Thursday, 29 September 2022

 

దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉంది---- యువ శక్తి యూత్



కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయం దగ్గర దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా ఈరోజు అన్నపూర్ణ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు, అన్నపూర్ణ  అవతారం అంటేనే అందరికి అన్నం పెట్టె శక్తి,  . రైతే దేశానికి రాజు రైతే దేశానికి వెన్నుముక అని భావించి స్థానికంగా ఉన్న  యువ శక్తి యూత్. రైతులను సన్మానించిన  సన్మానించటం జరిగింది. యూత్ ప్రసిడెంట్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉందని... రైతు లేనిదే రాజ్యం లేదని యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితే నూతన పద్ధతిలో వ్యవసాయం చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రంమలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు కమిటీ సభ్యులు  గ్యారెపల్లి ఆనంద్,  పిట్టల కృష్ణ రైతులను మరియు ఇళ్ళంతకుంట మండలానికి చెందిన ఏ ఈ ఓ రాకేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా యువ శక్తి యూత్ రాజేష్, నాగేష్, సతీష్ లు మాట్లాడుతూ రైతులను గుర్తించి వారిని అభినందించడం చాలా సంతోషం గా వుంది అని అన్నారు

 

అసంబ్లీ రద్దు జాతీయ పార్టీ ముద్దు .... వ్యూహం మార్చిన గులాబీ దళపతి

 


‘పాతసీసాలో కొత్త సారా’అనేది చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం కేసీఆర్ ప్లాన్ చేస్తున్న జాతీయ పార్టీ వ్యవహారం కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఆయన అచ్చంగా కొత్త పార్టీ పెట్టబోవడం లేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే కొత్తగా జాతీయ పార్టీ రూపం ఇవ్వబోతున్నారు. కాకపోతే.. ‘తెలంగాణ’ అనే పేరు తగిలించుకుని పుట్టిన పార్టీకి జాతీయ రూపం అంటే జనం నవ్వుతారు గనుక.. పార్టీ పేరు మార్చి.. కొత్తగా చెలామణీలోకి తేవాలనేది ఆయన ఆలోచనగా వినిపిస్తోంది. ఈ సంగతే ఆయన అంటున్నట్టుగా దసరా నాటికి ప్రకటిస్తారనేది సమాచారం. 

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తథ్యం అని ప్రకటించిన తర్వాత.. భారత రాష్ట్ర సమితి పేరుతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చాలా ప్రచారం జరిగింది. ఆ పార్టీ జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. దేశంలోని బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీన్నిటినీ ఒక గొడుగు కిందకు తేవడమే లక్ష్యంగా తన అడుగులు ప్రారంభించిన కేసీఆర్.. ఆలోచనను జాతీయ పార్టీగా తన పార్టీనే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి అనేది తెరాసకే కొత్త పేరు కాబోతున్నదని సమాచారం. 

జాతీయ పార్టీగా రూపుదాలిస్తే.. తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా పోటీచేయాలి. తెలంగాణ తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోటీకి కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో ఆయన సొంతంగా పోటీచేయగల సీట్లు ఎన్ని? ఏ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుని.. అక్కడి పార్టీలనుంచి సీట్లు పొందగల స్థితిలో ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలే.

కేసీఆర్ కు ఇంకో పెద్ద సమస్య ఉంది. ఆయన ఇప్పటిదాకా కలిసిన పార్టీల వారందరూ కూడా.. కాంగ్రెస్ కూడా ఉండవలసిన కూటమినే ఇప్పుడు అభిలషిస్తున్నారు. తద్వారా బిజెపి వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదని అంటున్నారు. మరి కాంగ్రెస్ తో జట్టుకట్టే రాజకీయాలు కేసీఆర్ కు లోకల్ గా రాష్ట్రంలో చేటు చేస్తాయి కదా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు కేసీఆర్ చిన్న డ్రామా నడిపించాల్సి వస్తుంది. 

