‘అగ్నిపథం’ కండిషన్స్ అప్లై
దేశంలో సైనికశిక్షణ పొందిన యువతరం పుష్కలంగా అందుబాటులో
ఉండడం, సైనిక
బలగాలను నెమ్మది నెమ్మదిగా అత్యుత్తమ ప్రతిభావంతులతో మాత్రమే నింపడం అనేది
లక్ష్యంగా అగ్నిపథ్ పథకాన్ని రూపొందించినట్లుగా కేంద్రం ప్రచారం చేసుకుంటూ
వచ్చింది.
నిజానికి ప్రకటించిన రోజు
నాటికి అగ్నిపథం అసలు స్వరూపం అదే. కానీ.. సైనిక విభాగాల నియామక నోటిఫికేషన్లు
వెలువడే సమయానికి అసలు రూపం బయటపడుతోంది. ముసుగులు తొలగిపోతున్నాయి. అగ్నివీరులుగా
ఎంపికయ్యే ప్రతి బ్యాచ్ లో 25 శాతం మందిని.. సైనిక సర్వీసుల్లోకి తీసుకుంటారు అనే మాట
మిథ్య అని తేలిపోతున్నది. ఒకవైపు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. కేంద్రం
యొక్క అసలు వంచన స్వరూపం కూడా బయటకు వచ్చింది.
అగ్నిపథ్ ద్వారా.. ఏటా జరిగే
అగ్నివీరుల నియామకాల్లో నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని సర్వీసుల్లోకి
తీసుకుంటారనేది తొలినాటి ప్రకటన. కానీ ఆర్మీ నోటిఫికేషన్లు వచ్చిన సమయానికి చిన్న
మెలిక పెట్టారు. 25 శాతం
మందిని తీసుకోవడం అనేది కంపల్సరీ కాదు. అది ఆర్మీ ఇష్టం! అంటే మొత్తం నూరుశాతం
మందిని కూడా ఇంటికి పంపేసి.. మరో బ్యాచ్‌ను కొత్తగా నాలుగేళ్లు మాత్రమే పనిలో ఉండే
అగ్నివీరులుగా తీసుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైనిక బలగాలు ఎప్పుడూ స్థిరంగా
ఉంటాయి. కానీ పర్మినెంట్ ఉద్యోగం ఉన్న సైనికుల సంఖ్య చాలా దారుణంగా తగ్గిపోతూ
ఉంటుంది.
అయితే ఇందులో చిన్న
వెసులుబాటును ప్రకటించారు. ఈ నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న వారు.. మళ్లీ ఫ్రెష్ గా సైనిక
నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల వలన వారికి కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది.
అప్పుడు సెలక్షన్ ప్రక్రియ యధావిధిగా చేపడతారు. అయితే ఆ సెలక్షన్లు ఎంత విస్తృతంగా
జరుగుతాయి. తద్వారా అవకాశాలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ లేదు. నాలుగేళ్ల తర్వాత
జరగబోయే ప్రక్రియ కాబట్టి.. ఇప్పుడే దానికి సంబంధించి ఎవరైనా ప్రకటించిన మాటలు
నమ్మడానికి కూడా అవకాశం లేదు.
ఇప్పుడు అగ్నిపథ్ గురించి
ఆందోళన చెందుతున్న వారు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఈ
గందరగోళం సృష్టించకుండా ఇంకో పనిచేసి ఉంటే బాగుండేది. 17.5ఏళ్లు కనీస వయోపరిమితి
కాబట్టి.. టెన్త్, ఇంటర్
స్థాయుల్లో ఎన్‌సీసీ లాంటి సైనిక అనుబంధ శిక్షణను ప్రతిచోటా ప్రవేశపెట్టి.. అందులో
శిక్షణ పొందిన వారు మాత్రమే సైనిక నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆ శిక్షణ లేని వారు అనర్హులని
చెప్పి ఉంటే సరిపోయేది.
ప్రభుత్వానికి అగ్నివీరులు
అనే ముసుగుకింద నాలుగేళ్లపాటు ఇచ్చే జీతాల భారం కూడా తగ్గేది. ఇప్పుడు అనేక రకాల
గందరగోళాలకు, అస్థిరత్వానికి
కారణమయ్యేలా ప్రభుత్వం ఆలోచనలు, ఆచరణ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment