Monday 4 July 2022

 

మరో కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా..

లూహాన్స్క్ ప్రాంతం మొత్తం ఇప్పుడు రష్యా బలగాల చేతుల్లోకి వచ్చిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదివారం నాడు దేశాధ్యక్షుడు పుతిన్‌తో చెప్పారు.

తీవ్రమైన యుద్ధం తర్వాత యుక్రెయిన్ సైనికులు తమ పోరాటాన్ని ఉపసంహరించుకున్నారని ఆ దేశ ఆర్మీ జనరల్ ప్రకటించారు.

అంతకుముందు.. లీసిచాన్స్క్ నగరం నడిబొడ్డున చెచెన్ ఫైటర్లు ఉన్న దృశ్యాలను చూపుతున్నట్లుగా కనిపిస్తున్న వీడియోను రష్యాకు చెందిన చెచెన్ రిపబ్లిక్ అధిపతి రమజాన్ కాదిరోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరోవైపు పశ్చిమాన యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న స్లోవియాన్స్క్ నగరం మీద భారీ షెల్లింగ్ దాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు చనిపోయారు.

ఈ నగరం దోన్యస్క్ ప్రాంతంలో ఉంది. దోన్యస్క్, లూహాన్స్క్ ప్రాంతాలు కలిసివుండే పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలన్నది రష్యా వ్యూహం.

యుక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించటానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్.. లూహాన్స్క్, దోన్యస్క్ ప్రాంతాలను యుక్రెయిన్ నుంచి స్వతంత్రమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రష్యా ప్రచ్ఛన్న బలగాలు 2014లో అంతర్గత తిరుగుబాటును ప్రారంభించాయి.

రష్యా బలగాలు వారం రోజుల కిందట సెవెరోదోన్యస్క్ నగరాన్ని హస్తగతం చేసుకున్నాయి. అప్పటికే కొన్ని వారాల పాటు సాగిన రష్యా బాంబుదాడుల్లో ఆ నగరం శిథిలాల మయంగా మారింది.

అయితే.. లూహాన్స్క్ ప్రాంతంలో యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న చిట్టచివరి ప్రధాన నగరం లీసిచాన్స్క్. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతం మొత్తంపైన ఇప్పుడు రష్యా పట్టు సాధించిందని రష్యా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు.

రష్యా సైన్యం ఆ నగరంలోకి ప్రవేశించినట్లు సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూపుతున్నాయి. నగరంలోనే ఉండిపోయిన స్థానికులు కొందరు రష్యా సైనికులను 'విముక్తి ప్రదాతలు'గా హర్షాతిరేకాలతో ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నాయని బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్ జొనాథన్ బాలే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కొంతమేరకు రష్యా అనుకూల భావజాలం ఎల్లప్పుడూ ఉంది.

సెవెర్స్కీ డోనెట్స్ నదికి ఒకవైపు సెవెరోదోన్యస్క్ నగరం ఉంటే.. మరోవైపు లీసిచాన్స్క్ నగరం ఉంటుంది. ఎత్తు మీద నిర్మితమైన ఈ నగరం రష్యా బలగాల నుంచి సహజమైన రక్షణ కల్పిస్తుందనే ఆశ కొంతవరకూ ఉండింది. కానీ నగరం నుంచి రాకపోకలు సాగించే మార్గాలన్నిటినీ రష్యా బలగాలు నియంత్రిస్తుండటంతో ఈ నగరానికి ఉచ్చు బిగుసుకుంటోందని జొనాథన్ వివరించారు.

యుక్రెయిన్ సైనిక కమాండర్లు.. భారీ ప్రాణనష్టాన్ని పణంగా పెడుతూ పోరాటం కొనసాగించాలా, లేదంటే పోరాటాన్ని వాయిదా వేయటానికి తమ సైనికులను ఉపసంహరించుకోవాలా అని ఆలోచించుకుని, చివరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజుల్లో దిగువ ప్రాంతాలకు కొన్ని యూనిట్లు వెనుదిరిగివెళ్లగా, ఇప్పుడు పూర్తి పోరాటాన్ని ఉపసంహరించుకుంది యుక్రెయిన్.

