Monday 25 July 2022

 

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు  ప్రమాణస్వీకారం.



భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వేడుకలా జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా దేశ ప్రధమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె తొలి సందేశం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగాన్ని.. మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారాలతో మొదలుపెట్టి.. ప్రియమైన దేశవాసులారా..అంటూ కొనసాగించారు. ఇప్పటిదాకా పనిచేసిన రాష్ట్రపతుల్లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన అబ్దుల్ కలాం కొటేషన్ కలలు కనండి..కి కొనసాగింపుగా ఇప్పుడు ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. దేశంలో అట్టడుగు పేదలు సైతం కేవలం కలలు కనడమేకాదు.. వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని తన జీవిత గమనం రుజువు చేస్తుందని ముర్ము వ్యాఖ్యానించారు

‘‘భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా దేశంలోని చట్టసభలు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్ల మంది విశ్వాసం, నమ్మకాల ఆధారంగా నడిచే పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు నా నమస్సులు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయత, సహయోగత వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఆజాదీకా అమృత్ మహోత్సవం సమయంలో నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. భారత్ 50వ స్వాతంత్ర్య వేడుకల ఏడాదే నా రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ నాకీ గొప్ప అవకాశం లభించింది.. ఒడిశాలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ దేశ అత్యున్నత పదవి చేపట్టడం గర్వకారణంగా ఉంది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషన్ ఓ రుజువు. ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేయడమే అప్పట్లో నాకు కలగా ఉండేది. అలాంటి స్థాయి నుంచి ఇక్కడికి రాగలిగాను..

75వ స్వాతంత్ర్య దినోత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గౌరవంగా ఉంది. అంతేకాదు, స్వాతంత్ర్య

 భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగానూ నాకు అదృష్టం దక్కింది.

 స్వాతంత్ర్యయోధులు కలలుకన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా మనం పనిచేయాల్సిన

 అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్రను కొనసాగించాల్సి ఉంది. సబ్ కా సాథ్.. సబ్

 కా కర్తవ్య్..నినాదంతో ముందకు వెళదాం..’’ అని తొలి సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...