Thursday 30 June 2022

 

ఆటో నడిపే స్థాయి నుంచి సీఏం స్థాయికి ఏక్‌నాథ్ శిందే


మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిశాయి. అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తాను భాగంగా ఉండనని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.

మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్లు ఏక్‌నాథ్ శిందే తెలిపారు. వీరిలో 40 మంది శివసేన పార్టీకి చెందిన వారని అన్నారు.

50 మంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. వారి మీద ఈగ కూడా వాలనివ్వను. బాల ఠాక్రే హిందుత్వానికి అనుగుణంగా మేమంతా ఈ నిర్ణయం తీసుకున్నాం.అని ఏక్‌నాథ్ శిందే చెప్పుకొచ్చారు.

తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఏక్‌నాథ్ శిందే థానేలోని కోప్రి- పచ్పఖాడి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో ముఖ్యమైన నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు శ్రీకాంత్ శిందే కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఏక్‌నాథ్ శిందే చాలా ఏళ్లుగా శివసేన సభ్యుడిగా ఉన్నారు. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తరువాత, 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తొలినాళ్లల్లో ఆయన ఆటోరిక్షా నడిపేవారు.

థానేలోని వైభవ్ వార్తాపత్రిక సంపాదకుడు మిలింద్ బల్లాల్, ఏక్‌నాథ్ శిందే రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ "దూకుడు తత్వం ఉన్న శివసైనిక్ నుంచి శాఖలో ముఖ్యుడిగా మారి, బాధ్యతాయుతమైన మంత్రిగా ఎదిగారు" అని అన్నారు.

"ఏక్‌నాథ్ స్వస్థలం సతారా. చదువుల కోసం ఆయన థానే వెళ్లారు. అక్కడ ఆయనకు ఆనంద్ దిఘేతో పరిచయం ఏర్పడింది. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది" అని మిలింద్ బల్లాల్ వివరించారు.

  • 18 ఏళ్ల వయసులో శివసేనలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
  • దాదాపు దశాబ్దంన్నర పాటు పార్టీలో పనిచేసిన తరువాత 1997లో ఆనంద్ దిఘే.. ఏక్‌నాథ్‌కు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్ ఇచ్చారు.
  • ఈ మునిసిపల్ ఎన్నికల్లో గెలవడమే కాకుండా థానే మున్సిపల్ కార్పోరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యారు ఆయన.
  • ఆ తరువాత 2004లో థానే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • 2009 నుంచి కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
  • ప్రస్తుతం ఆయన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే కాకుండా థానే జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు.

 

 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...