Tuesday, 28 June 2022

 




ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటిన వీణ వాణి..  

ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది

తాజాగా విడుదలైన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణి త‌మ స‌త్తా చాటారు. ఇంట‌ర్మీడియ‌ట్‌లో వారిద్ద‌రూ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యారు. ఇంట‌ర్‌లో సీఈసీ కోర్సును అభ్య‌సించిన వీణ‌కు 712, వాణికి 707 మార్కులు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్.. వీణ, వాణిల‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. వారి ఉన్న‌త చ‌దువుల‌కు, భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. వీణ‌, వాణిల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని పేర్కొన్నారు. వీణ వాణిల చ‌దువుకు స‌హ‌క‌రించిన అధికారులను మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. అయితే వీరిద్ద‌రూ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు స్వ‌యంగా రాశారు. ఇక ప‌దో త‌ర‌గ‌తిలోనూ వీణ‌, వాణి ఫ‌స్ట్ క్లాసులో పాస‌య్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003వ సంవత్సరంలో తలలు అతుక్కుని వీణ-వాణి ఇద్దరు కవలలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్‌ హోమ్‌లో గడుపుతున్నారు. వీరిని విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలంకాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణ వాణిలు చాటెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలపడం గమనార్హం. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 464892 విద్యార్థులకు గాను 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు. ఇక సెకండియర్‌లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా ఫస్ట్‌, హన్మకొండ రెండవ స్థానంలో నిలిచాయి. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. పూర్తి వివరాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

గిన్నీస్ రికార్డ్.. తెలుగు షార్ట్ ఫిల్మ్ మనసా నమ:

మనసా నమ: (manasa namaha) గిన్నీస్ రికార్డులకెక్కింది. అత్యధిక అవార్డులను సాధించిన షార్ట్ ఫిల్మ్‌గా మనసా నమ: అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

టాలెంట్ నిరూపించుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. మన దగ్గర టాలెంట్ ఉంటే.. దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు, జనాల్లోకి తీసుకెళ్లేందకు ఎన్నో దారులున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లంటూ అందరూ యువత తమ ప్రతిభకు పదును పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. ‘:మనసానమ:అనే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఏకంగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. ప్రపంచంలో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఈ లఘు చిత్రానికి 513 అవార్డులను సాధించింది. దీంతో ఈ చిత్రం గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేసింది. అసలు ఈ సినిమా కథ ఎంతో సింపుల్‌గా, లోతుగా ఉంటుంది. అమ్మాయిలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో చెబుతుంది. అయితే ఇందులో కారెక్టర్ పేర్లు, తీసుకున్న కథ, చూపించిన విధానం, రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంటుంది. హీరో పేరు సూర్య. అంటే సూర్యుడిలా అనుకోవచ్చు. ఇక ముగ్గురు హీరోయిన్లు. వారి పాత్రల పేర్లు శీత, వర్ష, చైత్ర. అవి శీతాకాలం, వర్షాకాలం, చైత్రమాసం (వేసవి) అని ప్రతీకగా చెప్పేశాడు. ఆ మూడు పాత్రలతో అమ్మాయిల మనస్తత్వాలను ఎంతో వినోదాత్మకంగా చూపించాడు. రాసుకున్న డైలాగ్స్ కూడా ఎంతో హృద్యంగా అనిపిస్తాయి. :మనసానమ: అనే టైటిల్ ఎటు నుంచి చూసినా కూడా ఒకేలా పలుకుతాం. ఈ సినిమాలో కథను హీరో కోణంలో చూపించినా.. చివర్లో మాత్రం ఓ చిన్న పాపతో ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒకే టైపు అన్నట్టుగా చెప్పేస్తాడు. మొత్తానికి ఇందులో సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌కు దీపక్ దర్శకుడు. నిర్మాత శిల్పా గజ్జల. హీరోగా విరాజ్ అశ్విన్ నటించాడు.

