Thursday 7 July 2022

 

కాకతీయుల వారసుడొచ్చారా?




 

ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో వారి రాజ్యం నేటి తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వరకు విస్తరించింది.

వ్యవసాయ, సాంస్కృతిక, విదేశీ వాణిజ్యపరంగా గొప్పగా ఎదిగిన సువిశాల కాకతీయ సామ్రాజ్యం ఎలా పతనమైంది? కాకతీయ వంశంలో చివరి రాజు రెండో ప్రతాపరుద్రుని మరణం వెనుక మిస్టరీ, ఆ తర్వాతి కాలంలో కాకతీయ వంశస్తులు ఏమయ్యారు అన్నదానిపై చరిత్ర పరిశోధకుల్లో 700 ఏళ్ల తర్వాత కూడా ఏకాభిప్రాయం లేదు.

రాణి రుద్రమ దేవికి కొడుకులు లేకపోవడం తో తన కూతురు 'ముమ్మడమ్మ' కొడుకు ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని పట్టాభిషేకం చేసింది.

కాకతీయ పాలకుల్లో చివరి రాజు (రెండవ )ప్రతాపరుద్రుడు. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రతాపరుద్రుని చివరి కాలంలో కాకతీయ సామ్రాజ్యం వరుసగా ముస్లిం రాజుల దాడులకు లోనయింది.

వాటిలో ప్రధానమైనవి ఖిల్జీ, తుగ్లక్ వంశాలకు చెందిన దిల్లీ సుల్తానులు జరిపినవి. క్రీ.శ. 1323లో 'ఘియాజుద్దీన్ తుగ్లక్' సైనిక అధికారి (కొడుకు) 'ఉలుగ్ ఖాన్' నేతృత్వంలో జరిగిన దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది. ఇక్కడి వరకు చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం కనిపిస్తుంది.

అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పరిశోదకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండవ ప్రతాపరుద్రుని మరణంపై ఏకాభిప్రాయం లేదు.

రెండో ప్రతాపరుద్రున్ని బందీ పట్టుకుని దిల్లీకి తరలిస్తున్న క్రమంలో ఆయన నర్మద నదిలో ప్రాణత్యాగం చేశారన్న వాదన ఒకటి ఉంది. అయితే ఆయన వారి చెర నుండి తప్పించుకున్నడన్నది మరో వాదన.

ఆ తర్వాత చాలాకాలం ప్రతాపరుద్రుడు బతికే ఉన్నాడని ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద చనిపోయాడన్నది మరో కథ. తన తమ్ముడు అన్నమదేవుడి సహాయంతో బస్తర్ కేంద్రంగా ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్య స్థాపన చేశాడన్నది ప్రచారంలో ఉన్న మరో కథనం.

.

''వీరభద్రారెడ్డి భార్య రెడ్డిరాణి 'అనితల్లి దేవి' వేయించిన 'కలువ చెరువు' దానశాసనం ప్రకారం 'సోమోద్బవ నది' లోదూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రతాపరుద్రుని మరణం తర్వాత సుమారు వంద సంవత్సరాల కాలానికి ఈ శాసనం వేయించారు. ''17 వ శతాబ్ధంలో ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్ర చరిత్ర', ఇతర ఐతిహాసాల ప్రకారం బందీగా దిల్లీ తీసుకెళ్తున్న ప్రతాపరుద్రుడిని కాకతీయ సేనానాయకుల్లో కొందరు పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా నుంచి తప్పించారు.

ఆ తర్వాత కొంత కాలానికి ఆయన నేటి కాళేశ్వరం సమీపంలో గోదావరినది లో తన భార్య 'విశాలాక్షి' సహా ప్రాణత్యాగం చేశారు. బందీగా దిల్లీకి చేరితే మతమార్పిడికి గురవుతానన్న మానసిక సంఘర్షణ ఆయనలో ఆనాడు ఉంది''.

ప్రతాపరుద్రుని మరణం తర్వాత మలి కాకతీయ సామ్రాజ్యం ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కేంద్రంగా కొనసాగిందన్న వాదన కొందరు చరిత్రకారుల నుంచి వినిపిస్తుంటుంది.

