Monday 27 June 2022

 

 

మ‌హారాష్ట్ర‌లో తేలిక కాక‌పోవ‌చ్చు


మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతూ ఉంది. మెజారిటీ శివ‌సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు క్యాంపులో త‌ల‌దాచుకున్నారు. వీరి సంఖ్య 40 వ‌ర‌కూ ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తిరుగుబాటు దార్లు ఇప్ప‌టి వ‌ర‌కూ సొంత రాష్ట్రంలో అడుగుపెట్ట‌లేదు. వారికి కేంద్ర బ‌ల‌గాల ర‌క్ష‌ణ ఇవ్వ‌నుంద‌ట కేంద్రంలోని ప్ర‌భుత్వం. ఆ బ‌లాగాల స‌హ‌కారంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మ‌హారాష్ట్ర‌లోకి అడుగుపెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు క‌నీసం 145 మంది ఎమ్మెల్యేల బ‌లం అవ‌స‌రం. అధికారికంగా అయితే కూట‌మి ప్ర‌భుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. వారిలో శివ‌సేన‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు తో ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డిన‌ట్టే! 

అయితే శాస‌న‌స‌భ‌లో విశ్వాస లేదా అవిశ్వాస ప‌రీక్ష జ‌రిగితేనే ఈ నంబ‌ర్ గేమ్ క్లైమాక్స్ కు వ‌స్తుంది. తిరుగుబాటు దార్ల‌లో కొందరిపై వేటు వేయ‌డం ద్వారా, వారిని ఎమ్మెల్యేలుగా అన‌ర్హులుగా చేయ‌డం ద్వారా మిగిలిన వారిని దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అవలంభించాల‌ని శివ‌సేన నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్టుగా ఉంది. అయితే తిరుగుబాటు దార్లు సుప్రీం కోర్టుకు వెళ్లి త‌మ‌పై చ‌ర్య‌ల‌కు తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు!

ఈ క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం త‌దుప‌రి ఘ‌ట్టం కాబోలు. బీజేపీకి సొంతంగా 106 మంది ఎమ్మెల్యేలున్నారు. తిరుగుబాటు దార్ల స‌హ‌కారంతో బీజేపీ గ‌నుక ప్ర‌భుత్వాన్ని కూల్చేస్తే.. త‌ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నాలు సాగించ‌వ‌చ్చు. శివ‌సేన తిరుగుబాటు దార్లంతా బీజేపీ వైపు న‌డిస్తే.. వీరికి ఏ స్వ‌తంత్రులో, కూట‌మిలోని చోటా పార్టీలు స‌హ‌క‌రిస్తే.. అప్పుడు బీజేపీ క‌నీస మెజారిటీకి చేరువ అవుతుంది.

అయితే...  బీజేపీ అంత చేస్తుంటే ఠాక్రే, ప‌వార్ లు చూస్తూ కూర్చోక‌పోవ‌చ్చు. త‌మ వైరి ప‌క్షానికి అవ‌కాశం ల‌భించ‌క‌ముందే.. ప్ర‌భుత్వం ర‌ద్దుకు కూడా పూనుకోవ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే గ‌వ‌ర్న‌ర్ చేతుల్లోకి గేమ్ వెళ్లిపోవ‌చ్చు! బీజేపీ కి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చిన‌ట్టే అవుతుంది. 

కానీ క‌ల‌గాపుల‌గం ప్ర‌భుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయ‌గ‌ల‌దా? ఏర్పాటు చేసినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో ప‌ని జ‌రుగుతుందాకొన్నాళ్ల‌కు అయినా.. వారిపై వేటు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇది వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లోనూ ఇలానే జ‌రిగింది. అయితే క‌ర్ణాట‌క‌లో తిరుగుబాటు దార్లు కొంత‌మంది నెగ్గారు. 

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల‌ను చీల్చుకుంటూ వ‌చ్చింది. దీంతో.. ప్ర‌భుత్వం న‌డుస్తోంది. అయితే మ‌హారాష్ట్ర‌లో అదంత తేలిక కాక‌పోవ‌చ్చు క‌మ‌లం పార్టీకి!

