Monday 5 September 2022

 

జనాలు రేషన్ కొన్నట్లే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు!



జార్ఖండ్‌ అసెంబ్లీలో ఇవాళ అధికార యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్‌ సోరెన్‌ నెగ్గారు. గనుల లీజును తనకు తానే కేటాయించుకుని సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. దీంతో సోరెన్పై ఎమ్మేల్యేగా అనర్హత వేటువేయడంపై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార యూపీఏ కూటమి విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో 81 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా సోరెన్‌ కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్‌ సోరెన్‌ కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ వారిని విలాసవంతమైన రిసార్ట్‌లో ఉంచారు. రాష్ట్ర అతిథి గృహంలో ఎమ్మెల్యేలు కలిసి రాత్రి బస చేసి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు.

ఓటింగ్‌ కు ముందు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ... కమలం పార్టీ చేసిన చర్యల కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి  బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదనిహేమంత్ సోరెన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు తలపడే వాతావరణం సృష్టించాలనుకున్నారని,హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రోత్సహించాలని చూశారంటూ విమర్శించారు.

 

7 comments:

  1. ఝార్ఖండ్: ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకంత బలహీనంగా ఉంటుంది?

    ReplyDelete
  2. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

    ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్. బిహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్‌‌కు 81 అసెంబ్లీ స్థానాలు మిగిలాయి.

    ఝార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అయిన బాబులాల్ మరాండీ తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు.

    ReplyDelete
  3. ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఆ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఒక్కసారి కూడా పదవీకాలం పూర్తి చేయలేకపోయారు.

    ReplyDelete
  4. ఝార్ఖండ్‌లో 21 ఏళ్లలో 11 ప్రభుత్వాలు మారాయి. ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చారు

    ReplyDelete
  5. ఝార్ఖండ్‌లో మరో కొత్త ప్రయోగం కూడా కనిపించింది. కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్ర ఎమ్మెల్యే మధు కోడా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆయన తన పదవీకాలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

    ReplyDelete
  6. 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా తన పూర్తి పదవీకాలాన్ని అనుభవించారు. కానీ, ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేలు, కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే, ఆయన పార్టీలోనే తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది.

    ReplyDelete
  7. రాజకీయ అస్థిరత కారణంగా ఝార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన కూడా విధించాల్సి వచ్చింది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...