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని తమ్ముడు 'అన్నమదేవుడు' ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి ఆదివాసీల మధ్య గడుపుతూ అక్కడే తన రాజ్యాన్ని స్థాపించాడని.. అదే మలికాకతీయ సామ్రాజ్యం అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. దీనితో ఏకీభవించేవారు, దీనికి భిన్నమైనఅభిప్రాయాలు కలవారూ ఉన్నారు.

 

ప్రతాపరుద్రుని పాలన కాలం నాటికే బస్తర్ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఆ ప్రాంతానికి ప్రతాపరుద్రుని తమ్ముడు అన్నమదేవుడు పాలకుడిగా ఉన్నారు.

'కాకతీయ రాజ్యం అనే పేరుమీదుగా పరిపాలన సాగలేదు. కాబట్టి మలి కాకతీయుల పాలన అని అనలేం. కానీ అక్కడ పరిపాలించింది కాకతీయ వంశస్తులే. అది ఆ ప్రాంతంలోని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అన్నమ దేవుని తర్వాత వచ్చిన పాలకుడైన 'దిక్పాల దేవుడు' (1680-1708) హయాంలో వేసిన 'దంతేశ్వర శాసనం'లో తాము అన్నమదేవుని వారసులమని చెప్పుకున్నారు. దండకారణ్యప్రాంత ఆదివాసీల ఐతిహ్యాల్లో కూడా 'కాకతీయుల వారసులను మా తల్లి(ఆదివాసీల దేవత) కాపాడింది' అని ఉంది''

''ఏకామ్రనాథుడి 'ప్రతాపరుద్ర చరిత్ర'లో రెండవ ప్రతాపరుద్రునికి 'వీరభద్రుడు' అనే కొడుకు ఉన్నాడని రాసి ఉంది. అయితే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. శాసనాలూ ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నాయి.

కాకతీయ సైన్యం లో 'లెంక సైన్యం' పేరుతో ఆత్మహుతి దళాన్ని పోలిన విభాగం ఉండేది. సైనిక ప్రతిజ్ఞలో భాగంగా తాము కాకతీయ పుత్రులమని, రాజు సేవ కోసమే బతుకుతామని వారు ప్రతిజ్ఞ చేసేవారు. ప్రతాపరుద్రుని కొడుకు వీరభద్రుడు అనే భావన ఇలాంటిదే కావొచ్చు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఇప్పటికీ 'లెంక' అన్న ఇంటిపేరు కనిపిస్తుంది.''

''చాళుక్యులు శాఖలుగా విడిపోయినా పశ్చిమ, తూర్పు, బాదామి,కల్యాని చాళుక్య పేర్లతో తమ వంశ నామాన్ని కొనసాగించారు. చాళుక్యులు తమ పూర్వీకులని వీరంతా చెప్పుకొన్నారు. ప్రతాపరుద్రుని తర్వాత అలా కాకతీయ వంశం పేరుతో పాలన సాగలేదు.''

''కాకతీయ సామ్రాజ్య పతనం అనంతరం తెలుగు నేలతో వారికి సంబంధాలు కొనసాగలేదు. బస్తర్ ప్రాంతంలో తమను బలపరిచిన స్థానికులతోనే సంబంధాలు కొనసాగించారు. ఒడిశా ప్రాంత రాజకుటుంబాలతో వారికి వివాహ సంబంధాలు కొనసాగాయి. తెలుగు నేలపై బహమని సుల్తానుల బలమైన రాజకీయ జోక్యం వల్ల అన్నమదేవుడు, ఆ తర్వాత ఆయన వారసులు తెలుగు ప్రాంతాలతో సంబంధాలు కొనసాగించలేకపోయారు.''

.

''ప్రతాపరుద్రుని తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. కానీ వారి వంశం ఉండవచ్చు. అన్నమదేవుడు బస్తర్ అడవుల్లోకి వెళ్లినట్టుగా కథనాలు ఉన్నాయి. శాసనాలు, సమకాలీన సాహిత్య ఆధారాలు అంత బలంగా కనపడవు. అయినా 'భంజ్‌దేవ్'లు కాకతీయుల వారసులన్న క్లెయిమ్స్ గత కొన్నేళ్లుగా వింటున్నాం. ఇన్ని తరాల తర్వాత ఈ క్లెయిమ్స్ గుర్తించడం కష్టమే. అలా అని కాదని అనలేం. విజయనగర కృష్ణదేవరాయల వారసులుగా ప్రస్తుత కుటుంబం ఆనెగుందిలో ఉంది. వారిని గుర్తించి గౌరవించుకుంటున్నాం. ఇప్పటి తరం ప్రజలు గతంలోని మహనీయులను, వారి వంశజులను గౌరవించడం ద్వారా ఆ వంశానికి మనం కృతజ్ఞత చెప్పుకొన్నట్లు అవుతుంది. అది ఇప్పటి తరం కర్తవ్యం, బాధ్యత''.