 

గంగానదిలో దూకి ఈత కొట్టిన 80ఏళ్ల బామ్మ

ఒంట్లో ఓపిక ఉండాలే కాని..వయసుతో పని లేదని 80సంవత్సరాల వృద్ధురాలు నిరూపించింది. హరిద్వార్‌లోని ఎత్తైన వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలోకి దూకి నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా ఈదుకంటూ క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది

వయసులో ఉన్న యువతి, యువకులు ఏదైనా స్టంట్స్ చేస్తే  అందరూ "వావ్" అంటారు. అదే వృద్దాప్యంలో ఉన్న ముసలివాళ్లు చేస్తే "వామ్మో" అంటారు. ఎందుకంటే సాహసాలు చేసే వయసు వాళ్లు దాటిపోయారని ఆశ్చర్యపోతూ చెప్పడానికే వామ్మో అంటారు. కాని సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడకుతున్న ఓ వీడియో అయితే మాత్రం ఆ వృద్ధురాలి శరీరంలో రక్తం ఇంకా ఉరకలు వేస్తూ పరుగులు పెడుతోందని నెటిజన్లు(Netizens)కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హరిద్వార్‌(Haridwar)లో రికార్డ్ చేసిన వీడియో(Video) ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌(World Wide)గా వైరల్ (Viral)అవుతోంది.

హరిద్వార్‌లోని హర్కీపైడి దగ్గర గంగానదిపై నిర్మించిన ఎత్తైన వంతెనపై నుంచి ప్రవహిస్తున్న గంగానదిలోకి దూకింది ఓ వృద్ధురాలు. అయితే ఆమె ప్రమాదవశాత్తు నదిలో పడలేదు. లేదంటే ఇంకా ఏదైనా చేసుకోవడానికో అని పొరపాటు పడకండి. 80సంవత్సరాల వయసున్న బామ్మ ఎంతో చలాకీగా వంతెన పైన ఉన్న రెయిలింగ్‌ పై నుంచి గంగానదిలోకి దూకింది. నీళ్లలో పడిన వెంటనే ఏమాత్ర భయపడకుండా ఈదుకుంటూ నీటి ప్రవాహంలో ముందుకుపోయింది. ఈ వృద్ద ఈతగాత్తె అలా గంగానదిలోకి ధైర్యంగా రెయిలింగ్‌ పైనుంచి దూకుతుంటే వేలాది మంది చూస్తుండిపోయారు. నీళ్లలో పడిన తర్వాత కూడా ఆమె ఈత కొట్టడం చూసి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో బ్రహ్మకుండ్‌ దగ్గరున్న హర్కీపైడి దగ్గర చిత్రీకరించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే నీళ్లలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్లిన 80సంవత్సరాల బామ్మ ఏ ప్రాంతానికి చెందినదో ఇంకా తెలియరాలేదు. కాని ఆమె చేసిన ఫీట్ మాత్రం ఔరా అందరిచేత ఔరా అనిపించేలా ఉంది. సాధారణంగాల 80సంవత్సరాల వయసు అంటే కూర్చుంటే లేగవలేని వయసు. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నప్పటికి చేతి కర్ర సహాయం లేనిదే చురుక్కా కదల్లేని పరిస్థితి. అలాంటి పండు ముసలి వయసులో ఉన్న వృద్ధురాలు ఇంతటి సాహసం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా ముక్కన వేలేసుకుంటే ..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూసిన వాళ్లైతే శభాష్ బామ్మ అంటూ ఆమెను పొగడ్తలతో ముంతెచ్చుతున్నారు. ఇంకొదరైతే ఆరోగ్యమే మహాభాగ్యం అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

 

పెట్రోల్, డీజిల్ ధరలు  జీఎస్‌టీ పరిధిలోకి?

కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత కూడా దేశంలో ఇంధన ధరలు అధికంగానే కొనసాగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ధరల పెంపు లేనప్పటికీ, ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో పెట్రో రేట్లు భారీగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. పూర్తి వివరాలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ మొదలైంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్ అంశంపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. (ప్రముఖ బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. ప్రముఖ బిజినెస్ పోర్టల్స్ లో వెలువడుతోన్న రిపోర్టుల ప్రకారం, పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధర ఏకంగా రూ. 30 మేర దిగిరావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయంటూ ప్రధాన్ మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ చైర్మన్ వివేక్ దెబ్రోయ్ చెప్పడం ఈ వార్తలకు బలం చూకూర్చినట్లయింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై 25 శాతం వరకు పన్నులు విధిస్తోంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దాదాపు 20 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే గరిష్ట పన్ను రేటు 28 శాతంగా ఉండొచ్చు. అప్పుడు పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 33 మేర తగ్గే ఛాన్స్ ఉంది. ఇక నేటి ఇంధన ధరలను పరిశీలిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు మంగళవారం (జూన్ 28)నాడు చేసిన ప్రకటనలో రేట్లు పెంచలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, మే 21న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధర కొద్దిగా దిగొచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా కొనసాగుతోంది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పట్టణాల్లో ఇంధన కొరత కారణంగా బంకుల వద్ద భారీ రద్దీ కనిపించిందిఏపీ విజయవాడలో పెట్రోల్ ధర లీటరు రూ.112.09గా, డీజిల్ లీటరు రూ.99.65గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ. 110.46గా, డీజిల్ లీటరు రూ. 98.25గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.07 శాతం పెరిగి బ్యారెల్ ధర 110.64 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.08 శాతం తగ్గి పెరిగి బ్యారెల్ 116.17 డాలర్లుగా ఉంది.



Monday, 27 June 2022

 

 

మ‌హారాష్ట్ర‌లో తేలిక కాక‌పోవ‌చ్చు


మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతూ ఉంది. మెజారిటీ శివ‌సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు క్యాంపులో త‌ల‌దాచుకున్నారు. వీరి సంఖ్య 40 వ‌ర‌కూ ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తిరుగుబాటు దార్లు ఇప్ప‌టి వ‌ర‌కూ సొంత రాష్ట్రంలో అడుగుపెట్ట‌లేదు. వారికి కేంద్ర బ‌ల‌గాల ర‌క్ష‌ణ ఇవ్వ‌నుంద‌ట కేంద్రంలోని ప్ర‌భుత్వం. ఆ బ‌లాగాల స‌హ‌కారంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మ‌హారాష్ట్ర‌లోకి అడుగుపెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు క‌నీసం 145 మంది ఎమ్మెల్యేల బ‌లం అవ‌స‌రం. అధికారికంగా అయితే కూట‌మి ప్ర‌భుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. వారిలో శివ‌సేన‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు తో ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డిన‌ట్టే! 

అయితే శాస‌న‌స‌భ‌లో విశ్వాస లేదా అవిశ్వాస ప‌రీక్ష జ‌రిగితేనే ఈ నంబ‌ర్ గేమ్ క్లైమాక్స్ కు వ‌స్తుంది. తిరుగుబాటు దార్ల‌లో కొందరిపై వేటు వేయ‌డం ద్వారా, వారిని ఎమ్మెల్యేలుగా అన‌ర్హులుగా చేయ‌డం ద్వారా మిగిలిన వారిని దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అవలంభించాల‌ని శివ‌సేన నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్టుగా ఉంది. అయితే తిరుగుబాటు దార్లు సుప్రీం కోర్టుకు వెళ్లి త‌మ‌పై చ‌ర్య‌ల‌కు తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు!

ఈ క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం త‌దుప‌రి ఘ‌ట్టం కాబోలు. బీజేపీకి సొంతంగా 106 మంది ఎమ్మెల్యేలున్నారు. తిరుగుబాటు దార్ల స‌హ‌కారంతో బీజేపీ గ‌నుక ప్ర‌భుత్వాన్ని కూల్చేస్తే.. త‌ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నాలు సాగించ‌వ‌చ్చు. శివ‌సేన తిరుగుబాటు దార్లంతా బీజేపీ వైపు న‌డిస్తే.. వీరికి ఏ స్వ‌తంత్రులో, కూట‌మిలోని చోటా పార్టీలు స‌హ‌క‌రిస్తే.. అప్పుడు బీజేపీ క‌నీస మెజారిటీకి చేరువ అవుతుంది.

అయితే...  బీజేపీ అంత చేస్తుంటే ఠాక్రే, ప‌వార్ లు చూస్తూ కూర్చోక‌పోవ‌చ్చు. త‌మ వైరి ప‌క్షానికి అవ‌కాశం ల‌భించ‌క‌ముందే.. ప్ర‌భుత్వం ర‌ద్దుకు కూడా పూనుకోవ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే గ‌వ‌ర్న‌ర్ చేతుల్లోకి గేమ్ వెళ్లిపోవ‌చ్చు! బీజేపీ కి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చిన‌ట్టే అవుతుంది. 

కానీ క‌ల‌గాపుల‌గం ప్ర‌భుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయ‌గ‌ల‌దా? ఏర్పాటు చేసినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో ప‌ని జ‌రుగుతుందాకొన్నాళ్ల‌కు అయినా.. వారిపై వేటు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇది వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లోనూ ఇలానే జ‌రిగింది. అయితే క‌ర్ణాట‌క‌లో తిరుగుబాటు దార్లు కొంత‌మంది నెగ్గారు. 

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల‌ను చీల్చుకుంటూ వ‌చ్చింది. దీంతో.. ప్ర‌భుత్వం న‌డుస్తోంది. అయితే మ‌హారాష్ట్ర‌లో అదంత తేలిక కాక‌పోవ‌చ్చు క‌మ‌లం పార్టీకి!

 

 

నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి

 

పాములపర్తి వెంకట నరసింహారావు - పొట్టి చేస్తే, పీవీ నరసింహారావు - ఇంకా పొట్టి చేస్తే పీవీ అనే వామనుడు, బక్కపలచనివాడు, నిరంతరమూ నిశ్శబ్దాన్ని కప్పుకునేవాడు, బహుభాషాపండితుడు, రాజకీయంగా ఎలాంటి బలమూ లేనివాడు భారతదేశ ప్రధాని కావడమే ఒక అద్భుతం! స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చగలిగిన అద్భుతం బహుశా మరొకటి లేదు. ఇది నిజానికి 'చాయ్ వాలా' ప్రధాని కావడాన్ని మించిన విశేషం.

చాయ్ వాలా ప్రధాని కావడం అంత హఠాత్తుగా ఏమీ జరగలేదు. దానికి కనీసం రెండేళ్ల పూర్వరంగం ఉంది. పీవీకి అలాంటిదేమీలేదు.

1991లో ఇక రాజకీయ సన్యాసం తీసుకుందామని ఆయన నిర్ణయించుకుని పెట్టేబేడా సర్దుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఆయన నిజంగానే సన్యాసం తీసుకుని, తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఉన్నశ్రీ సిద్ధేశ్వరపీఠానికి అధిపతి కావాలనుకున్నట్టు వదంతులు ప్రచారంలో ఉండేవి. చివరికి, లోక్ సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతర పరిస్థితులలో ప్రధానిగా కేంద్రప్రభుత్వ అధిపతి అయ్యారు.

1950 దశకం నుంచి 1970 దశకం వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ 1977లో లోక్‌సభకు ఎన్నికై 1980 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి గొప్ప నిర్ణయాలు చేశారో, సమూల పరివర్తనకు దారి తీయగల ఎలాంటి చర్యలు తీసుకున్నారో గత రెండుతరాల తెలుగువారికి సైతం ఒక అభిప్రాయం ఉన్నట్టు లేదు.

తెలుగు అకాడెమీ స్థాపన ఆయన ఆలోచనే అంటారు కానీ, ఆ అకాడెమీ తెలుగుభాషకు ఎంత గొప్ప దోహదం చేసిందో లోతుగా చూస్తే తప్ప చెప్పలేం. ఎప్పుడూ మౌనముద్రాంకితుడిగా, గంభీరుడిగా కనిపించే పీవీలో హాస్యం లేదనుకుంటారు కానీ, తెలుగు అకాడెమీతో ముడి పెట్టి ఆయన హాస్యచతురతను సీనియర్ పాత్రికేయులు ప్రస్తావిస్తూ ఉంటారు.

ఒకసారి తనను కలసిన కొందరు పాత్రికేయులతో ఆయన ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు చెబుతున్నప్పుడు.. ఉద్యోగం లేకుండా ఏవో ఉద్యమాలలో తిరుగుతూ ఉండే ఒక యువకుడి ప్రస్తావన వచ్చిందట. ఆ యువకుడు పీవీకి కాస్త దగ్గరి బంధువు కూడా. "పాపం అతగాడు ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి తెలుగు అకాడెమీలో ఉద్యోగం ఇప్పించకూడదా?" అని పీవీతో చనువున్న ఒక పాత్రికేయుడు అన్నాడట. అప్పుడు పీవీ, "అదెట్లా కుదురుతుందయ్యా? అందులో పండితులు పనిచేస్తారట కదా?!" అన్నారట.

అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన భూసంస్కరణల అమలుకు చొరవ తీసుకున్న సంగతీ, దాని పర్యవసానాల గురించీ ఆయన ఆత్మకథాత్మక రచన 'ది ఇన్ సైడర్' (తెలుగులో 'లోపలి మనిషి')ద్వారా ఎంతో కొంత తెలుస్తోంది తప్ప తెలుగునాట అది కూడా పెద్ద ప్రచారంలో లేదు.

ఇక 1980-91 మధ్యలో ఆయన కేంద్రమంత్రిగా ఫలానా గొప్ప చర్యలు తీసుకున్నారని కూడా పెద్దగా ఎవరూ చెప్పుకోరు. ఆయన ఆలోచనా ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఒకింత మినహాయింపు.

ఆయన 'తీసుకోని చర్యలు' మాత్రం కొన్ని ప్రచారంలో ఉన్నాయి. భోపాల్‌లో వేలాదిమంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ దుర్ఘటన దరిమిలా భారత్‌కు వచ్చిన ఆ సంస్థ అధిపతి వారెన్ ఆండర్సన్, కేంద్రంలోని పెద్దల అండదండలతో అరెస్టును తప్పించుకుని అమెరికాకు జారుకున్నప్పుడు పీవీ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు.

అలాగే, అదే సంవత్సరం (1984) అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణహత్యకు గురైనప్పుడు, ఆ వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కుల ఊచకోత జరిగినప్పుడు ఆయనే హోం మంత్రిగా ఉన్నారు.

ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాబోలు, "ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే"నని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రధాని అవడాన్ని ఆయన తెలుగు సోదరులు చాలామంది హర్షించినట్టు లేరు. "ఆయనేమిటిప్రధానమంత్రి కావడమేమిటి?" అని తూలనాడుతూ అప్పట్లో ఎన్నో ఉత్తరాలు పత్రికాఫీసులకు వచ్చిపడడం ఈ వ్యాసకర్తకు తెలుసు. కేంద్రమంత్రిగా, (ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా) తెలుగు ప్రాంతాలకు ఆయన ఏమీ చేయలేదన్న విమర్శ ఉంది.

ఆర్థిక సంస్కరణలు.. పీవీపై ప్రశంస-విమర్శ

నిశ్శబ్దాన్ని కప్పుకుని హఠాత్తుగా ప్రధాని గద్దె మీద ప్రత్యక్షమైన పీవీ పాలనా దక్షత గురించి కూడా బహుశా మొదట జనం అంతే నిశ్శబ్దం పాటించి ఉంటారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పరిణామం సంభవించి జనాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అప్పటినుంచే కాబోలు జనం పీవీని ఒకింత నిశితంగా, జాగ్రత్తగా; బహుశా వారిలో చాలామంది ఒకింత ప్రశంసాభావంతోనూ గమనిస్తూవచ్చారు.

అది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీమారక నిల్వల తరుగుదల వగైరాల రూపంలో 1985లోనే క్రమంగా మొదలై, 1991 నాటికి విషమించి, దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి దారితీసిన ఆర్థిక సంక్షోభం. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం జనంలో ఆందోళన రేకెత్తించింది.

సరిహద్దుల్లో యుద్ధమే కానీ, ప్రాకృతిక ఉత్పాతాలే కానీ, కీలక రాజకీయపరిణామాలే కానీ-ఎలాంటివి సంభవించినా సాధారణంగా ప్రభావితం కాని భద్రస్థితిలో ఉండే మధ్యతరగతి బహుశా ఈ ఆర్థిక సంక్షోభంతోనే మొదటిసారి ఎక్కువ ప్రభావితమైనట్టుంది. ఆ క్షణాలలో తన కాళ్ళ కింద నేల తొలచుకుపోతున్నట్టు మధ్యతరగతి ప్రజలు భావించడంలో ఆశ్చర్యం లేదు.