తన పాత పార్టీకి కొత్త పేరును తగిలించిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి నెగ్గాలి. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కూడా ఉండే కూటమితో.. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ జట్టు కట్టవచ్చు! అయినా ఇన్ని డొంకతిరుగుడు ప్రయోగాలు ఆయనకు ఫలితమిస్తాయో లేదో వేచిచూడాలి.

దసరా రోజు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సహా ఇప్పటికే కేసీఆర్ తో కలిసి పని చేయటానికి ముందుకొచ్చిన ఇతర పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ పేరుతో పాటుగా జెండా - అజెండా ఖరారు చేసారు. అదే రోజున తన జాతీయ పార్టీ నిర్వహణకు వీలుగా జాతీయ కో ఆర్డినేటర్లను కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్‌ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా తమ అజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.

అందుకే మునుగోడులో అందరికంటే ముందే సబ పెట్టినా, అభ్యర్థి ని ప్రకటించకుండా ఉన్నదనేది వాస్తవం, ఆయనకు సన్నిహితుహలకు అదే చెప్పినట్టు వినికిడి అయితే దేశవ్యాప్తంగా రైతులను ఆకర్షించే తన జాతీయ పార్టీ, అజెండా ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. దీనికి భారత రైతు సమితి పేరును కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని పలువురు అంచనా…



 

 

 

Sunday, 25 September 2022

 

సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ’ వేడుకలు.

 



 

ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ.

. బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ప్రకృతే. ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ

 ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మనే ‘బొడ్డెమ్మ’ అని కూడా అంటారు. దసరా శరన్నవరాత్రులు అంటే తొమ్మిది

 రోజులు జరిపే ఈ బతుకమ్మ పండుగను ఒక్కోరోజు ఒక్కో పేరుతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు, ఈ

 వేడుకలు రోజూ ఒకేలా ఉండవు. తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లుగా ఈ వేడుకలు సాగుతాయి.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఇవి కూడా చాలా సంప్రదాయబద్దంగా జరుగుతాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అంటే ఈ రోజుకంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మను అలంకరించడానికి పూలు కోస్తారు. అవి మరుసటి రోజుకు వాడిపోకుండా నీళ్లలో వేసి, తర్వాతి రోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే ఈ బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలు తమలపాకులు, తులసి ఆకులను వాయనంగా ఇస్తారు. రెండోరోజు తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, గడ్డి పూలను సేకరించి, గౌరమ్మను పేరుస్తారు. సాయంత్రం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా అటుకులు పంచుతారు. ఇక మూడోరోజు సీతమ్మ జడ, చామంతి, రామ బాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి, ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయనంగా ఇస్తారు. నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ నిర్వహిస్తారు. ఈ రోజు గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. ర్వాత నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు. ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పూజిస్తారు. చివరగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఆడపడుచులంతా బతుకమ్మలు పేర్చి, వాటి చుట్టూ చేరి చప్పట్లు, కోలలతో, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ రోజుతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.

సనత్ నగర్ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ ఆధ్వర్యంలో మొదటి రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం చాల ఆనందంగా ఉందని, కార్యక్రంలోపాల్గొన్న మహిళలు అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీలత, అఖిల కొన్నే, ఝాన్షి రాణి, స్వాతి, వాణి, పిల్లలు తదితరులు పాలొగొన్నారు 

 

 

Tuesday, 20 September 2022

 

రాజ‌కీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయాలు నా నుంచి దూరం కాలేదు

 


మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచ‌ల‌న‌మే. సినిమాల్లో ఆయ‌న విజ‌య‌వంత‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. కానీ రాజ‌కీయాల్లో మాత్రం ఫెయిల్యూర్ లీడ‌ర్‌గా ప్ర‌స్థానాన్ని ముగించారు. రాజ‌కీయాలు మానుకుని ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల్లో బిజీ అయ్యారు. రాజ‌కీయాల‌కు, వివాదాల‌కు ఆయ‌న చాలా దూరంగా ఉంటారు.

అలాంటి చిరంజీవి తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌కు దూరం కాలేద‌నేది ఆయ‌న మాట‌ల సారాంశం. చిరంజీవి వాయిస్‌తో ఉన్న ప‌ది సెకెండ్ల ఆడియోలో ఏముందంటే...

