Wednesday 21 December 2022

తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్స్..





తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వ డాక్టర్లుగా నియమితులై వైద్యం చేస్తున్నారు.

డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రూథ్‌ జాన్‌లు ఉస్మానియా ఆసుపత్రిలోని ఏఆర్టీ క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రాచీ, ఖమ్మం జిల్లాకు చెందిన రూథ్‌లు 29, 28 ఏళ్ల వయసున్న యువ డాక్టర్లు.

కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేశారు కానీ, వారు స్థిరంగా ఒక చోట ఉండి వైద్యం చేయడానికి, ఎండీ, ఎంఎస్ చదవడానికి వారి జెండర్ పెద్ద అడ్డంకి అయింది.

ఆ సందర్భంలో ఉస్మానియాలో మెడికల్ ఆఫీసర్లుగా చేరి, ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించారు ఈ యువ ట్రాన్స్‌జెండర్లు

‘‘నాకు ఐదేళ్ల వయసునప్పటి నుంచే నా శరీరం భిన్నంగా ఉందన్న అవగాహన నాకు కలిగింది. కానీ స్కూలు వయసులో నాకు అంత అవగాహన లేదు. వయసు పెరిగే కొద్దీ అవగాహన పెంచుకుంటూ వచ్చాను. తరువాత ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రపంచానికి చెప్పేశాను. నేను ఒక ట్రాన్స్ మహిళను అని’’ అన్నారు ప్రాచీ.

‘‘ఎంబీబీఎస్ మొదట్లోనే ఫ్రెషర్స్ పార్టీకే నేను చీర కట్టుకుని వెళ్లాను. అక్కడే ప్రకటించాను. ఎవరు నాతో మాట్లాడనీ, మాట్లాడకపోనీ, నేను నా ఐడెంటిటీని అక్కడ ప్రకటించాను’’అని ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివిన ప్రాచీ, తాను మొదటిసారి ట్రాన్స్ జెండర్ అని ప్రకటించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘నాకు ఏడేళ్ల అప్పటి నుంచే నేను భిన్నంగా ఉన్నానని గుర్తించాను. అబ్బాయిలతో కలవలేక పోయేదాన్ని. అమ్మాయిలతో కలిసేదాన్ని. అమ్మాయిలతో ఉండటానికి ఇష్టపడేదాన్ని. ఆడపిల్లల బట్టలు వేసుకోవడం లాంటివి ఇష్టం ఉండేది. కానీ ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో ఉన్న వివక్షను చూశాక, ముందుగా నా చదువులపై శ్రద్ధ పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. బాగా చదవాలని నిర్ణయించుకున్నాను. ఇక 2017 ఎంబీబీఎస్ తరువాత నేను ట్రాన్స్ వ్యక్తిని అని కుటుంబ సభ్యులతో చెప్పాను. అప్పటి నుంచే అందరికీ చెబుతూ వస్తున్నాను’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నారు రూథ్.

అన్నీ తెలిసిన డాక్టర్ల నుంచే వివక్ష

సాధరణంగా మనిషి శారీరక, మానసిక భిన్నత్వంపై డాక్టర్లకు ఎక్కవ అవగాహన ఉంటుందనేది సగటు భావన. కానీ తమకు మెడికల్ కమ్యూనిటీ నుంచి తీవ్రమైన వివక్ష ఎదురైందంటారు ఈ ట్రాన్స్ జెండర్ డాక్టర్లు.

‘‘అసలు ప్రైవేటు వైద్యుల్లో జెండర్ సెన్సిటివిటీ చాలా తక్కువ. లేదని కూడా చెప్పొచ్చు. వారికి ఎల్జీబీటీక్యూ ప్లస్ అంటే తెలియదు. నేను వైద్యుల నుంచి కూడా చాలా వివక్ష ఎదుర్కొన్నాను. ట్రాన్స్‌జెండర్ అవడం వల్లే ఉద్యోగం కోల్పోయాను’’ అన్నారు ప్రాచీ.

‘‘డాక్టర్లలో కూడా వివక్ష ఉంటుంది. నా సర్టిఫికేట్లు పట్టుకుని ఎన్నో ఆసుపత్రులకు ఉద్యోగం కోసం వెళ్లాను. వాళ్లెవరూ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఫోన్ చేస్తామంటారు. ఫోన్ రాదు. దీంతో ఇక బతకడం ఎలా అని భయపడ్డాను. ఎన్నోసార్లు ఏడ్చాను. ఒక దశలో ఆత్మహత్య చేసుకుదాం అని కూడా అనుకున్నాను. ఒకే ఆసుపత్రికి ఉద్యోగం కోసం మూడుసార్లు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అంటూ గుర్తు చేసుకున్నారు రూథ్.

