Sunday 3 July 2022

  

ఏడూ శనివారముల వెంకన్న  స్వామిని  దర్శనం చేసుకున్న కామధేనువు సేవాసమితి సభ్యులు..





ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతి కి నిలయమైన తూర్పగోదావరి జిల్లాలో, తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానాకి కూత వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు.

నారదమహర్షి వేంకటేశ్వరుడిగా నామకరణం చేసి తన స్వహస్తాతో ప్రతిష్టించిన విగ్రహమే వాడపల్లి వేంకటేశ్వర విగ్రహం. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు రాతితో చేయబడినది కాదు.

చెక్కతో చేయబడినది. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం. శ్రీ క`ష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకొంటాడు. దీంతో ద్వాపర యుగం అంతమించి అప్పుడప్పుడే కలియుగం ప్రారంభమవుతూ ఉంటుంది.

ఈ సమయంలో కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ ద`ష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూ మండలం పై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడుతారు
నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలం పై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకొంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు.
ఇప్పటి వరకూ ఏదేని ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారంలో తనకు అర్చనలు జరగలేదు. అయితే ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకొంటానని చెబుతాడు.

దీని వల్ల వారిలో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. ఇందు కోసం ఇప్పటి వాడపల్లిలో స్వయంభువుగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. కాగా ఇప్పటి వాడపల్లినే పూర్వం నౌకాపురమనే పేరుతో పిలిచేవారు.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదీ లో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రజలు దానిని తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టే కనిపించదు.
చివరికి అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెలితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది.

భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తాడు. దీనిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్షీ దేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెబుతాడు.
అంతేకాకుండా ఆ మూర్తికి వేం' అంటే పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు. అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.

అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి.

దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతాయి.

ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి కోరికైనా తీరుతుంది

·          తిరుపతిద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలుస్తారు.

·         ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది. వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.

·         కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు.

·         పూర్వపు ఆలయం నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియుల కుటుంబం నిర్మించారు


గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చినెలలో సర్వ ఏకాదశి రోజునుండి ఐదు రోజులపాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఊరిలోగల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదురోజులు అన్నసంతర్పణ కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండిఅంటే మావద్దకురండి అని పిలుస్తూంటారు.

హైదరాబాద్, సనత్ నగర్ లోని కామధేనువు సేవాసమితి సభ్యులు శనివారం స్వామి దర్శనం చేసుకొని ఆలయ ప్రతిష్టతను చెప్పటం జరిగింది!! 





 

ఆన్లైన్ మోసం ఖరీదు ఒక ప్రాణం

ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాల బారిన పడుతున్న బాధితుల్లో చదురానివారి కంటే బాగా చదువుకున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. అన్నీ తెలిసినా మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని   గుంటూరు జిల్లాలో  లో ఇలాంటి ఘటనే జరిగింది. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేతా చౌదరి.. కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడంతో ఆదివారం ఉదయం కారులో హైదరాబాద్  వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం బండి  వేసుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. NTR జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్ల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే చిల్లకల్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా శ్వేత కోసం గాలించగా.. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతదేహం కనిపించింది. ఐతే ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అసలు విషయం తెలిసి అంతా షాక్ కు గురయ్యారు. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమో లేక ఉద్యోగంలో ఒత్తిడో కాదు. శ్వేతా చౌదరి బిటెక్ పూర్తిచేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. నిత్యం ఆన్ లైన్లో ఉండే శ్వేత.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఓ అపరిచత వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. సదరు వ్యక్తి లక్షా 20వేలు చెల్లిస్తే.. నీకు ఏడు లక్షలిస్తానని శ్వేతా చౌదరిని నమ్మించాడు. ఆమె తనదగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడే రూ.50వేలు శ్వేతకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ రూ.50వేలతో కలిపి మిగిలిన డబ్బులను ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె రూ.1.30 లక్షలు చెల్లించింది. రెండు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రాడవంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు డబ్బులు పంపిన ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు. బాగా చదువుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కూడా ఆన్ లైన్ మాయగాళ్ల ఉచ్చులో పడటం చర్చనీయాంశమవుతోంది

 

 

విప్లవ వీరుడికి  ఘన నివాళి



మన్యం వీరుడు, అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి  వేడుకలు ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వస్తున్నారు.

మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి  Narendra Modi సోమవారం,  భీమవరం వస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో ప్రధాని పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే సభ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. వర్షం కురిసినా సభకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా రెక్సిన్ టెంట్లు వేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం మొత్తం మూడు వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొద్దిమంది ఉంటారు. రెండో వేదికపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలు ఉంటారు. మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రధాని భీమవరం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. దాదాపు 3వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సభా వేదికను ఎస్పీజీ టీమ్ అధీనంలోకి వెళ్లిపోయింది. సభకు ఒక రోజు ముందు నుంచే బయటి వ్యక్తులు వేదిక వద్దకు వెళ్లకుండా నిలిపేశారు. ప్రధాని  సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే నాలుగు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. వాతారవణం అనుకూలిస్తే హెలికాప్టర్ లో భీమవరం చేరుకుంటారు. లేదంటే హనుమాన్ జంక్షన్, ఏలూరు, నారాయణపురం, గణపవరం మీదుగా రోడ్డు మార్గంలో భీమవరం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 11-15 గంటల నుంచి 12-15 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరాజు 125వ వర్ధంతి వేడుకల్లో ఆయన వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అల్లూరి సోదరుడు సత్యనారాయణ రాజు కుమారుడు, కుమార్తె, కోడలు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యలను గుర్తించి భీమవరం పిలిపించారు. అలాగే మన్యంలో అల్లూరికి ప్రధాన అనుచరుడిగా ఉన్న గంటదొర వారసులతో పాటు మరికొందరితో  స్వయంగా మాట్లాడనున్నారు.

 

మినరల్ వాటర్ ముట్టని గ్రామస్తులు




 ఆ ఊరి జనానికి మినరల్ వాటర్ గురించి తెలియదు. మంజీరా వాటర్‌తో అవసరం లేదు. అలాగని నల్లా నీళ్లు, కుళాయి వాటర్‌ అంతకంటే వాడరు. ఊరంతా తిరిగినా ఒక్క బోరు కూడా కనిపించదు. మరి వాళ్లందరూ ఏం తాగుతున్నారు..మంచినీళ్ల అవసరాల కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