 

 

నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి

 

పాములపర్తి వెంకట నరసింహారావు - పొట్టి చేస్తే, పీవీ నరసింహారావు - ఇంకా పొట్టి చేస్తే పీవీ అనే వామనుడు, బక్కపలచనివాడు, నిరంతరమూ నిశ్శబ్దాన్ని కప్పుకునేవాడు, బహుభాషాపండితుడు, రాజకీయంగా ఎలాంటి బలమూ లేనివాడు భారతదేశ ప్రధాని కావడమే ఒక అద్భుతం! స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చగలిగిన అద్భుతం బహుశా మరొకటి లేదు. ఇది నిజానికి 'చాయ్ వాలా' ప్రధాని కావడాన్ని మించిన విశేషం.

చాయ్ వాలా ప్రధాని కావడం అంత హఠాత్తుగా ఏమీ జరగలేదు. దానికి కనీసం రెండేళ్ల పూర్వరంగం ఉంది. పీవీకి అలాంటిదేమీలేదు.

1991లో ఇక రాజకీయ సన్యాసం తీసుకుందామని ఆయన నిర్ణయించుకుని పెట్టేబేడా సర్దుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఆయన నిజంగానే సన్యాసం తీసుకుని, తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఉన్నశ్రీ సిద్ధేశ్వరపీఠానికి అధిపతి కావాలనుకున్నట్టు వదంతులు ప్రచారంలో ఉండేవి. చివరికి, లోక్ సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతర పరిస్థితులలో ప్రధానిగా కేంద్రప్రభుత్వ అధిపతి అయ్యారు.

1950 దశకం నుంచి 1970 దశకం వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ 1977లో లోక్‌సభకు ఎన్నికై 1980 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి గొప్ప నిర్ణయాలు చేశారో, సమూల పరివర్తనకు దారి తీయగల ఎలాంటి చర్యలు తీసుకున్నారో గత రెండుతరాల తెలుగువారికి సైతం ఒక అభిప్రాయం ఉన్నట్టు లేదు.

తెలుగు అకాడెమీ స్థాపన ఆయన ఆలోచనే అంటారు కానీ, ఆ అకాడెమీ తెలుగుభాషకు ఎంత గొప్ప దోహదం చేసిందో లోతుగా చూస్తే తప్ప చెప్పలేం. ఎప్పుడూ మౌనముద్రాంకితుడిగా, గంభీరుడిగా కనిపించే పీవీలో హాస్యం లేదనుకుంటారు కానీ, తెలుగు అకాడెమీతో ముడి పెట్టి ఆయన హాస్యచతురతను సీనియర్ పాత్రికేయులు ప్రస్తావిస్తూ ఉంటారు.

ఒకసారి తనను కలసిన కొందరు పాత్రికేయులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు చెబుతున్నప్పుడు.. ఉద్యోగం లేకుండా ఏవో ఉద్యమాలలో తిరుగుతూ ఉండే ఒక యువకుడి ప్రస్తావన వచ్చిందట. ఆ యువకుడు పీవీకి కాస్త దగ్గరి బంధువు కూడా. "పాపం అతగాడు ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి తెలుగు అకాడెమీలో ఉద్యోగం ఇప్పించకూడదా?" అని పీవీతో చనువున్న ఒక పాత్రికేయుడు అన్నాడట. అప్పుడు పీవీ, "అదెట్లా కుదురుతుందయ్యా? అందులో పండితులు పనిచేస్తారట కదా?!" అన్నారట.

అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన భూసంస్కరణల అమలుకు చొరవ తీసుకున్న సంగతీ, దాని పర్యవసానాల గురించీ ఆయన ఆత్మకథాత్మక రచన 'ది ఇన్ సైడర్' (తెలుగులో 'లోపలి మనిషి')ద్వారా ఎంతో కొంత తెలుస్తోంది తప్ప తెలుగునాట అది కూడా పెద్ద ప్రచారంలో లేదు.

ఇక 1980-91 మధ్యలో ఆయన కేంద్రమంత్రిగా ఫలానా గొప్ప చర్యలు తీసుకున్నారని కూడా పెద్దగా ఎవరూ చెప్పుకోరు. ఆయన ఆలోచనా ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఒకింత మినహాయింపు.

ఆయన 'తీసుకోని చర్యలు' మాత్రం కొన్ని ప్రచారంలో ఉన్నాయి. భోపాల్‌లో వేలాదిమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ దుర్ఘటన దరిమిలా భారత్‌కు వచ్చిన ఆ సంస్థ అధిపతి వారెన్ ఆండర్సన్, కేంద్రంలోని పెద్దల అండదండలతో అరెస్టును తప్పించుకుని అమెరికాకు జారుకున్నప్పుడు పీవీ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు.

అలాగే, అదే సంవత్సరం (1984) అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణహత్యకు గురైనప్పుడు, ఆ వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కుల ఊచకోత జరిగినప్పుడు ఆయనే హోం మంత్రిగా ఉన్నారు.

ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాబోలు, "ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే"నని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రధాని అవడాన్ని ఆయన తెలుగు సోదరులు చాలామంది హర్షించినట్టు లేరు. "ఆయనేమిటిప్రధానమంత్రి కావడమేమిటి?" అని తూలనాడుతూ అప్పట్లో ఎన్నో ఉత్తరాలు పత్రికాఫీసులకు వచ్చిపడడం ఈ వ్యాసకర్తకు తెలుసు. కేంద్రమంత్రిగా, (ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా) తెలుగు ప్రాంతాలకు ఆయన ఏమీ చేయలేదన్న విమర్శ ఉంది.

ఆర్థిక సంస్కరణలు.. పీవీపై ప్రశంస-విమర్శ

నిశ్శబ్దాన్ని కప్పుకుని హఠాత్తుగా ప్రధాని గద్దె మీద ప్రత్యక్షమైన పీవీ పాలనా దక్షత గురించి కూడా బహుశా మొదట జనం అంతే నిశ్శబ్దం పాటించి ఉంటారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పరిణామం సంభవించి జనాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అప్పటినుంచే కాబోలు జనం పీవీని ఒకింత నిశితంగా, జాగ్రత్తగా; బహుశా వారిలో చాలామంది ఒకింత ప్రశంసాభావంతోనూ గమనిస్తూవచ్చారు.

అది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీమారక నిల్వల తరుగుదల వగైరాల రూపంలో 1985లోనే క్రమంగా మొదలై, 1991 నాటికి విషమించి, దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి దారితీసిన ఆర్థిక సంక్షోభం. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం జనంలో ఆందోళన రేకెత్తించింది.

సరిహద్దుల్లో యుద్ధమే కానీ, ప్రాకృతిక ఉత్పాతాలే కానీ, కీలక రాజకీయపరిణామాలే కానీ-ఎలాంటివి సంభవించినా సాధారణంగా ప్రభావితం కాని భద్రస్థితిలో ఉండే మధ్యతరగతి బహుశా ఈ ఆర్థిక సంక్షోభంతోనే మొదటిసారి ఎక్కువ ప్రభావితమైనట్టుంది. ఆ క్షణాలలో తన కాళ్ళ కింద నేల తొలచుకుపోతున్నట్టు మధ్యతరగతి ప్రజలు భావించడంలో ఆశ్చర్యం లేదు.

తను వస్తూనే వెంటనే రంగంలోకి దిగి, డా. మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఆర్థికసరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికతను సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీపై మధ్యతరగతి విద్యావంతులలోని ఒక వర్గంలో ప్రశంసాభావం పుంజుకుని అనంతర పరిణామాలతో మిన్నంటింది.

అదే సమయంలో వారిలోనే మరొక వర్గం నుంచి ఆర్థిక సరళీకరణపై విమర్శలూ వెల్లువెత్తాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ పీవీపై ప్రశంస-విమర్శ సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి.

నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక కుదుపుతో ఒక అంగ వేయించినవాడు పీవీ నరసింహారావు. ఇవ్వాళ మనం చూస్తున్న భారత్ ఆ సంస్కరణల ఫలితమే.

ఉగ్రవాదంతో ఉడుకుతున్న పంజాబ్‌ను దారికి తేవడం వంటి పీవీ సాఫల్యాలు మరికొన్ని ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, పీవీ గురించి చెప్పుకునేటప్పుడు ఆయన ధరించిన నిశ్శబ్దత అనే ముసుగు, లేదా మౌనం మాటి మాటికీ ప్రస్తావనకు వస్తుంది, తప్పదు. ఆ నిశ్శబ్ద వ్యవహరణ దేశానికి ఏమైనా మంచో, చెడో చేసిందేమో కానీ; వ్యక్తిగతంగా శత్రువులను, అనుమానితులను, మాపుకోలేని కొన్ని కళంకాలను పెంచింది తప్ప ఆయనకు మంచి చేసినట్టు లేదు.