"నేను రాజ‌కీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయాలు నా నుంచి దూరం కాలేదు" అని చిరంజీవి కామెంట్స్ చేయ‌డం దుమారం రేపుతోంది. రాజ‌కీయాల‌తో అనుబంధం కొన‌సాగుతోంద‌ని ఆయ‌న చెప్ప‌డం వెనుక ఉద్దేశం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇటీవ‌ల కొంత కాలంగా చిరంజీవిని ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఆ పార్టీ తీసుకురావాల‌ని అనుకుంటున్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిరంజీవి ఆస‌క్తి చూప‌లేద‌ని చెబుతూ వ‌చ్చారు.

తాజాగా రాజ‌కీయాల‌పై కామెంట్స్ చేయాల్సిన అవ‌స‌రం చిరంజీవికి ఎందుకొచ్చింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే గాడ్ ఫాద‌ర్ సినిమాలో చిరంజీవి డైలాగ్ అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా జ‌న‌సేన పార్టీ పెట్టుకుని క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అలాంట‌ప్పుడు త‌మ్ముడికి పోటీగా మ‌రో పార్టీలో చిరంజీవి ఎందుకు చేరుతార‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. 

ఇలా ఎవ‌రిష్ట‌మొచ్చిన‌ట్టు వారు చిరు కామెంట్స్‌పై విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తాజా చిరంజీవి ట్వీట్ మాత్రం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

 

Monday, 12 September 2022

  

ఎల‌క్ట్రిక‌ల్ బైక్ షోరూమ్ భారీ అగ్నిప్రమాదం!



ప్ర‌మాదం అనేది ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికి తెలియ‌దు. నిన్న రాత్రి 9.30 గంట‌ల ప్రాంతంలో.. సికింద్రాబాద్ లోని ఒక ఎల‌క్ట్రిక‌ల్ బైక్ షోరూమ్ భారీ ఆగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో ఏడుగురు మ‌ర‌ణించ‌డంతో పాటు ప‌లువురు ప‌రిస్ధితి సీరియస్ గా ఉంది. కింద సెల్లార్ లో బైక్ షోరూమ్ పైన లాడ్జి ఉండ‌టంతో షోరూంలో జ‌రిగిన ఆగ్ని ప్ర‌మాదం వ‌ల‌న‌ చేల‌రేగిన మంట‌లు, పొగ లాడ్జిలోకి వ్యాపించ‌డంతో ఊపిరాడ‌క ప్ర‌మాదం జ‌రిగింది.

అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇ-ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో బ్యాటరీ బ్లాస్ట్‌ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందే తెలిసేలోపే బాంబుల్లా పేలాయి బ్యాటరీలు. దట్టమైన పొగ కమ్మేయడంతో లాడ్జ్‌లో ఉన్న దాదాపు పాతికమంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మ‌ర‌ణించిన వారు దాదాపు ఉత్తరాది రాష్ట్రాల‌కు చెందిన వారుగా గుర్తించారు. బ‌తుకు దేరువు కొసం హైద‌రబాద్ కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

లాడ్జిలో ఉన్న చాలామంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకారు. మరి కొంత మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

నాలుగు అంతస్థులో లాడ్జి. టూరిస్టులు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఒక్కటే మార్గం. పక్కనే ఇరుకుగా మెట్లమార్గం ఉన్నా.. లాడ్జికి వచ్చిన టూరిస్టులకు దాని గురించి తెలియదట. అదే పలువురి ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణమైందంటూన్నారు స్ధానికులు.

 

Wednesday, 7 September 2022

 

కింగ్స్‌వే…. రాజ్​పథ్…. కర్తవ్యపథ్…



 

రాజ్‌పథ్... స్వతంత్ర భారతదేశంలో అనేక తరాలు ఈ పేరు వింటూ పెరిగాయి. దిల్లీలోని రాజ్‌పథ్ అనగానే భారత గణతంత్రదినోత్సవ సంబరాలు గుర్తుకొస్తాయి.