ఏ గ్రామంలోనైనా నీళ్లు కావాలంటే బోర్ వేస్తారు. కాని అక్కడ మాత్రం బోర్ వేస్తే చుక్క నీరు కూడా పడదు. ఏకంగా బావి తొవ్వాల్సిందే. ఊరికి మంచినీటి నల్లాలు, మినరల్ వాటర్‌ తరలించేందుకు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికి గ్రామస్తులు వాటిని ముట్టుకోరు. తెలంగాణలో అన్నీ గ్రామాలు ఒక ఎత్తు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామం ఒక ఎత్తు. ఎందుకంటే ఏ గ్రామంలోనైనా వీధికో మంచినీళ్ల పంపు లేదంటే గల్లీకో నల్లా ఉంటుంది. కాని ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఓ బావి కనిపిస్తుంది భూంప‌ల్లి గ్రామంలో సుమారు 565 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులంతా వ్యవసాయంపైన అధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరికి మినరల్ వాటర్ అంటే ఏమిటో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ప్రభుత్వమే వాళ్లకు మినరల్ వాటర్‌ సప్లై చేసినా తాగమంటున్నారు గ్రామంలోని ప్రతి ఇంటికో బావి ఉంది. పురాతన కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్లంతా బావిలో నీళ్లు తోడుకొని తాగుతూ ఉండేవారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న వాళ్లు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు భూంప‌ల్లి గ్రామంలో నీటి అవసరాలు తీర్చడానికి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికీ నల్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కాని గ్రామస్తులు ఏమాత్రం వాడుకోరు. బావిలోంచి వచ్చే నీరునే స్వచ్ఛమైన  నీరుగా భావిస్తున్నారు. అందుకేనేమో ఇక్కడ బోర్ వేస్తే చుక్క నీరు పడదు. అదే బావి తొవ్వితే ..15అడుగుల నుంచి 60అడుగుల వరకు నీరు ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలం మాత్రమే కాదు మండు టెండలు ఉండే వేసవి కాలంలో కూడ గ్రామంలోని బావుల్లో పుష్కలంగా నీరు కనిపిస్తుంది. చేద బావి నీరు స్వచ్ఛమైనదని ఆరోగ్యానికి మంచిదని గ్రామ‌స్తులు న‌మ్ముతున్నారు అందుకే పూర్వికుల నుంచి వస్తున్న ఈ బావినీరు తాగే సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు భూంప‌ల్లి వాసులు. గతంలో ఇళ్లు ఉన్నవారే కాదు... కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు సైతం ముందుగా ఇంటి దగ్గర బావి తొవ్విస్తారు ఇప్పుడే కాదు పూర్వం కూడా గ్రామంలో ప్ర‌తి ఇంటి ముందు చేద బావి ఉండేదని .. ఇంటి ముందు బావి ఉంటే ఇంట్లో లక్ష్మి ఉన్నట్లుగా భావిస్తామని భూంపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఏమైనా సహజసిద్దమమైన భూగర్భజలాన్ని ఎప్పటికప్పుడు తోడుకోని త్రాగడం వల్లే ఇక్కడి గ్రామస్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటున్నారు. వాటర్‌ ఫిల్టర్‌లు, ఫ్రిజ్‌లు వాడాల్సిన అవసరం కూడా తమకు లేదంటున్నారు గ్రామస్తులు ఆధునిక సౌకర్యాలు, వసతుల కోసం జనం వెంపర్లాడుతున్న ప్రస్తుత కాలంలో భూంపల్లి గ్రామస్తులు ఈవిధంగా బావిలోని నీళ్లను తోడుకొని ఇంటి అవసరాలు, తాగునీరు కోసం వాడుకోవడం స్వాగతించదగిన పరిణామంగా చూడాలి బావి నీళ్లలో ఉండే లవణాలు, శుద్ధత ట్యాంకుల ద్వారా సప్లై చేసే వాటిలో ఉండవని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకేనేమో పూర్వం నుంచి వస్తున్న అలవాటునే ఇప్పటికి కొనసాగిస్తున్నారు భూంపల్లి గ్రామస్తులు.

 

డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు.. బిజెపి!!!

 

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం, వరంగల్ భద్రకాళి, భద్రాచలం రాముడు, పాల్కురికి సోమనాథుడు, కాకతీయ రాజులు, రాణి రుద్రమ అంటూ తెలంగాణ చరిత్ర, సంస్కృతులను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'తెలంగాణ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను' అని మోదీ మొదట్లో తెలుగులో ప్రజలకు అభివాదం చేశారు.

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీజేపీ ప్రముఖ నేతలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశాల అనంతరం ఏర్పాటైన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.

ఆ తరువాత మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రజాదరణ పెరుగుతూ వస్తోందని అన్నారు.

మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు:

1. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో దక్కిన ఆదరణ నిరంతరం పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు లభించాయి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ప్రజలు పట్టాలు వేస్తున్నారు.

2, గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి దాదాపు ఒక లక్ష కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

3. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. 2014లో తెలంగాణలో దాదాపు 2,500 కిలోమీటర్ల హైవే నెట్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది 5,000 కిలోమీటర్ల వరకు పెరిగింది.

4. హైదరాబాద్‌లో 1500 కోట్లు వెచ్చించి నాలుగు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది.

5. హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 350 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనుంది.

6. తెలంగాణలో నీటితో ముడిపడిన దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా విలువ చేసే అయిదు పెద్ద ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

7. దేశంలో నిర్మించే 7 టెక్స్‌ టైల్స్ పార్క్‌ల్లో ఒకటి తెలంగాణలో నిర్మిస్తాం.

8. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

9. కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చాం.

10. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ. 31,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆమోదించాం.

 

 

 

లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి

 


హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

‘‘సైంజ్ వ్యాలీలోని నియోలీ-షంషేర్ రహదారిలో ప్రయాణిస్తోన్న బస్సు జంగ్లా ప్రాంతంలో కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గాయపడిన పడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు భావిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని అశుతోష్ గార్గ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

అయితే, ఈ ఘటనలో 16 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.

‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...