చివరికి చనిపోయాక మాజీ ప్రధానిగా ఆయనకు ఢిల్లీలో కాస్తంత సమాధిస్థలం కూడా దొరకలేదు. నిరంతరాయంగా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వం గురించి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ, ఆ కుటుంబానికి చెందని పీవీ ప్రధానమంత్రి అయి, సాపేక్షంగా సమర్థంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన సంగతిని విశేషంగా ప్రచారం చేసుకునే బదులు ఆయన పట్ల కక్షధోరణిలో వ్యవహరించి తనకు తానే చెరుపు చేసుకుందనిపిస్తుంది. ఆశ్చర్యంలేదు.

ఇన్నేళ్ల అస్తిత్వంలో దాని మెదడు మోకాల్లోకి వచ్చింది!

ప్రధానిగా పీవీ తెచ్చుకున్న మాపుకోలేని కళంకం, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారని, అప్పటినుంచి వినిపిస్తున్న విమర్శ అలా ఉండగా, బాబ్రీ మసీదు కూలిపోతేనే మంచిదనుకుని ఆయన కావాలనే నిద్ర నటించారా లేక, మసీదు జోలికి వెళ్లబోమని యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను నిజంగానే నమ్మి మోసపోయారా అన్నది కచ్చితంగా మనకు తెలియదు.

బాబ్రీ మసీదు కూలిపోతే, బీజేపీ శాశ్వత అప్రతిష్ఠను మూటగట్టుకోవడమే కాక, దాని చేతిలోని ఒక రాజకీయఆయుధం మాయమై, దాని బలం క్షీణిస్తుందని ఆయన అనుకున్నారా?! లేక, ఆయన సైతం 'ఒక హిందువు'గా బాబ్రీ మసీదు పతనాన్ని కోరుకున్నారా?! మనకు స్పష్టంగా తెలియదు.

ఈ సందర్భంలో ఒక సామ్యాన్ని చెప్పుకోవాలి. అద్వానీ అయోధ్యకు రథయాత్ర ప్రారంభినప్పుడు, ఆ యాత్రను యూపీ, బీహార్‌లలోకి రాకుండా అడ్డుకుంటామని ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు పదే పదే భీషణ ప్రతిజ్ఞలు చేసి, వాస్తవానికి రథయాత్ర టెంపోను పెంచి బీజేపీ లాభపడడానికే పరోక్షంగా దోహదం చేశారు.

ఇందుకు భిన్నంగా పీవీ తన హయాంలో, మురళీ మనోహర్ జోషీ శ్రీనగర్‌కు యాత్రగా వెళ్ళి జాతీయపతాకాన్ని ఎగురవేస్తానన్నప్పుడు, నిరభ్యంతరంగా ఆ పని చేసుకోవచ్చుననీ, అందుకు అవసరమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రతిఘటన లేక ఆ యాత్ర నీరుగారింది. బాబ్రీ మసీదు విషయంలో కూడా పీవీ అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలనుకున్నారా?! ఏమో!

బాబ్రీ మసీదు పతనంలో పీవీ పాత్రకు సంబంధించిన పూర్వాపరాల గురించి వినయ్ సీతాపతి తన 'హాఫ్ లయన్: హౌ నరసింహారావు ట్రాన్స్ ఫార్ముడ్ ఇండియా' అనే పుస్తకంలో చాలా సమాచారం ఇచ్చారు. అది చదివినప్పుడు పీవీ నిర్దోషా అనిపించే మాట నిజమే కానీ, అప్పటికీ ఆయన పాత్ర గురించి పైన ప్రస్తావించిన సందేహాలు అలాగే ఉంటాయి.

బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయితో సాన్నిహిత్యం నెరపడంలో, ఆయనను కాశ్మీర్ కు సంబంధించి జెనీవా సదస్సుకు పంపడంలో కూడా తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల ధాటిని తగ్గించే వ్యూహాన్ని పీవీ అమలు చేశారా, లేక సహజసిద్ధమైన మైత్రీభావంతోనే అలా వ్యవహరించారా?! ఇదీ మనకు స్పష్టంగా తెలియదు.