వీరిద్దరూ గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ వ్యక్తుల కోసం నడిపే క్లినిక్‌లో సేవలు అందించారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో, ఉస్మానియా ఆసుపత్రి క్యాంపస్‌లో వైరల్ వ్యాధుల క్లినిక్ ఉంది. అందులో మెడికల్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేశారు. వారిని ఇంటర్వ్యూ చేసి మెడికల్ ఆఫీసర్లుగా నియమించారు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్. దీంతో నవంబర్ 24 నుంచి వారు ఇక్కడ వైద్యం చేస్తున్నారు.

పేషెంట్లు ఎలా స్పందిస్తారు?

డాక్టర్లుగా రోగులను చూసేప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదుర్కొన్నారు ఈ వైద్యులు. అయితే తమ చికిత్స చూసిన తరువాత రోగుల అభిప్రాయమే మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు.

‘‘నేను కొంత కాలం సొంతంగా క్లినిక్ నడిపాను. అక్కడ మొదట్లో రావడానికి సంకోచించేవారు. తరువాత నా వైద్యం చూశాక రావడం మొదలైంది’’అని రూథ్ చెప్పారు.

‘‘ఇక్కడ పేషెంట్ల నుంచి ఆశ్చర్యకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. చికిత్స అంతా పూర్తయిన తరువాత, చాలా బావుంది. మీరు మాకు చాలా మంచి వైద్యం చేశారు. మీ నుంచి చికిత్స తీసుకోవడం సంతోషం అంటారు పేషెంట్లు’’అని ఆమె వివరించారు.

‘‘కొందరైతే మిమ్మల్ని దేవుళ్లలా చూస్తాం. అలాంటిది మీ చేతి వైద్యం చేయడం ఇంకా మంచిది.’’ అంటూ చెబుతుంటారు అన్నారు రూథ్.

మొదట్లో సందేహంగా వచ్చే పేషెంట్లు, తరువాత తమతో మాట్లాడి, తాము వైద్యం చేసే విధానం చూసి అభినందిస్తారని చెప్పుకొచ్చారు వీరు.

‘‘నేను చాలా కాలం ప్రైవేటు ఆసుపత్రిలోని ఎమెర్జెన్సీ వార్డులో డ్యూటీ చేశాను. మొదట్లో నన్ను చూసి నా దగ్గరకు రావడానికి సంకోచించిన పేషెంట్లు, నేను చేసిన వైద్యం చూసి ఎంతో సంతోషించేవారు. నేను చేసే చికిత్సతో వారు సంతృప్తి చెందేవారు. కొందరు మొదట్లో ఇబ్బంది పడినా, ఎమెర్జెన్సీ కాబట్టి తప్పక నా దగ్గరకు వచ్చి తరువాత వారి ఆలోచన మార్చుకున్నారు’’ అంటూ చెప్పారు ప్రాచీ.

‘‘ఇప్పటికీ చాలా మంది మమ్మల్ని అభినందిస్తుంటారు. మీరు మాకు స్ఫూర్తి అని చెబుతుంటారు’’అని అన్నారు ప్రాచీ.

గతంలో వైద్యులు, నర్సుల నుంచి కూడా వివక్ష, ఎగతాళి భరించిన వీరు ఉస్మానియాలో మాత్రాం పరిస్థితి భిన్నంగా ఉందనే చెబుతున్నారు. తమకు ఇక్కడ గౌరవం దక్కుతోందన్నారు.

ఇల్లు.. కాలేజీ.. ఆసుపత్రి.. అన్ని చోట్లా అదే అనుభవం..

రూథ్, ప్రాచీలు ముందు నుంచీ చదువుపై శ్రద్ధ పెట్టారు. అయినప్పటికీ వారి నైపుణ్యం, తెలివితేటల కంటే వారి శరీరమే ఎక్కువ డిస్కషన్ సబ్జెక్ట్ అయ్యేది. మూడు పదులు దాటక ముందే వారు జీవితంలో ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

వివక్ష చూసి ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా అని అడిగితే, ‘‘బోలెడన్ని సార్లు..’’ ‘‘అసలు ట్రాన్స్‌జెండర్ జీవితమంటేనే కన్నీళ్లమయం అండీ..’’ అంటూ సమాధానం ఇచ్చారు ప్రాచీ.