 

ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలైన రాజ్​పథ్​, సెంట్రల్​ విస్టా ప్రాంతాల రహదారికి కర్తవ్యపథ్​గా పేరు పెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. బానిసత్వ, బ్రిటీష్​ పాలనను గుర్తుకు తెచ్చే ఈ పేర్లను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఈ రోడ్ల పేర్లను మార్చనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్​ కౌన్సిల్​ బుధవారం ప్రత్యేక సమావేశంలో తీర్మానించింది. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న రోడ్డును ఇకపై కర్తవ్యపథ్​గా మార్చనున్నారు

రాజ్‌పథ్‌లో కూర్చొని రిపబ్లిక్ డే పరేడ్‌ను, సైనిక విన్యాసాలను చూడటం ఒక మరపురాని అనుభూతి. ఇప్పుడు దీని పేరు మార్చాలనే చర్చ నడుస్తోంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడువున్న రాజ్‌పథ్‌ లుక్‌ను మార్చారు. దీనికి ఇప్పుడు 'కర్తవ్యపథ్' అనే పేరు పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

'న్యూదిల్లీ' నిర్మాణం పూర్తి అయినప్పుడు వైశ్రాయ్ హౌస్(నేటి రాష్ట్రపతి భవన్) నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మార్గానికి 'కింగ్స్‌వే' అని పేరు పెట్టారు. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ప్రొఫెసర్ పెర్సివల్ స్పియర్ ఈ పేరు ఇచ్చారు. 1924-40 వరకు ఆయన ఆ కాలేజీలో చరిత్రను బోధించారు.

న్యూదిల్లీలోని చాలా రోడ్లకు పెర్సివల్ సలహా మేరకే నాటి బ్రిటిష్ ప్రభుత్వం పేర్లు పెట్టింది. అక్బర్ రోడ్, పృథ్వీరాజ్ రోడ్, షాజహాన్ రోడ్ వంటివి అందులో కొన్ని. ఆయన టీచర్ మాత్రమే కాదు పరిశోధకుడు కూడా. భారతదేశ చరిత్ర మీద కూడా ఆయన పుస్తకాలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన దగ్గరగా గమనించారు. కానీ ఆ పోరాటాన్ని ఆయన వ్యతిరేకించలేదు. దానికి మద్దతు కూడా తెలుపలేదు. ఒక సాక్షిగా మాత్రమే ఉన్నారు.

సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పెర్సివల్ స్పియర్ చేరారు. భారతదేశం నుంచి వెళ్లిపోయిన తరువాత ఆయన అనేక పుస్తకాలు రాశారు.

ఇండియా, పాకిస్తాన్ అండ్ ది వెస్ట్(1949), ట్విలైట్ ఆఫ్ ది మొఘల్స్(1951), ది హిస్టరీ ఆఫ్ ఇండియా(1966) వంటి పుస్తకాలు అందులో ముఖ్యమైనవి.

స్వాతంత్ర్యం తరువాత 'రాజ్‌పథ్'

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1961లో ఆ పేరును 'రాజ్‌పథ్'గా మార్చారని న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) మాజీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ మదన్ థపలియాల్ తెలిపారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?

రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు ఉండే మార్గాన్ని 'రాజ్‌పథ్' అంటారు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరిగేది ఇక్కడే.

న్యూదిల్లీ నిర్మాణం గురించి మాట్లాడుకునేటప్పుడు సిటీని డిజైన్ చేసిన వారి గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాజ్‌పథ్‌తో పాటు దిల్లీలోని అనేక విశాలమైన రహదారులను నిర్మించిన ఆ వ్యక్తి మాత్రం ఎవరికీ గుర్తు ఉండరు. ఆయనే సర్దార్ నారాయణ్ సింగ్.

న్యూదిల్లీ నగరాన్ని నిర్మించేటప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. విశాలమైన రోడ్లు వేశారు. అందమైన పార్కులు నిర్మించారు. ఈ పనులు చేయడానికి 1920లలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం పనులు అప్పగించింది. అలా దిల్లీలో రోడ్లు వేసే కాంట్రాక్ట్ సర్దార్ నారాయణ్ సింగ్‌కు వచ్చింది.