పీవీ రాజకీయ, భావజాల వ్యక్తిత్వ వికాస, పరిణామాలలోకి తొంగి చూడడం కొంత ఉపయోగకరం అవుతుందేమో! ఆయన భాష, పాండిత్యం, సంస్కృతి, మతం, సంప్రదాయనిష్ఠ కలిగిన అతి పెద్ద అగ్రకులానికి చెందినవారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవడం ఎందుకు అవసరమంటే, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈ అగ్రకులంలోని ఒక వర్గం గాంధీని వ్యతిరేకించే సనాతన, హిందూభావజాల పక్షాన చేరితే, ఇంకో వర్గం గాంధీ-నెహ్రూల పక్షాన చేరింది.

వారిద్దరూ జీవించి ఉన్నంతవరకూ, ఆ తర్వాత కూడా హిందూభావజాల పక్షం బలం పుంజుకోనంతవరకు ఈ వర్గం గాంధీ-నెహ్రూల భావజాలాలకూ, ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, సెక్యులర్, ప్లూరలిస్టిక్ భావజాలానికీ అధికారికంగానే ప్రాతినిధ్యం వహిస్తూవచ్చింది. పీవీ 'లోపలిమనిషి' చదివితే, ఆయనపై నెహ్రూ ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. అలాగే, నెహ్రూ పట్టుబట్టిన భూసంస్కరణలు వగైరాలు కూడా.

కానీ, గాంధీ-నెహ్రూల ప్రభావాన్ని సవాలు చేస్తూ హిందుత్వ వర్గాలు బలపడుతున్నకొద్దీ, గాంధీ-నెహ్రూల లౌకికవాదం పట్లనే కాకుండా, అసలు దాని నిర్వచనంపట్ల కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆవిధంగా గాంధీ-నెహ్రూల సమ్మోహనం కింద అంతవరకూ సుప్తంగా ఉన్న హైందవ, సాంప్రదాయిక చింతన క్రమంగా పీవీ వంటి అనుయాయులలో మొదలైందా?! బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ పాత్రను అలా కూడా చూడగలమా?! సమాధానం కోసం తడుము కోవలసిన ప్రశ్నలలో ఇది ఒకటి.

ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రూపంలో మరో ఉదాహరణ స్పష్టంగా కళ్ళముందు ఉండనే ఉంది. పీవీలానే ఆయన కూడా కాంగ్రెస్‌లో చిరకాలం ఉండి, గాంధీ-నెహ్రూల భావజాలంతో ప్రభావితుడైనవారే. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించినవారే. చివరికి కాంగ్రెస్ సాయంతో రాష్ట్రపతి అయినవారే. అయినాసరే, కొన్ని రోజుల క్రితం ఆయన ఆర్ఎస్ఎస్. కార్యక్రమానికి వెళ్ళడం ఎలాంటిది? భక్తితత్పరతలు గల ఆస్తికుడిగా ఆయనలో నిద్రాణంగా ఉన్న హిందుత్వ చింతన ఇప్పుడు మేలుకున్నదా?!

అదే నిజమైతే, దైవభక్తి ఉండడాన్నే హిందుత్వగా భావించడంలోని అవగాహనారాహిత్యం గురించి ఎంతైనా చెప్పుకోవలసి ఉంటుంది. అందుకు ఇది వేదిక కాదు.

పీవీ గారి 'ది ఇన్ సైడర్' ను 'లోపలి మనిషి' పేరుతో అనువదించిన వాడిగా ఆయనను పలుసార్లు కలసుకునే అవకాశం కలిగింది. ఒక సందర్భంలో ఆయన అన్న మాటలకు భయంతో నా ఒళ్ళు జలదరించింది.

మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక క్షణం ఆగి, ఆలోచనాముద్ర వహించి, తల వంచి, "ఎన్నో చేయాలని అనుకున్నాను. చేయలేకపోయాను" అన్నారు. మళ్ళీ ఒక్క క్షణం మౌనం తర్వాత.. "యూపీ, బీహార్‌లు ఈ దేశానికి గుదిబండలుగా మారాయి. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు" అంటూ భారంగా నిట్టూర్చారు.

