Thursday 30 June 2022

 

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు ఎందుకు మాయమయ్యాయి

ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న తన ఖాతాలోంచి కూడా నిధులు విత్ డ్రా చేసినట్టు సూర్యనారాయణ వెల్లడించారు. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణను చూసే ఆర్థిక శాఖ ద్వారానే ఇది జరిగిందన్నారు.

'28వ తేదీ అర్ధరాత్రి తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి యాన్యువల్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను అకౌంటెంట్ జనరల్ వారి కార్యాలయం ద్వారా అప్‌లోడ్ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను చూసుకుంటే నా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83 వేలు మార్చి నెలలో డెబిట్ అయిపోయినట్టుగా ఉంది. నాకొక్కడికే కాకుండా ఇదే పరిస్థితి అనేక మందికి ఉందని తేలింది.

సమాధానం కోసం ఆర్థిక శాఖ కార్యదర్శిని సంప్రదించాలని చూస్తే ఆయన కూడా ఈ విషయంపై ఏజీ కార్యాలయానికి వెళ్లినట్టు తెలిసింది.' అంటూ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు, సాధారణ ఉద్యోగులతోపాటు వివిధ శాఖల అధికారులు దాదాపుగా 62వేల మందికి ఇలాంటి సమస్య ఎదురైనట్టు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్( జీపీఎఫ్) ఖాతాల నుంచి నిధులు మాయం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. జీపీఎఫ్ నిల్వలు మాయం అయ్యాయంటూ ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశాయి.

ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో విఫలం కావడమే కాకుండా, చివరకు ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ నిధులను కూడా ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జీపీఎఫ్ నిధులు మాయం అయ్యాయనే వివాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ స్పందించి, జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు కనిపించకపోవడానికి కారణం సాంకేతిక సమస్యలని తెలిపింది.

ఈ నేపథ్యంలో జీపీఎఫ్ నిధులు ఏమయ్యాయి? నిజంగా సాంకేతిక సమస్యేనా అనే సందేహాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వివరణపై వారిలో సంతృప్తి కనిపించడం లేదు. గత ఏడాది కూడా ఇదే సమస్య ఎదురైంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చాలాకాలం పాటు పెండింగులో ఉంది. కరోనా సంక్షోభం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వంటి కారణాలతో 2018 నుంచి చెల్లించాల్సిన డీఏ బకాయిలు పేరుకుపోయాయి. వేతన సవరణ ఒప్పందం సందర్భంగా పెండింగ్ డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

వాటిని నగదు రూపంలో ఉద్యోగులకు నేరుగా చెల్లించకుండా 2018 జులై నుంచి పెండింగులో ఉన్న ఆరు డీఏలను మూడు విడతలుగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తామని తెలిపింది. తొలుత దానికి సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ, తర్వాత సీఎంతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి.

విడతల వారీగా పెండింగ్ డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాలకు జమచేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా జీపీఎఫ్ ఖాతాలకు బకాయిల చెల్లింపు జరిగినట్టు కొందరు ఉద్యోగులకు మెసేజ్‌లు వచ్చాయి. అనూహ్యంగా జూన్ 27, 28 తేదీల్లో కొందరు ఉద్యోగుల ఖాతా నుంచి ఆ మొత్తం మళ్లీ వెనక్కి మళ్లించినట్టు సమాచారం అందింది. దాంతో కలకలం మొదలైంది.

తమ జీపీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తం వెనక్కి మళ్లించారనే ఉద్యోగుల సమాచారంతో పలు సంఘాల నేతలు అప్రమత్తమయ్యారు.

తన ఖాతా నుంచి కూడా జీపీఎఫ్ నిధులు డెబిట్ అయిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ గుర్తించారు. తనతోపాటు రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు ఇదే సమస్య ఉందని గ్రహించిన ఆయన, సచివాలయంలోని ఆర్థిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ తరువాత అధికారులు కూడా వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటూ ఆయన మీడియాకు తెలిపారు.

జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు మాయం అయ్యాయనే అంశంపై హైకోర్టు స్పందించింది. తాము దీనిని సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపింది. మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది.

కొత్త పీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల మీద గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకుడు కేవీ కృష్ణయ్య వేసిన పిటీషన్ విచారణ జరుగుతోంది. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

జూన్ 29న విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని సొమ్మును వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందంటూ వచ్చిన పత్రికా కథనాలను ప్రస్తావించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాబు చెప్పాల్సిందేనని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగి జీతంలో ఒక్క రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదని, ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయకూడదని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ కృష్ణయ్య తన ఖాతా నుంచి రూ.91,221 ఉపసంహరణ జరిగిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము విత్‌డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ కల్పించుకుని గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని కోర్టుకు తెలిపారు.

హైకోర్టు తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది

ఓవైపు ఉద్యోగ సంఘాలు, మరోవైపు ప్రతిపక్షాలు, నేరుగా న్యాయస్థానం కూడా జీపీఎఫ్ వివాదంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈ నెల 28న ఈ అంశం వెలుగులోకి రాగా 29వ తేదీ రాత్రి ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ వివరణతో ఓ ప్రకటన జారీ అయ్యింది. ఆ ప్రకటన ప్రకారం...

'జీపీఎఫ్ సమస్యపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ (డీటీఏ) అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని డీటీఏను ప్రభుత్వం కోరింది.

ప్రాథమిక సమాచారం మేరకు పెండింగ్ డీఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాలకు జమచేసే ప్రక్రియను డీటీఏ ప్రారంభించింది. పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపు జరగలేదు. కానీ సాంకేతిక సమస్య మూలంగా బకాయిలు క్లియర్ అయినట్టు ఉద్యోగుల ఖాతాలో చూపించారు.

ట్రెజరీ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగింపులో పెండింగ్ బిల్లులను సంబంధిత ట్రెజరీ అధికారులు రద్దు చేయాల్సి ఉంటుంది. అది జరగకపోవడం వల్ల సిబ్బంది ఖాతాలో జమ అయినట్టు వచ్చింది. ఆ తర్వాత సిస్టమ్ దానిని వెనక్కి తీసుకున్నట్టు చూపిస్తోంది. ఇదో టెక్నికల్ సమస్య. దీనిపై దృష్టి పెట్టాం.

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా బిల్లులు పాస్‌ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. 2018 జులై 1 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్‌ అయిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.'

కానీ ఇది ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆర్థిక సంవత్సరాంతంలో జరిగిన సాంకేతిక సమస్య వల్ల జరిగిందని, తాము భావించడం లేదని ఉద్యోగులు అంటున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో జరిగినందున అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు.

'2021 అక్టోబర్‌లో కూడా ఇదే జరిగింది. జాయింట్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. కానీ అది జరగలేదు.

‘‘మా ఖాతాల నుంచి అప్పట్లో డెబిట్ అయిన మొత్తాన్ని వెంటనే క్రెడిట్ చేశారు. దాంతో చాలా మంది పెద్ద సమస్యగా భావించలేదు. ఆరు నెలలు తిరిగే సరికి మొన్నటి మార్చిలో మరోసారి ఇలా జరగడం చూస్తుంటే జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ తీరు సందేహాస్పదంగా ఉంది. నిజానికి జీపీఎఫ్ ఉద్యోగులకు 2021 జూన్ నాటికి ఒక విడత జమయ్యిందని, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇస్తామని చెప్పినప్పటికీ నేటికీ బకాయిలు అలానే ఉన్నాయి’’ అని ఏపీ ఎన్జీఓ నేత విద్యాసాగర్ చెప్పారు. దీని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...