''ప్రతాపరుద్రుడిని తుగ్లక్ సైన్యం దిల్లీకి తీసుకుపోయిందని, నర్మద తీరంలో తనువు చాలించారనే వాదన ఉంది. అదే సందర్భంలో ఆయన్ను దిల్లీ పాలకుడు విడుదల చేసి తిరిగి పంపారని ఆ తర్వాత గోదావరి తీరంలో బస్తర్ ప్రాంతంలో మరణించారని.. తదనంతరం వారి కుటుంబ వారసులు బస్తర్ ప్రాంతంలో కొంతకాలం రాజ్యం చేశారని చెప్పుకుంటారు.

''మలికాకతీయులు పేరుతో సామ్రాజ్యం ఏదీ లేదు. ఆ తర్వాతి వారసులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో చిన్న ఆదివాసీ రాజ్యాన్ని పాలించారు. బలమైన శత్రువు చేతిలో ఓడిపోయినప్పుడు, కాలం అనుకూలించనప్పుడు అటవీ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడం అన్ని కాలాల్లో కనిపిస్తుంది. కాలం అనుకూలించాక అక్కడే సైన్యాన్ని నిర్మించుకుని తిరిగి రాజ్యాలను విస్తరించారు. అయితే కాకతీయులుగా చెప్పుకున్న బస్తర్ ప్రాంత 'భంజ్‌దేవ్'లకు ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాజకుటుంబాలతో వివాహ సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారంగా కొన్ని డాక్యుమెంట్లను వార్తాపత్రికాల్లో చూశాను.

 

బస్తర్ ప్రాంత చరిత్ర, సంస్కృతిపై అధ్యయనం చేసిన రాజీవ్ రంజన్ ప్రసాద్ ''ఆమ్ చో బస్తర్'' (మా బస్తర్) పేరుతో పుస్తకం రాశారు. అందులో బస్తర్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు.

''దిల్లీ సుల్తానుల దాడిలో ఓరుగల్లు పతనమయ్యాక ప్రతాపరుద్రుడి తమ్ముడు అన్నమ దేవుడు 200 అశ్వాల సైన్యంతో గోదావరిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించాక మొదట భూపాలపట్నం వద్ద అక్కడి నాగవంశీకులైన(చిందక్ నాగులు) ఆదివాసీలను ఓడించాడు. దీంతో క్రీ.శ. 760 నుండి 1324 వరకు ఆప్రాంతంలో సాగిన నాగవంశం పాలనకు తెరపడింది. ఆ తర్వాత కాలంలో 'కాంకేర్' ప్రాంతంలో 'పైరీ నదీ తీరం'లో చంద్రవంశీయుల రాజ్యం చేజిక్కించుకుని విస్తరించారు.

దట్టమైన అడవులతో నిండిన బస్తర్ ప్రాంతం బ్రిటిషర్ల పాలన వరకు బాహ్యప్రపంచంతో వేరుగా ఉన్న శత్రుదుర్బేద్య ప్రాంతం. దీంతో వారికి సహజసిద్ద రక్షణ లభించింది. స్థానిక ఆదివాసీలతో సత్సంబంధాలను వారు కొనసాగించారు. వారి సంస్కృతిలో కలిసిపోయారు. నాగులు(ఆదివాసీలు) మణికేశ్వరి దేవిని ఆరాధిస్తే వీరు 'దంతేశ్వరి దేవి'ని పూజించారు.

''వీరి వంశానికి సంబంధించి కొంత అస్పష్టత ఉంది. అన్నమదేవుడు తన తండ్రి తరఫున చాళుక్యుడు, తల్లి తరపున కాకతీయ వంశానికి చెందిన వారు. బస్తర్ ఆదివాసీ జానపదాల్లో వీరి గురించి 'చాళుక్య వంశ్ కీ రాజా-డిండిబీ బాజా'' అన్న కవితాపంక్తులు దీనికి ఉదాహరణ''

తర్వాతి తరంలో వచ్చిన రాజులు జగదల్ పూర్‌లో 'కాకతీయ విద్యాలయ' పేరుతో విద్యాసంస్థను నెలకొల్పారు.''