ఈ మాటలకు భయంతో ఎందుకు ఒళ్ళు జలదరించిందంటారా? అయిదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుకొచ్చిన ఒక మాజీ ప్రధాని "ఎన్నో చేయాలనుకున్నాననీ, చేయలేకపోయాననీ" అన్నప్పుడు ఇంత పెద్ద దేశమూ, దానిని ఆవరించిన సమస్యలూ ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలి ఎవరికి మాత్రం భయం కలగదు?!

ఇప్పుడాలోచిస్తే ఆయన నిశ్శబ్దమే దేశానికి ఎంతోకొంత దోహదం చేసిందేమో ననిపిస్తుంది. ప్రధాని స్థానంలో ఉన్నవారు నిశ్శబ్దంగా పనిచేయడంలో శ్రద్ధ చూపాలి కానీ మాటలు చెప్పడంలో కాదని ఇప్పటి అనుభవం రీత్యా మరింత బలంగా అనిపిస్తుంది.

ఎన్నో చేయాలన్న తన కోరికను నిశ్శబ్దంగా తనలోనే దాచుకుని, చేయలేకపోయినందుకు ఆ తర్వాత విచారం వ్యక్తం చేసిన ఈ మాజీ ప్రధానికి భిన్నంగా; ఎన్నో చేస్తామని చెబుతూనే అన్నీ చేయక పోవడం ఇప్పుడు చూస్తున్నాం.

 

 

రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ 8 నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. గ‌త కొంత కాలంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌ధ్య వ్య‌వ‌హారం ఉప్పునిప్పులా ఉంది. సేవారంగం నుంచి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావించారు. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం పంపింది. దాన్ని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డం వారి మ‌ధ్య విభేదాల‌కు బీజం వేసింది.

ఆ త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌కుండా ప్ర‌భుత్వం త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత కేసీఆర్ స‌ర్కార్‌పై గ‌వ‌ర్న‌ర్ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం అగ్గికి ఆజ్యం పోసిన‌ట్టైంది. ఉగాది వేడుక‌ల‌కు సీఎం, మంత్రుల‌ను ఆహ్వానించినా వెళ్ల‌లేదు. ఇటీవ‌ల రాజ్‌భ‌వ‌న్‌లో మ‌హిళా ద‌ర్బార్‌ను గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించి కేసీఆర్ స‌ర్కార్‌కు మ‌రింత కోపాన్ని తెప్పించారు.

ఈ నేప‌థ్యంలో కొన్ని నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌లో కేసీఆర్ అడుగు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ప్ర‌మాణ స్వీకారానికి సీఎం, మంత్రులు వెళ్లారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూచోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ ప్ర‌మాణ స్వీకారం చేసే సంద‌ర్భంలో కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి చీఫ్ జ‌స్టిస్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం విశేషం

 

బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని ఝలక్

 

 

బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ సభ హైదరాబాద్‌లో జరగనున్న సంగతి

తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రచారం చేసుకునే వీలు లేకుండా ముందస్తుగా అన్ని అడ్వర్టైజ్‌మెంట్ ఏరియాలను టీఆర్ఎస్ బుక్ చేసుకుంది.

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే 3, 4వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారీ సభను నిర్వహించబోతున్నారు. ఇక అలాంటి సమావేశాలుంటే పార్టీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊదరగొట్టేస్తారు. అయితే బీజేపీ అలా ప్రచారం చేసుకోకుండా టీఆర్ఎస్ ఎత్తు వేసింది. బీజేపీ నేతలు ప్రచారం చేసుకునేందుకు అవకాశం లేకుండా కారు పార్టీ పక్కా స్కెచ్ వేసి అమలు చేసింది. ప్రకటనల కోసం ముందస్తుగా మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు, ఇతర అడ్వర్టైజ్‌మెంట్ ఏరియాలను టీఆర్ఎస్ పార్టీనే బుక్ చేసుకుంది. సిటీలో బీజేపీ ప్రకటనలకు ఎలాంటి తావు లేకుండా టీఆర్ఎస్ చేసింది. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో వారం రోజులు ప్రీప్లాన్డ్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2,300లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇటు సిటీలోని వెయ్యి బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునే‌లోగా గులాబీ నేతలు తమ పని కానించేశారు. దీంతో కమలనాథులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు

 

 

ఒక్కో రెబల్ ఎమ్మెల్యేకి రూ.50 కోట్లు..సామ్నా సంచలన కథనం!