తను వస్తూనే వెంటనే రంగంలోకి దిగి, డా. మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఆర్థికసరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికతను సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీపై మధ్యతరగతి విద్యావంతులలోని ఒక వర్గంలో ప్రశంసాభావం పుంజుకుని అనంతర పరిణామాలతో మిన్నంటింది.

అదే సమయంలో వారిలోనే మరొక వర్గం నుంచి ఆర్థిక సరళీకరణపై విమర్శలూ వెల్లువెత్తాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ పీవీపై ప్రశంస-విమర్శ సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి.

నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక కుదుపుతో ఒక అంగ వేయించినవాడు పీవీ నరసింహారావు. ఇవ్వాళ మనం చూస్తున్న భారత్ ఆ సంస్కరణల ఫలితమే.

ఉగ్రవాదంతో ఉడుకుతున్న పంజాబ్‌ను దారికి తేవడం వంటి పీవీ సాఫల్యాలు మరికొన్ని ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, పీవీ గురించి చెప్పుకునేటప్పుడు ఆయన ధరించిన నిశ్శబ్దత అనే ముసుగు, లేదా మౌనం మాటి మాటికీ ప్రస్తావనకు వస్తుంది, తప్పదు. ఆ నిశ్శబ్ద వ్యవహరణ దేశానికి ఏమైనా మంచో, చెడో చేసిందేమో కానీ; వ్యక్తిగతంగా శత్రువులను, అనుమానితులను, మాపుకోలేని కొన్ని కళంకాలను పెంచింది తప్ప ఆయనకు మంచి చేసినట్టు లేదు.

చివరికి చనిపోయాక మాజీ ప్రధానిగా ఆయనకు ఢిల్లీలో కాస్తంత సమాధిస్థలం కూడా దొరకలేదు. నిరంతరాయంగా నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వం గురించి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ, ఆ కుటుంబానికి చెందని పీవీ ప్రధానమంత్రి అయి, సాపేక్షంగా సమర్థంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన సంగతిని విశేషంగా ప్రచారం చేసుకునే బదులు ఆయన పట్ల కక్షధోరణిలో వ్యవహరించి తనకు తానే చెరుపు చేసుకుందనిపిస్తుంది. ఆశ్చర్యంలేదు.

ఇన్నేళ్ల అస్తిత్వంలో దాని మెదడు మోకాల్లోకి వచ్చింది!

ప్రధానిగా పీవీ తెచ్చుకున్న మాపుకోలేని కళంకం, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారని, అప్పటినుంచి వినిపిస్తున్న విమర్శ అలా ఉండగా, బాబ్రీ మసీదు కూలిపోతేనే మంచిదనుకుని ఆయన కావాలనే నిద్ర నటించారా లేక, మసీదు జోలికి వెళ్లబోమని యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను నిజంగానే నమ్మి మోసపోయారా అన్నది కచ్చితంగా మనకు తెలియదు.

బాబ్రీ మసీదు కూలిపోతే, బీజేపీ శాశ్వత అప్రతిష్ఠను మూటగట్టుకోవడమే కాక, దాని చేతిలోని ఒక రాజకీయఆయుధం మాయమై, దాని బలం క్షీణిస్తుందని ఆయన అనుకున్నారా?! లేక, ఆయన సైతం 'ఒక హిందువు'గా బాబ్రీ మసీదు పతనాన్ని కోరుకున్నారా?! మనకు స్పష్టంగా తెలియదు.

ఈ సందర్భంలో ఒక సామ్యాన్ని చెప్పుకోవాలి. అద్వానీ అయోధ్యకు రథయాత్ర ప్రారంభినప్పుడు, ఆ యాత్రను యూపీ, బీహార్‌లలోకి రాకుండా అడ్డుకుంటామని ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు పదే పదే భీషణ ప్రతిజ్ఞలు చేసి, వాస్తవానికి రథయాత్ర టెంపోను పెంచి బీజేపీ లాభపడడానికే పరోక్షంగా దోహదం చేశారు.