న్యూదిల్లీ చీఫ్ డిజైనర్ ఎడ్విన్ ల్యుటెన్సీ, ఆయన పార్టనర్ హెర్బర్ట్ బేకర్‌లు నేడు రాజ్‌పథ్‌గా పిలుస్తున్న మార్గాన్ని నిర్మించే బాధ్యతను కూడా నారాయణ్ సింగ్‌కు అప్పగించారు.

ఆయన న్యూదిల్లీలో అద్భుతమైన రోడ్లు నిర్మించారు. ముందుగా పెద్దపెద్ద రాళ్లను కింద వేసేవారు. వాటి మీద ఇసుక, తారు వేసి రోడ్లు నిర్మించేవారు. సుమారు 20 ఏళ్లపాటు రోడ్లు చెక్కుచెదరకుండా ఉండాలన్నది నారాయణ్ సింగ్ ఆలోచన.

నేడు రాజ్‌పథ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కంకర, తారుతో రోడ్లు సులభంగా వేస్తున్నారు. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నుతాయి.

రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా గుర్రాలు, ఒంటెల నుంచి భారీ యుద్ధట్యాంకుల వరకు రాజ్‌పథ్ మీద కనిపిస్తాయి. రాజ్‌పథ్ మొదలయ్యే దగ్గర ఒకవైపు సౌత్ బ్లాక్ మరొకవైపు నార్త్ బ్లాక్ ఉంటాయి.

జంతర్ మంతర్ అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటి తరచూ జరిగే ధర్నాలు. రెండు 1724లో మహారాజ జై సింగ్-2 నిర్మించిన ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ. దీనికి ఎదురుగా ఉండే వీధికి రెండు వైపులా ఉండే విశాలమైన బంగ్లాలను అయిదుగురు భారతీయ కాంట్రాక్టర్లు నిర్మించారు.

వారే ధరమ్ సింగ్ సేథీ, శోభా సింగ్, విశాఖ సింగ్, నారాయణ్ సింగ్. సర్దార్ నారాయణ్ సింగ్ కుటుంబం నేటికీ దిల్లీలోనే నివసిస్తోంది. తన కోసం ధరమ్ సింగ్ కట్టుకున్న ఇల్లు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైంది. ఆ తరువాత 1970లలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అక్బర్ రోడ్‌కు మారింది.

వైశ్రాయ్ హౌస్‌తోపాటు నార్త్, సౌత్ బ్లాకులకు నిరంతరం రాళ్లు తరలించే కాంట్రాక్టును ధరమ్ సింగ్ దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని ధౌల్‌పుర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి రాళ్లను తరలించే వారు.

ధరమ్ సింగ్‌తో కలిసి ఒకే ప్లాటులో ఒక బంగ్లా కట్టారు శోభా సింగ్. ఆ తరువాత అక్కడ కేరళ హౌస్ కట్టారు.

ఎన్నో ఏళ్లుగా దిల్లీ వాసులు రాజ్‌పథ్‌కు రెండు వైపులా ఉండే పచ్చని గడ్డి మైదానాల మీద కూర్చొని చలి కాలంలో సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, రైల్ భవన్‌లో పని చేసే వారు పేకాట ఆడుకుంటూనో లేక మధ్యాహ్నం భోజనం చేస్తూనో అక్కడ సేదతీరుతుంటారని చెబుతుంటారు.

కానీ ఇప్పుడు రాజ్‌పథ్‌లోని అనేక చెట్లను నరికివేశారు. వాటి వయసు సుమారు 90 ఏళ్లు. ఇక్కడి నేరుడు చెట్ల కాయలు తింటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాడు రాజ్‌పథ్ నిర్మిస్తున్నప్పుడు చెట్లను కూడా నాటారు. నాడు చెట్లను నాటించిన ఎడ్విన్ ల్యుటెన్సీ ఉద్యాన విభాగం సలహాదారు డబ్ల్యూఆర్ మస్టో, శీతకాలంలో ఆకురాల్చే చెట్లను నాటించలేదు. ఆ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు.