 

రాజకీయ సంక్షోభం(Maharashtra Political Crisis) ముదిరింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలను తమదారికి తెచ్చుకోవడానికి ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిండే, రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన(Shiv sena) పార్టీ తన అధికార పత్రిక సామ్నా(Saamana)లో తీవ్ర విమర్శలు గుప్పించింది. సోమవారం నాటి సామ్నా ఎడిషన్‌లో...ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రూ.50-50 కోట్లకు అమ్ముడుపోయారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని శివసేన పేర్కొంది. స్క్రిప్ట్​ అంతా బీజేపీదేనని ఆరోపించింది. ఎట్టకేలకు, గౌహతి ఎపిసోడ్‌(శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నారు)తో బీజేపీ బండారం బట్టబయలైందని సామ్నా తన కథనంలో పేర్కొంది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వారి అంతర్గత వ్యవహారమని పగటిపూట చెప్పే బీజేపీ...ఓ రాత్రి వడోదరలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్దాస్ షిండే రహస్యంగా సమావేశమయ్యారని తెలిపింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారని... ఆ వెంటనే 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు వైకేటగిరీ ప్రత్యేక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సామ్నా తన కథనంలో తెలిపింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించడాన్ని చూస్తే వారి వెనక బీజేపీ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది. ఈ రెబల్ శివసేన ఎమ్మెల్యేలు ముంబై-మహారాష్ట్రకు రావడానికి భయపడుతున్నారని, ఈ ఖైదీ ఎమ్మెల్యేలు ముంబైలో దిగగానే మళ్లీ జంప్ చేసి తమ ఇళ్లకు పారిపోతారన్న ఆందోళనతో వారిని ప్రభుత్వ సెంట్రల్ సెక్యూరిటీతో బందీ చేశారని విమర్శించింది. మరోవైపు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌...అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను కాకుండా శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచించిన వ్యక్తిని గుర్తించడం పట్ల షిండే నేతృత్వంలోని రెబల్ గ్రూప్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి పార్టీ శాసనసభాపక్ష నేత కాలేరని స్పష్టం చేసింది షిండే క్యాంపు. ఎమ్మెల్యేలుగా అనర్హతకు సంబంధించి ఇచ్చిన నోటీసులకు జూన్ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని తిరుగుబాటు నేత షిండే సహా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ శనివారం సమన్లు జారీ చేశారు. దీనిపైనా రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాల్ అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని తిరుగుబాటుదారులు సుప్రీంకోర్టును కోరారు. తమకు మరింత సమయం ఇవ్వాలన్నారు. తమ కుటుంబాలకు భద్రత కల్పించేలా చర్యలు కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేపీ పర్దివాలా సభ్యులు గల బెంచ్ సోమవారం(జూన్ 27,2022) సోమవారం విచారణ జరపనుంది. ప్రస్తుతం అసోంలోని గౌహతిలో ఓ హోటల్‌లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం 2 గంటలకు ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యచరణ, తదుపరి వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం

 

 

ప్రైవేట్ హాస్పిటల్‌లో పార్టీ .. గర్భిణికి ట్రీట్‌మెంట్‌ అందక పసికందు మృతి

 