ఇందుకు భిన్నంగా పీవీ తన హయాంలో, మురళీ మనోహర్ జోషీ శ్రీనగర్‌కు యాత్రగా వెళ్ళి జాతీయపతాకాన్ని ఎగురవేస్తానన్నప్పుడు, నిరభ్యంతరంగా ఆ పని చేసుకోవచ్చుననీ, అందుకు అవసరమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రతిఘటన లేక ఆ యాత్ర నీరుగారింది. బాబ్రీ మసీదు విషయంలో కూడా పీవీ అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలనుకున్నారా?! ఏమో!

బాబ్రీ మసీదు పతనంలో పీవీ పాత్రకు సంబంధించిన పూర్వాపరాల గురించి వినయ్ సీతాపతి తన 'హాఫ్ లయన్: హౌ నరసింహారావు ట్రాన్స్ ఫార్ముడ్ ఇండియా' అనే పుస్తకంలో చాలా సమాచారం ఇచ్చారు. అది చదివినప్పుడు పీవీ నిర్దోషా అనిపించే మాట నిజమే కానీ, అప్పటికీ ఆయన పాత్ర గురించి పైన ప్రస్తావించిన సందేహాలు అలాగే ఉంటాయి.

బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయితో సాన్నిహిత్యం నెరపడంలో, ఆయనను కాశ్మీర్ కు సంబంధించి జెనీవా సదస్సుకు పంపడంలో కూడా తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల ధాటిని తగ్గించే వ్యూహాన్ని పీవీ అమలు చేశారా, లేక సహజసిద్ధమైన మైత్రీభావంతోనే అలా వ్యవహరించారా?! ఇదీ మనకు స్పష్టంగా తెలియదు.

పీవీ రాజకీయ, భావజాల వ్యక్తిత్వ వికాస, పరిణామాలలోకి తొంగి చూడడం కొంత ఉపయోగకరం అవుతుందేమో! ఆయన భాష, పాండిత్యం, సంస్కృతి, మతం, సంప్రదాయనిష్ఠ కలిగిన అతి పెద్ద అగ్రకులానికి చెందినవారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవడం ఎందుకు అవసరమంటే, స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఈ అగ్రకులంలోని ఒక వర్గం గాంధీని వ్యతిరేకించే సనాతన, హిందూభావజాల పక్షాన చేరితే, ఇంకో వర్గం గాంధీ-నెహ్రూల పక్షాన చేరింది.

వారిద్దరూ జీవించి ఉన్నంతవరకూ, ఆ తర్వాత కూడా హిందూభావజాల పక్షం బలం పుంజుకోనంతవరకు ఈ వర్గం గాంధీ-నెహ్రూల భావజాలాలకూ, ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, సెక్యులర్, ప్లూరలిస్టిక్ భావజాలానికీ అధికారికంగానే ప్రాతినిధ్యం వహిస్తూవచ్చింది. పీవీ 'లోపలిమనిషి' చదివితే, ఆయనపై నెహ్రూ ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. అలాగే, నెహ్రూ పట్టుబట్టిన భూసంస్కరణలు వగైరాలు కూడా.

కానీ, గాంధీ-నెహ్రూల ప్రభావాన్ని సవాలు చేస్తూ హిందుత్వ వర్గాలు బలపడుతున్నకొద్దీ, గాంధీ-నెహ్రూల లౌకికవాదం పట్లనే కాకుండా, అసలు దాని నిర్వచనంపట్ల కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆవిధంగా గాంధీ-నెహ్రూల సమ్మోహనం కింద అంతవరకూ సుప్తంగా ఉన్న హైందవ, సాంప్రదాయిక చింతన క్రమంగా పీవీ వంటి అనుయాయులలో మొదలైందా?! బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ పాత్రను అలా కూడా చూడగలమా?! సమాధానం కోసం తడుము కోవలసిన ప్రశ్నలలో ఇది ఒకటి.

ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రూపంలో మరో ఉదాహరణ స్పష్టంగా కళ్ళముందు ఉండనే ఉంది. పీవీలానే ఆయన కూడా కాంగ్రెస్‌లో చిరకాలం ఉండి, గాంధీ-నెహ్రూల భావజాలంతో ప్రభావితుడైనవారే. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించినవారే. చివరికి కాంగ్రెస్ సాయంతో రాష్ట్రపతి అయినవారే. అయినాసరే, కొన్ని రోజుల క్రితం ఆయన ఆర్ఎస్ఎస్. కార్యక్రమానికి వెళ్ళడం ఎలాంటిది? భక్తితత్పరతలు గల ఆస్తికుడిగా ఆయనలో నిద్రాణంగా ఉన్న హిందుత్వ చింతన ఇప్పుడు మేలుకున్నదా?!

