Thursday 7 July 2022

 

విజ్ఞానాన్ని ఉచితంగా పంచె  వీరగోని ఆంజనేయులు

 

 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు మహాత్మా గాంధీ. పుస్తకం ఎంత విలువైనదో చెప్పడానికే గాంధీ జీ ఈ మాట అన్నారు. పుస్తక పఠనం ద్వారా మనిషి ఆలోచనలు, వైజ్ఞానికి పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. పుస్తకాలు చదవడంలో ఉన్న అనుభూతి వేరు. పుస్తకాలు ఎంత విలువైనవో తెలుపుతూ, పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన వంతు సామాజిక బాధ్యతగా ఉచిత లైబ్రరీ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల  జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు అనే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ నిరుపేద విద్యార్థుల సహాయం కోసం, వారిని విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు తనవంతుగా ఉచితంగా లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు వివరించాడు. కొత్త, పాతవి కలిపి ఈ గ్రంథాలయంలో సుమారు లక్ష వరకు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి.

వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు.. ఇంగ్లీష్ టీచరుగా పనిచేసి 2009లో రిటైర్ అయ్యారు. పుస్తక పఠనం పై ఇష్టంతో తన 6వ తరగతి నుంచే పుస్తకాలు సేకరించేవారు. అలా 1978లోనే 'వీరగోని సరస్వతి ఆంజనేయులు, వీరగోని హనుమమ్మ బసవయ్య' పేరుతో వేములవాడ పట్టణంలో ఉచిత పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ఆంజనేయులు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం తన పూర్తి సమయాన్ని ఈ లైబ్రరీ నిర్వహణ కోసం కేటాయించారు. ఎంతో కస్టపడి పుస్తకాలు సేకరించేవారు. చిన్నా, పెద్ద కలిపి దాదాపు లక్ష పుస్తకాలు తన లైబ్రరీలోకి తీసుకొచ్చారు ఆంజనేయులు. వాటిలో కొన్ని అరుదైన పుస్తకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు పడే ఇబ్బందులు గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా విశ్రాంత ఉపాధ్యాయుడు అవిరాల కృషితో, అంకుటిత దీక్షతో నిరుపేద విద్యార్థుల కోసం, పాఠక ప్రియుల కోసం.. ఈ పౌర అంకితం చేసినట్లు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు.

 

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, నిరుద్యోగులు, పేద విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుందని ఆంజనేయులు అన్నారు. నిరుద్యోగ యువకులు ఉన్నత పరీక్షలకు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పౌర గ్రంథాలయం సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ గ్రంథాలయం ఉచితంగా సేవలందిస్తుందని ఆంజనేయులు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు.. ఉద్యోగుల కోసం ప్రిపేర్ అయ్యే 30 మంది అభ్యర్థులకు గైడెన్స్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ గ్రంథాలయంలో అనేక రకాల కాంపిటీటివ్ పురాతన పుస్తకాలతో పాటు 250 రకాల వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయని, ప్రముఖుల జీవిత చరిత్రలు, తెలుగు, హిందీ, సాంస్కృత భాషల్లో చందమామ కథలు, మాస పత్రికలు, తాళపత్ర గ్రంథాలు సైతం ఈగ్రంథాలయంలో ఉండడం విశేషం. లైబ్రరీ ఏర్పాటులో తాను చేసిన కృషిని గుర్తిస్తూ జీవిత సాఫల్య పురస్కారం లభించిందని ఆంజనేయులు చెప్పుకొచ్చారు. రచన మహోపాధ్యాయ శ్రీహరి శర్మ, అవధాని విశ్రాంత ప్రిన్సిపాల్ వేములవాడ నడూరు రామచంద్ర రావు గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ రెడ్డిలు తనను ఉత్తమ పుస్తక తపస్వి అనే బిరుదుతో సత్కరించినట్లు రిటైర్డ్ టీచరు ఆంజనేయులు వివరించారు.

లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు:-

1.సర్ప ప్రాణాయం, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (56 leaves)

2. శరీరక మీమాంస భాష్యం (శంకరాచార్య)లిపి: తెలుగు సంస్కృత గ్రంథం(62 leaves)

3. ఉపనయన ప్రయోగ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (50 leaves)

4. ఆత్మ బోధ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (35 leaves)

తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో పుస్తకాలు, వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. వేదాలు, భాగవతం, భారతం భగవద్గీతతో పాటు పరమత పుస్తకాలైన బైబిల్, ఖురాన్ వంటి 18 రకాల మత పుస్తకాలు గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి.

వేములవాడలో పౌర గ్రంథాలయం:

వేములవాడలోనే ఉన్న ఈ పౌర గ్రంథాలయం ఎక్కడుందో ఎక్కువ మందికి తెలియదు. వేములవాడ పట్టణంలోని (రాజీవ్ నగర్) గంగమ్మ హోటల్ సమీపంలోనే ఈ లైబ్రరీ ఉంది. విద్యార్థులు నిరుద్యోగులు, కాంపిటీషన్ ఎగ్జామ్స్  కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ గ్రంథాలయం సేవలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవస్థాపకుడు, రిటైర్డ్ టీచర్ వీరగొని ఆంజనేయులు సూచిస్తున్నారు.

గ్రంథాలయం స్థాపకుడు వీరగోని ఆంజనేయులు (రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్), ఫోన్ నెంబర్ :9490285767

 

1 comment:

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...