ఈ నగరంలో జరుగుతున్న పరిణామాల విషయంలో యుక్రెయిన్ ప్రభుత్వ పెద్దలు అసాధారణంగా మౌనం పాటిస్తున్నారు. సైనికచర్యల భద్రత కారణాలు ఇందుకు కొంతవరకూ కారణం కావచ్చు. వ్యూహాత్మకంగా వెనుకంజ వేయటం జరుగుతున్నట్లయితే.. ఆ విషయాన్ని ప్రసారం చేయాలని వారు కోరుకోకపోవచ్చు. అయితే లీసిచాన్స్క్ నగరాన్ని కోల్పోవటం తూర్పున యుక్రెయిన్‌కు మారో ఎదురుదెబ్బగా చూస్తారు.

లూహాన్స్క్ ప్రాంతానికి స్వాతంత్ర్యంలభించిందని రష్యా ప్రకటించింది. అయితే, తాము ఒక నగరంలో మాత్రమే ఓడిపోయామని, మొత్తం యుద్ధంలో ఓడిపోలేదని లూహాన్స్క్ గవర్నర్ సెర్హీయ్ హైదాయ్ బీబీసీ ప్రతినిధి జో ఇన్‌వుడ్‌తో చెప్పారు.

రష్యా వద్ద ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలతో లీసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో ఇంక తమ దళాలు అక్కడ ఉండి పోరాడటం సరికాదనే తాము వెనక్కు తగ్గామని ఆయన తెలిపారు.

కాగా, లూహాన్స్క్ ప్రాంతాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకుంటామని యుక్రెయిన్ అద్యక్షుడు జెలియెన్‌స్కీ ప్రకటించారు.

లీసిచాన్స్క్ నగరం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయినా డోన్బాస్ ప్రాంతంలో పోరాటం ముగిసినట్లు కాదు. దోన్యస్క్‌లోని చాలా పట్టణ ప్రాంతాలు ఇంకా యుక్రెయిన్ నియంత్రణలోనే ఉన్నాయి. ఆ దేశ బలగాలు బక్ముత్, స్లోవియాన్స్క్ ప్రాంతాల మధ్య కొత్త రక్షణ క్షేత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతాలపై భారీగా రష్యా షెల్లింగ్ దాడి జరుగుతోంది. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది.

రష్యా పురోగతిని యుక్రెయిన్ ఆపగలదా? రష్యా ఈ గెలుపు పరంపరను కొనసాగించగలదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

దోన్యస్క్ ప్రాంతంలోని స్లోవ్యాన్స్క్, క్రమటోర్స్క్ నగరాలు ఇంకా యుక్రెయిన్ చేతుల్లోనే ఉన్నాయి. స్లోవ్యాన్స్క్ నగరం మీద రష్యా భారీగా బాంబు దాడులు చేస్తోంది.

ఇదిలావుంటే.. యుక్రెయిన్ ఉత్తర సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో.. రష్యా భూభాగంలో గల బల్గోరాడ్ నగరం మీద యుక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని రష్యా ఆరోపించింది.

ఈ దాడుల్లో నలుగురు చనిపోయారని స్థానిక గవర్నర్ చెప్పారు. యుక్రెయిన్ టోచ్కా-యు మిసైళ్లు మూడింటిని తాము కూల్చివేశామని, వాటి శిథిలాలు ఒక అపార్ట్‌మెంట్ మీద పడ్డాయని రష్యా సైనిక కమాండర్ పేర్కొన్నారు.

రష్యా వాదనను యుక్రెయిన్ అధికారులు తిరస్కరించారు. రష్యా ఆ నగరంలో ప్రజలను రెచ్చగొట్టటానికి నాటకం ఆడిందని వారు ఆరోపించారు.

 

4 comments:

  1. రష్యా పురోగతిని యుక్రెయిన్ ఆపగలదా? రష్యా ఈ గెలుపు పరంపరను కొనసాగించగలదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

    ReplyDelete
  2. రష్యా సైన్యం ఆ నగరంలోకి ప్రవేశించినట్లు సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూపుతున్నాయి. నగరంలోనే ఉండిపోయిన స్థానికులు కొందరు రష్యా సైనికులను 'విముక్తి ప్రదాతలు'గా హర్షాతిరేకాలతో ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నయీ

    ReplyDelete
  3. ఇలాంటి వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

    ReplyDelete
  4. తీవ్రమైన యుద్ధం తర్వాత యుక్రెయిన్ సైనికులు తమ పోరాటాన్ని ఉపసంహరించుకున్నారని ఆ దేశ ఆర్మీ జనరల్ ప్రకటించారు

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...