Thursday 23 June 2022

 

లంచం కోసం పుస్తెల తాడు!!??

ఏడడుగులు. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించే మహిళలు తాళికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తమ మెడలో తాళిని అత్యంత గౌరవిస్తారు. అంతటి విలువనిచ్చే తాళే లంచంగా ఇస్తూ .. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు అక్కడి మహిళలు. రాజన్న సిరిసిల్లీ(Rajanna sircilla)జిల్లాలో లంచగొండి అధికారులతో విసిగిపోతున్న బాధిత మహిళలు చివరకు మంగళసూత్రాన్ని సైతం ఇస్తున్నారు. డబ్బుల కోసం కక్కూర్తి పడుతున్న అవినీతి అధికారులు తీరును సమాజానికి ఎత్తి చూపుతున్నారు బాధిత మహిళలు. జిల్లాలోని వేములవాడ(Vemulawada)నియోజకవర్గం లంచాలు, లంచగొండి యంత్రాగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందనే విషయాన్ని పలు ఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. వేములవాడ నియోజకవ రంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితురాళ్లు తమ మంగళ సూత్రాలను లంచంగా తీసుకోవాలని ఆందోళనకు దిగుతున్న తీరు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు పరాకాష్టగా మారాయని చెప్పకతప్పదు . లంచం తీసుకోని తమ భూమిని వేరే వ్యక్తుల పేరుతో పట్టా ఇచ్చారంటూ రుద్రంగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగ అనే బాధితురాలు గతంలో ఆందోళనకు దిగింది. మండలంలోని మానాలలో 130/14 సర్వే నంబర్ లోని రెండెకరాల భూమి పట్టాదారుల పేర్లను రెవెన్యూ అధికారులు మార్చేశారు . దీంతో తన మెడలోని మంగళసూ త్రాన్ని తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టింది మంగ అనే మహిళ. తన తాళి బొట్టును లంచంగా తీసుకోని అధికారులు న్యాయం చేయాలంటూ ఆఫీస్ ముందు బైఠాయించింది. ఆమె భర్త రాజేశం మృతి చెందడంతో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమే వారికి జీవనాధారమైంది. మంగకు చెందిన భూమిని అధికారులు పట్టాదారులుగా మరొకరి పేరుతో మార్చి రికార్డుల్లోకి ఎక్కించడంతో చివరకు బాధితురాలు ఈవిధంగా న్యాయపోరాటానికి దిగింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తాళి బొట్టును కార్యాలయం గేటుకు కట్టి దానిని తీసుకోని న్యాయం చేయండి సారూ .. అంటు వేడుకుంది. ఇక్కడ మహిళ ఆవేదన ఇలా ఉంటే రుద్రంగి మండల కేంద్రంలో లంచావతారానికి ఓ ప్రాణం బలైపోయింది. నర్సయ్య , కిషన్ అనే అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ కొనసాగుతోంది. భూ తగాదాలతో కిషన్ ట్రాక్టర్‌తో నర్సయ్యను ఢీ కొట్టి హత్య చేశాడు. ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడని బాధిత కుటుంబం ఆరోపించింది. నర్సయ్య బ్రతికి ఉన్నప్పుడే న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నా పట్టించుకోకుండా కిషన్‌కే మద్దతిచ్చారనే విమర్శించారు. నర్సయ్యను హతమార్చిన కిషన్ పోలీసులకు లొంగిపోవడంతో అతడ్ని అప్పగించమని మృతదేహంతో స్టేషన్‌ ముందు భైటాయించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే నర్సయ్య భార్య దేవెంద్ర తన మెడలోని తాళిబొట్టు తీసి లంచంగా తీసుకోని తనకు న్యాయం చేయాలంటూ గుండెలవిసేలా రోధించింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోనే అవినీతికి అలవాటు పడిన రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సమస్యను బాధితులు మొదట్లోనే పరిష్కరించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. చివరికి ఈ పరిస్థితి ఎలా మారిపోయిందంటే లంచాలకు అలవాటు పడిన అధికారుల కారణంగా నిజాయితీగా పనిచేసే అధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా తయారైంది.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...