అదే నిజమైతే, దైవభక్తి ఉండడాన్నే హిందుత్వగా భావించడంలోని అవగాహనారాహిత్యం గురించి ఎంతైనా చెప్పుకోవలసి ఉంటుంది. అందుకు ఇది వేదిక కాదు.

పీవీ గారి 'ది ఇన్ సైడర్' ను 'లోపలి మనిషి' పేరుతో అనువదించిన వాడిగా ఆయనను పలుసార్లు కలసుకునే అవకాశం కలిగింది. ఒక సందర్భంలో ఆయన అన్న మాటలకు భయంతో నా ఒళ్ళు జలదరించింది.

మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక క్షణం ఆగి, ఆలోచనాముద్ర వహించి, తల వంచి, "ఎన్నో చేయాలని అనుకున్నాను. చేయలేకపోయాను" అన్నారు. మళ్ళీ ఒక్క క్షణం మౌనం తర్వాత.. "యూపీ, బీహార్‌లు ఈ దేశానికి గుదిబండలుగా మారాయి. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు" అంటూ భారంగా నిట్టూర్చారు.

ఈ మాటలకు భయంతో ఎందుకు ఒళ్ళు జలదరించిందంటారా? అయిదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుకొచ్చిన ఒక మాజీ ప్రధాని "ఎన్నో చేయాలనుకున్నాననీ, చేయలేకపోయాననీ" అన్నప్పుడు ఇంత పెద్ద దేశమూ, దానిని ఆవరించిన సమస్యలూ ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలి ఎవరికి మాత్రం భయం కలగదు?!

ఇప్పుడాలోచిస్తే ఆయన నిశ్శబ్దమే దేశానికి ఎంతోకొంత దోహదం చేసిందేమో ననిపిస్తుంది. ప్రధాని స్థానంలో ఉన్నవారు నిశ్శబ్దంగా పనిచేయడంలో శ్రద్ధ చూపాలి కానీ మాటలు చెప్పడంలో కాదని ఇప్పటి అనుభవం రీత్యా మరింత బలంగా అనిపిస్తుంది.

ఎన్నో చేయాలన్న తన కోరికను నిశ్శబ్దంగా తనలోనే దాచుకుని, చేయలేకపోయినందుకు ఆ తర్వాత విచారం వ్యక్తం చేసిన ఈ మాజీ ప్రధానికి భిన్నంగా; ఎన్నో చేస్తామని చెబుతూనే అన్నీ చేయక పోవడం ఇప్పుడు చూస్తున్నాం.

 

 

రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ 8 నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. గ‌త కొంత కాలంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌ధ్య వ్య‌వ‌హారం ఉప్పునిప్పులా ఉంది. సేవారంగం నుంచి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావించారు. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం పంపింది. దాన్ని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డం వారి మ‌ధ్య విభేదాల‌కు బీజం వేసింది.

ఆ త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌కుండా ప్ర‌భుత్వం త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత కేసీఆర్ స‌ర్కార్‌పై గ‌వ‌ర్న‌ర్ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం అగ్గికి ఆజ్యం పోసిన‌ట్టైంది. ఉగాది వేడుక‌ల‌కు సీఎం, మంత్రుల‌ను ఆహ్వానించినా వెళ్ల‌లేదు. ఇటీవ‌ల రాజ్‌భ‌వ‌న్‌లో మ‌హిళా ద‌ర్బార్‌ను గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించి కేసీఆర్ స‌ర్కార్‌కు మ‌రింత కోపాన్ని తెప్పించారు.

ఈ నేప‌థ్యంలో కొన్ని నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌లో కేసీఆర్ అడుగు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ప్ర‌మాణ స్వీకారానికి సీఎం, మంత్రులు వెళ్లారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూచోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ ప్ర‌మాణ స్వీకారం చేసే సంద‌ర్భంలో కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి చీఫ్ జ‌స్టిస్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం విశేషం

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...