గురూజీ.. తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేసేవారని, అందుకు మహంతేష్‌ నిరాకరిస్తున్నాడని, ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చిన సమయంలోనే హత్యాకాండ చోటుచేసుకుందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

 

 

 

మాంద్యం గుబులు!!!

ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్‌ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్‌ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి.  ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. 

ఈ నేపథ్యంలో భారత్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్‌ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది.

 

 

వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు..


హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌లో సర్వీస్‌ ఛార్జీ విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది

హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌ (Food Bill)లో సర్వీస్‌ ఛార్జీ (Service Charge) విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల (Service Charge) విధింపునకు సంబంధించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ చర్యలు తీసుకుంది. వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫిర్యాదు చేసేందుకు 1915 నంబర్‌కు కాల్ చేయవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

2020 జులైలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి, అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి CCPAని తీసుకొచ్చారు. రెస్టారెంట్లు, హోటళ్ల ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడానికి సంబంధించి ఐదు ప్రధాన మార్గదర్శకాలను CCPA జారీ చేసింది. అవేంటంటే..

ఏ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులో ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీని జోడించకూడదు.

- ఏ ఇతర పేరుతో వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.

- ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారుని సర్వీస్ ఛార్జీని చెల్లించమని బలవంతం చేయకూడదు, సర్వీస్ ఛార్జీని వినియోగదారులు స్వచ్ఛందంగా అందిస్తేనే తీసుకోవాలి.

 సర్వీస్‌ ఛార్జీ వసూలు ఆధారంగా సేవల ప్రవేశం లేదా సదుపాయంపై ఎటువంటి పరిమితి విధించకూడదు

- ఫుడ్‌ బిల్‌తో కలిపి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.. ఈ మొత్తానికి GST కూడా విధించకూడదు

వినియోగదారుడు తన బిల్లులో సర్వీస్ ఛార్జ్ లెవీని గుర్తిస్తే.. ముందుగా, బిల్లు నుంచి సర్వీస్ ఛార్జీని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్‌కి సూచించవచ్చు. లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఫిర్యాదు చేయవచ్చు. 1915 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా NCH Mobile యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా వినియోగదారు కమిషన్‌కు లేదా edaakhil పోర్టల్, http://www.edaakhil.nic.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా CCPA ద్వారా విచారణ, తదుపరి చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును చేసే అవకాశం ఉంది. com-ccpa@nic.inకి ఇమెయిల్ పంపడం ద్వారా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు CCPA ముందుగా వినియోగదారులను అడగకుండా లేదా తెలియజేయకుండా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించే రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంది. జూన్ 2, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం, హోటల్‌లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల విధింపుపై రెస్టారెంట్ అసోసియేషన్లు, వినియోగదారుల సంస్థలతో సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం తరువాత, సర్వీస్‌ ఛార్జీ విధించడాన్ని నిషేధించిన 2017 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఒక రోజు తర్వాత, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఛార్జీలు చెల్లించమని రెస్టారెంట్లు వినియోగదారులను అడగలేవని, ఇలా చేస్తే అసలు ధర ఏమిటో ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...