హైదరాబాద్‌(Hyderabad) పాతబస్తీలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌(private hospital) యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలిగొంది. ట్రీట్‌మెంట్(Treatment)కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా పార్టీల పేరుతో జల్సా చేశారు స్టాఫ్. ఆసుపత్రి బిల్డింగ్‌పైనే డీజే సౌండ్ల (DJ Sounds)తో ఆసుపత్రిలో వాతావరణాన్ని రణగణధ్వనిలా మార్చేస్తారు. దాంతో రోగులు వైద్యం చేయండి బాబోయ్ అని అరుస్తున్న వినిపించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. హాస్పిటల్‌లో రోగులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో పట్టించుకోకుండా డ్యాన్సుల్లో మునిగి తేలడంతో తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ప్రాణాలు వదిడిచింది. హైదరాబాద్‌ చాదర్ఘాట్‌లోని ఇంతియాజ్‌ ప్రైవేట్ ఆసుపత్రికి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని తీసుకొచ్చారు బంధువులు. అదే సమయంలో మహిళకు ప్రసవ నొప్పులు అధికం కావడంతో బంధువులు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, నర్సుల కోసం వెదికారు. ఆసుపత్రిలో రోగులు ఉంటే ...సిబ్బంది అంతా హాస్పిటల్ బిల్డింగ్‌పైన ఏర్పాటు చేసిన పార్టీలో మునిగిపోయారు. ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ కుమార్తె వివాహం ఉండటంతో స్టాఫ్‌ బ్యాచిలర్ పార్టీ పెట్టుకున్నారు. బిల్డింగ్‌పైన డీజే సౌండ్స్‌, డిన్నర్, డ్యాన్సులతో హోరెత్తించారు. ఆసుపత్రిలోని పేషెంట్లను గాలికి వదిలేశారు. మొత్తం మర్చిపోయి జల్సా చేస్తుండిపోయారు గర్భిణి మహిళ నొప్పులు పడుతుండటంతో బంధువులు డాక్టర్‌ని పిలిచారు. ట్రీట్‌మెంట్‌ అందించాలని కోరారు. అయితే పార్టీ మూడ్‌లో ఉన్న వైద్య సిబ్బంది పేషెంట్‌ని పట్టించుకోకపోవడంతో మహిళ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఐదు నిమిషాల్లోనే పసికందు చనిపోయింది. పుట్టిన బిడ్డ చనిపోవడంతో గర్భిణి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కేవలం వైద్య సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ చనిపోయిందని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో పార్టీలు, డీజే డ్యాన్సులు పెట్టుకోవడం ఏమిటని నిలదీశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని కోరుతున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోగులకు సరైన వైద్యం అందడం లేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా రోగుల వైద్యసేవలను పక్కన పెట్టి పర్సనల్ వ్యవహారాలు, పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తున్నాయనే వార్త విస్తృతంగా వైరల్ అవుతోంది. డాక్టర్ కుమార్తె వివాహం నెల రోజులు ఉంటే అంత ముందుగానే అది కూడా హాస్పిటల్ బిల్డింగ్‌పై పార్టీ పెట్టుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ రోజుల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

 

యశ్వంత్ సిన్హా నామినేషన్.. రాహుల్ కేటీఆర్ ఒకే దగ్గర….

రాష్ట్రపతి ఎన్నికల్లో (presidential elections 2022) కీలక ఘట్టం చోటుచేసుకుంది. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)ను ఎంచుకోగా, ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడం తెలిసిందే. బలాబలాల దృష్ట్యా ముర్ము గెలుపు లాంఛనమే అయినప్పటికీ, మోదీ తీరుపై విధానపరమైన వ్యతిరేకతలో భాగంగానే విపక్షాలు అభ్యర్థిని నిలిపాయి. యశ్వంత్ సిన్హా నామినేషన్ సందర్భంగా పార్లమెంట్ భవనంలోని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అరుదైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నేతలు ఒక్కతాటిపైకొచ్చి, పక్కపక్కనే నిలబడి సిన్హాకు మద్దతు పలకారు.

యశ్వంత్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత ఏ.రాజా ముందు వరుసలో కూర్చొని యశ్వంత్ చేత నామినేషన్ వేయించారు. అలాగే నేషనల్ కాన్పరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్సీపీఐ నేత డి.రాజా, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తదితరులు సిన్హా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నా అనుకోని ఆమె బదులు పార్టీ సీనియర్లు హాజరయ్యారు. తెలంగాణలో ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనేతలు ఒకేచోట చేరడం, ఉమ్మడి అభ్యర్థికి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్కువ గ్యాప్ లోనే కూర్చొని కనిపించారు. కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సైతం ఉన్నారు. రాష్టపతి ఎన్నికల్లో ఎన్టీఏకు మెజార్టీ లేనప్పటికీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ, ఒడిశా అధికార పార్టీ బీజేడీలు మద్దతు తెలపడంతో ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖరారైంది. ఒడిశా బిడ్డగా ముర్ముకే మద్దతు తెలుపుతామని బీజేపీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటిండం, ఆదివాసి, అందునా మహిళ అయిందున తాము కూడా ముర్మునే సమర్థిస్తామని వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ చెప్పడంతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే అయింది. బీజేపీతో సైద్ధాంతిక విరోధమున్న పార్టీలు మాత్రం యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా నిలబెట్టాయి. జులై 10న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...