Wednesday 6 July 2022

 

 

బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ పై ఆర్టీఐ అస్త్రం!!!!

 

తెలంగాణలో TRS వర్సెస్ BJP వార్ ముదురుతోంది. తాజాగా టీఆర్ఎస్‌ను(TRS) టార్గెట్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా బండి సంజయ్ ప్రయోగించారు. సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆర్టీఐకి 88 దరఖాస్తులు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. వైద్య, విద్యాశాఖలకు సంబంధించి సమచారం కూడా కోరారు. బీజేపీ సమావేశాలు ముగిసిన మూడు రోజుల్లోనే టీఆర్ఎస్ సర్కార్ పై బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే సంజయ్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఆర్టీఐ నుంచి వచ్చే సమాధానం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ వ్యూహం వెనుక పెద్ద ఆలోచన ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయాన్ని ప్రస్తావించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి కూడా పెద్ద ఎత్తున తీసుకెళుతోంది గులాబీ పార్టీ.

దీంతో తెలంగాణలోని అధికార పార్టీ ఏ పథకానికి ఏ మేరకు ఖర్చు చేస్తుందనే అంశాలను కూడా గణాంకాలతో వివరిస్తేనే తమకు పొలిటికల్ మైలేజీ వస్తుందనే భావనలో ఉంది బీజేపీ. అందుకే అన్ని విభాగాలు, శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తెప్పించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సమాచారం వచ్చిన తరువాత అందులో లెక్కలను బయటకు తీసి.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ కూడా సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను బీజేపీ తీసుకుంటే.. కేంద్రంలోని లెక్కలను కూడా అదే ఆర్టీఐ ద్వారా సేకరించాలని టీఆర్ఎస్ కూడా యోచిస్తోందని సమాచారం. మొత్తానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ.. ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి.. బండి సంజయ్ సరికొత్త రాజకీయ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి

1 comment:

  1. బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ కూడా సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను బీజేపీ తీసుకుంటే.. కేంద్రంలోని లెక్కలను కూడా అదే ఆర్టీఐ ద్వారా సేకరించాలని టీఆర్ఎస్ కూడా యోచిస్తోందని సమాచారం.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...