అయితే వీరి పేరులో 'భంజ్ దేవ్" అనేది ఎలా చేరిందన్న దానిపై కొంతమంది పరిశోధించారు.

తర్వాతి తరాల్లో వచ్చిన 'రాజా రుద్రప్రతాప్ దేవ్'కు మగసంతానం లేదు. ఆయన కుమార్తే 'ప్రఫుల్ల కుమారి దేవి'కి ఒడిశాలోని మయూర్ భంజ్ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ల కుమార్ భంజ్‌దేవ్ తో వివాహం జరిపించాకే వారి ఇంటి పేరులో 'భంజ్‌దేవ్' చేరిందన్నది వారి వాదన.

భంజ్‌దేవ్ వంశం గురించి మాట్లాడే సందర్భంలో బస్తర్ ప్రాంత ఆదివాసీల్లో పేరుపొందిన 'రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్' గురించి మాట్లాడుకోవాలి. ఆయనే ఈ వంశ చివరి పాలకుడు. ఆదివాసీలతో కలిసి ఆయుధాలతో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో 1966లో జగదల్‌పుర్ కోట లో ఆయన్ను పోలీసులు కాల్చి చంపారు.

''ఆదివాసీల సమస్యలపై ప్రవీర్ చంద్ర్ భంజ్ దేవ్ అహింసా పద్దతిలో పోరాటాలు చేశారు. పలుమార్లు దిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షల రూపంలో కూడా ఈ పోరాటాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒకసారి ఎమ్మెల్యే గా పనిచేశారు. 'మహారాజా పార్టీ' పేరుతో ఆయన ఓ ప్రాంతీయ పార్టీని కూడా స్థాపించారు. సీట్లు గెలిచారు. కాంగ్రెస్ ను ఆ ప్రాంతంలో అడ్డుకున్నారు’’.

‘‘డి.పి.మిశ్రా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజా ప్రవీర్ చంద్రదేవ్ కు మతిస్థితిమితం తప్పిందని స్విట్జర్లాండ్ కు బలవంతంగా చికిత్స కోసం పంపారు. 1964 లో బస్తర్ దసరా వేడుకల్లో పొందే రాజా హోదా ను తొలిగించి ఆయన తమ్ముడు 'విజయ్ చంద్ర భాంజ్ దేవ్ ' ను రాజుగా ప్రకటించారు. ప్రవీర్ చంద్ర దేవ్ తో పాటు పది మందికి పైగా ఆదివాసీలు పోలీస్ కాల్పుల్లో మరణించిన రోజు రాత్రి నుండి తెల్లవారు జాము 4 గంటల ప్రాంతం వరకు రాజ్ మహల్ వద్ద కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఆయన మరణం పై ఏకసభ్య కమీషన్ ను నియమించారు''

కాగా.. రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ తమ్ముడు విజయ్ చంద్రభంజ్ దేవ్ మనవడే కాకతీయ సప్తాహ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన కమల్ చంద్ర భంజ్‌దేవ్.

 

 

విజ్ఞానాన్ని ఉచితంగా పంచె  వీరగోని ఆంజనేయులు

 

 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు మహాత్మా గాంధీ. పుస్తకం ఎంత విలువైనదో చెప్పడానికే గాంధీ జీ ఈ మాట అన్నారు. పుస్తక పఠనం ద్వారా మనిషి ఆలోచనలు, వైజ్ఞానికి పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. పుస్తకాలు చదవడంలో ఉన్న అనుభూతి వేరు. పుస్తకాలు ఎంత విలువైనవో తెలుపుతూ, పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన వంతు సామాజిక బాధ్యతగా ఉచిత లైబ్రరీ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల  జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు అనే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ నిరుపేద విద్యార్థుల సహాయం కోసం, వారిని విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు తనవంతుగా ఉచితంగా లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు వివరించాడు. కొత్త, పాతవి కలిపి ఈ గ్రంథాలయంలో సుమారు లక్ష వరకు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి.

వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు.. ఇంగ్లీష్ టీచరుగా పనిచేసి 2009లో రిటైర్ అయ్యారు. పుస్తక పఠనం పై ఇష్టంతో తన 6వ తరగతి నుంచే పుస్తకాలు సేకరించేవారు. అలా 1978లోనే 'వీరగోని సరస్వతి ఆంజనేయులు, వీరగోని హనుమమ్మ బసవయ్య' పేరుతో వేములవాడ పట్టణంలో ఉచిత పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ఆంజనేయులు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం తన పూర్తి సమయాన్ని ఈ లైబ్రరీ నిర్వహణ కోసం కేటాయించారు. ఎంతో కస్టపడి పుస్తకాలు సేకరించేవారు. చిన్నా, పెద్ద కలిపి దాదాపు లక్ష పుస్తకాలు తన లైబ్రరీలోకి తీసుకొచ్చారు ఆంజనేయులు. వాటిలో కొన్ని అరుదైన పుస్తకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు పడే ఇబ్బందులు గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా విశ్రాంత ఉపాధ్యాయుడు అవిరాల కృషితో, అంకుటిత దీక్షతో నిరుపేద విద్యార్థుల కోసం, పాఠక ప్రియుల కోసం.. ఈ పౌర అంకితం చేసినట్లు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు.

 

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, నిరుద్యోగులు, పేద విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుందని ఆంజనేయులు అన్నారు. నిరుద్యోగ యువకులు ఉన్నత పరీక్షలకు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పౌర గ్రంథాలయం సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ గ్రంథాలయం ఉచితంగా సేవలందిస్తుందని ఆంజనేయులు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు.. ఉద్యోగుల కోసం ప్రిపేర్ అయ్యే 30 మంది అభ్యర్థులకు గైడెన్స్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ గ్రంథాలయంలో అనేక రకాల కాంపిటీటివ్ పురాతన పుస్తకాలతో పాటు 250 రకాల వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయని, ప్రముఖుల జీవిత చరిత్రలు, తెలుగు, హిందీ, సాంస్కృత భాషల్లో చందమామ కథలు, మాస పత్రికలు, తాళపత్ర గ్రంథాలు సైతం ఈగ్రంథాలయంలో ఉండడం విశేషం. లైబ్రరీ ఏర్పాటులో తాను చేసిన కృషిని గుర్తిస్తూ జీవిత సాఫల్య పురస్కారం లభించిందని ఆంజనేయులు చెప్పుకొచ్చారు. రచన మహోపాధ్యాయ శ్రీహరి శర్మ, అవధాని విశ్రాంత ప్రిన్సిపాల్ వేములవాడ నడూరు రామచంద్ర రావు గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ రెడ్డిలు తనను ఉత్తమ పుస్తక తపస్వి అనే బిరుదుతో సత్కరించినట్లు రిటైర్డ్ టీచరు ఆంజనేయులు వివరించారు.

లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు:-

1.సర్ప ప్రాణాయం, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (56 leaves)

2. శరీరక మీమాంస భాష్యం (శంకరాచార్య)లిపి: తెలుగు సంస్కృత గ్రంథం(62 leaves)

3. ఉపనయన ప్రయోగ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (50 leaves)

4. ఆత్మ బోధ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (35 leaves)

తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో పుస్తకాలు, వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. వేదాలు, భాగవతం, భారతం భగవద్గీతతో పాటు పరమత పుస్తకాలైన బైబిల్, ఖురాన్ వంటి 18 రకాల మత పుస్తకాలు గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి.

వేములవాడలో పౌర గ్రంథాలయం:

వేములవాడలోనే ఉన్న ఈ పౌర గ్రంథాలయం ఎక్కడుందో ఎక్కువ మందికి తెలియదు. వేములవాడ పట్టణంలోని (రాజీవ్ నగర్) గంగమ్మ హోటల్ సమీపంలోనే ఈ లైబ్రరీ ఉంది. విద్యార్థులు నిరుద్యోగులు, కాంపిటీషన్ ఎగ్జామ్స్  కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ గ్రంథాలయం సేవలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవస్థాపకుడు, రిటైర్డ్ టీచర్ వీరగొని ఆంజనేయులు సూచిస్తున్నారు.

గ్రంథాలయం స్థాపకుడు వీరగోని ఆంజనేయులు (రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్), ఫోన్ నెంబర్ :9490285767

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...