‘‘నేను చదువుకునే సమయచంలో అసలు థర్డ్ జెండర్ కాలమే లేదు. వివక్ష ఎక్కువ ఉండేది. స్కూల్లో, కాలేజీలో బాగా ఆటపట్టించేవారు. అందుకే ఇక ఎంబీబీఎస్‌లో చేరాక చాలా ఒంటరిగా (ఐసోలేటెడ్)గా ఉండేదాన్ని. ఎవరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. ఎంబీబీఎస్ మొత్తం అలానేసాగింది’’ అంటూ చెప్పారు రూథ్.

’’2017లో నేను నా ఐడెంటిటీ చెప్పిన తరువాత చాలా మంది అంగీకరించారు.. నాతో బావున్నారు. కొందరు అంగీకరించలేదు. నాతో మాట్లడడం మానేశారు’’ అన్నారు రూథ్.

‘‘స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నాను. నా వెనుక నవ్వేవారు. చాలా కష్టంగా ఉండేది’’అని అన్నారు ప్రాచీ.

ఇప్పటికీ ఆమె కుటుంబం ప్రాచీతో మాట్లాడడం లేదు. ‘‘నాకు వారిపై కోపం లేదు. వారి పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా!’’అని అన్నారామె.

‘‘ట్రాన్స్‌జెండర్లు ఐడెంటిటీ రివీల్ చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. ఎవరికీ చెప్పకపోతే నీ వెనుక నవ్వుతారు. వెకిలి చేస్తారు. రకరకాలుగా మాట్లాడతారు. నేను ట్రాన్స్‌జెండర్ అని చెప్పాక, ఏకంగా ఉద్యోగం కోల్పోయాను. ప్రైవేటు ఆసుపత్రి వారు నన్ను ఉద్యోగం లో నుంచి తీసేశారు’’అని అన్నారు ప్రాచీ.

‘‘చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు భిక్షాటన చేస్తూ, డాన్సులు చేస్తూ, బతుకుతున్నారు. వారిని తప్పు పట్టను. సమాజం అలా ఉంది ఇప్పుడు. ఒకవేళ చదువుకోకపోయుంటే నేనూ అలానే చేసేదాన్నేమో.. ట్రాన్స్ వ్యక్తులంటే ఉన్న ఆ అభిప్రాయం తొలగించాలి. నేను డాక్టర్‌ని అని చెప్పినా నాకు ఇల్లు దొరకడం కష్టం అయింది. సరైన ఇల్లు దొరకడానికి ఏడాది పట్టింది. కానీ ఒకసారి ఇంట్లో చేరాక, అక్కడ సొసైటీ వారు నా ప్రవర్తన చూసి నన్నెంతో గౌరవిస్తారు. ఎంతో ఆదరంగా చూస్తారు’’అని అన్నారు ప్రాచీ.

పీజీ కష్టాలు..  

ఇప్పుడు డాక్టర్లు చాలా మంది ఎంబీబీఎస్‌తో సరిపెట్టకుండా పీజీ చేయాలనుకుంటున్నారు.

కానీ పీజీ విషయంలో కూడా వీరికి సమస్య ఎదురైంది.

నీట్ పరీక్షలో థర్డ్ జెండర్ కాలమ్ ఉన్నప్పటికీ, తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఆ కాలమ్ లేదు.

‘‘పీజీలో గైనిక్ చదవాలనుకున్నాను. నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ థర్డ్ జెండర్ కింద కౌన్సెలింగ్ చేయబోమన్నారు. నా ఐడెంటిటనీ దాచుకుని నేను అడ్మిషన్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే దానిపై పోరాడుతున్నాం’’అని చెప్పారు రూథ్.

ఫ్రెషర్స్ పార్టీకే నేను చీర కట్టుకుని వెళ్లాను. అక్కడే ప్రకటించాను. ఎవరు నాతో మాట్లాడనీ, మాట్లాడకపోనీ, నేను నా ఐడెంటిటీని బయటకు చెప్పాలని అనుకున్నాను’’అని తాను మొదటిసారి ట్రాన్స్‌జెండర్ అని ప్రకటించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రాచీ.

.

  

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...