ఇక్కడి పార్కులను రాజస్థాన్ నుంచి వచ్చిన తోటమాలులు అందంగా తీర్చిదిద్దుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజాంఘర్, ఫైజాబాద్ నుంచి కూడా తోటమాలులు దిల్లీకి వస్తున్నారు. వీరంతా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వీరంతా రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్ లేదా దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరిలో రెండు మూడు తరాలుగా ఈ పని చేస్తున్న వారు కూడా ఉన్నారు.

 

Monday, 5 September 2022

 

తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను పెంచుతున్న కేసీఆర్!!?



వినటానికి విడ్డురంగా ఉన్న ఇది నిజమే అనిపిస్తుంది, ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాటలు జాగర్తగా గమనించినట్టయితే..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ ట్రాప్‌లో ప‌డి ఏదేదో మాట్లాడుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీతో యుద్ధం అంటూ అన‌వ‌స‌ర బాధ్య‌త‌ను త‌న‌కు తానుగా నెత్తికెత్తుకున్నార‌నే భావ‌న చాలా మందిలో వుంది. తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను కేసీఆరే పెంచుతున్నార‌నే వాద‌న‌లో నిజం ఉంద‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి, అందుకు త‌గ్గ మూల్యాన్ని కేసీఆర్ చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

జాతీయ రాజ‌కీయాలంటూ కేసీఆర్ గ‌త కొన్ని నెల‌లుగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తెలంగాణ‌లో బీజేపీ దూకుడును అడ్డుకోవ‌డ‌మే పెద్ద స‌వాల్‌గా మారిన త‌రుణంలో, జాతీయ‌స్థాయిలో ఆ పార్టీని ఎదుర్కోవ‌డంపై సాధ్యాసాధ్యాల‌ను కేసీఆర్ ఆలోచించ‌క‌పోవ‌డం వ‌డ్డూరంగా ఉంది. నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట‌లు వింటే... ఈయ‌న‌కు ఏమైంది? అనే అనుమానం క‌లుగుతుంది.

‘ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుంది. కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకే మోదీ ప్రాధాన్యమిస్తున్నారు’అని కేసీఆర్ మండిపడ్డారు. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నే కోరిక‌ను ఎవరూ కాద‌న‌లేరు. అయితే అందుకు త‌గ్గ రాజ‌కీయ ప‌రిస్థితులు త‌న‌కు ఎంత వ‌ర‌కు అనుకూలంగా ఉన్నాయో కేసీఆర్ ఆలోచించారా? తెలుగు రాష్ట్రాల్లోనే కేసీఆర్‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు కేసీఆర్ ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తుంటార‌నే పేరు ఆయ‌న‌కు ఉంది.

బీజేపీ ముక్త్‌ భారత్‌ సాధన సంగ‌తేమో గానీ, టీఆర్ఎస్ ముక్త తెలంగాణ అంటూ వ‌స్తున్న మోదీ, అమిత్‌షాల‌ను ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్ ఆలోచిస్తే మంచిది. మ‌రోసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించేలా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. అంత‌కంటే ముందు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బీజేపీ పెద్ద స‌వాలే విసిరింది. 

ఒక్క మునుగోడులో గెలుపొందేందుకే రెండు ఊళ్ల‌కు క‌లిపి ఒక ఎమ్మెల్యేను నియ‌మించిన ప‌రిస్థితి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇది సాధ్య‌మా? జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తాన‌ని ప‌దేప‌దే కేసీఆర్ చెప్ప‌డం వెనుక వ్యూహం ఏంటో గానీ, అది వ‌ర్కౌట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మా, స్వ‌ర్గానికి ఎగురుతా అన్న‌ట్టుగా కేసీఆర్ రాజ‌కీయ పంథా ఉంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. కేసీఆర్ భ‌విష్య‌త్ ఆయ‌న చేత‌ల్లోనే ఉంది. 

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...