Monday 11 July 2022

 

చట్టబద్ధమైన రాజ్యాంగమే లేని బ్రిటన్

భారత్‌లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి? పాలన ఎలా సాగించాలి? న్యాయవ్యవస్థ ఎలా పని చేయాలి? అనే విషయాలను స్పష్టంగా రాజ్యాంగంలో రాశారు.

రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీని నియమించారు. రాసిన రాజ్యాంగం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత దాన్ని ఆమోదించారు.

కానీ బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. అది 'అన్‌రిటెన్ కాన్‌స్టిట్యూషన్' అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం రాసి చర్చించి, ఆమోదించి ఒక అధికారిక పత్రంలోనమోదు చేసినది కాదు. రాజ్యాంగంలోని నిబంధనలు చట్ట ప్రకారం కాకుండా సంప్రదాయాలు, ఆచారాల రూపంలో వస్తుంటాయి. న్యూజీలాండ్, ఇజ్రాయిల్ దేశాల రాజ్యాంగాలు కూడా ఇదే విధంగా ఉంటాయి.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని గుర్తించడానికి నాటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిరాకరించారు. అప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ అమెరికా రాజ్యాంగంలోని 20వ సవరణను గుర్తు చేశారు. పాత, కొత్త అధ్యక్షుల మధ్య అధికార బదిలీ ప్రక్రియ గురించి అది చెబుతోంది.

ఇటీవల సొంత పార్టీ ఎంపీల ఒత్తిడికి తలొగ్గి బ్రిటన్ ప్రధాని పదవి నుంచి త్వరలోనే దిగిపోతానని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కానీ ఆయన ఎంత కాలంలో దిగిపోవాలో చెప్పే రాజ్యాంగ నిబంధనలు ఏమీ లేవు. ఒకవేళ అసలు నేను దిగిపోను అని బోరిస్ అంటే ఏం చేయాలో రాజ్యాంగంలో లేదు.

బ్రిటన్‌లో రాజ్యాంగ నియమాలు అనేవి చట్ట ప్రకారం కాకుండా రాజకీయ నేతల నైతిక బాధ్యతల రూపంలో అమల్లో ఉంటాయి.

'ప్రధానిని ఎలా నియమించాలో ఎలా తొలగించాలో చెప్పే చట్టాలు బ్రిటన్‌లో లేవు. కానీ రాజకీయ నాయకులు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తారని ప్రజలు భావిస్తారు' అందువల్లే తన పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకున్నా ప్రధానిగా బోరిస్ జాన్సన్ వెంటనే దిగి పోవాలని చెప్పే చట్టాలు ఏమీ లేవు.

గతంలో బోరిస్ జాన్సన్‌కు ముందు ప్రధానులుగా ఉన్న థెరిసా మే, డేవిడ్ కామెరూన్‌లు కూడా ఇలాగే కన్జర్వేటివ్ పార్టీకి కొత్త లీడర్ వచ్చే వరకు అధికారంలో కొనసాగారు.

రాజ్యాంగం అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. అంటే చట్టపరమైన పత్రం. ఒక దేశంలోని ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలో ఎలా పాలించాలో అది తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, నియమాలు అన్ని స్పష్టంగా రాజ్యాంగంలో రాసి ఉంటాయి. భారత రాజ్యాంగం అందుకు మంచి ఉదాహరణ.

కానీ బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, చట్టాలు కలిసి ఆ దేశ రాజ్యాంగంగా రూపొందాయి.

స్పష్టంగా రాయని రాజ్యాంగం మంచిదే అనే వారు ఉన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతాయనేది దీన్ని సమర్థించే వారి వాదన.

కానీ ఇలా ఒక చట్టబద్ధమైన రాజ్యాంగం లేక పోవడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. స్పష్టమైన లీగల్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల పాలనలో గందరగోళానికి దారి తీస్తుందని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆ సంప్రదాయాలను అన్వయించుకుంటారని వాదించే వారు ఉన్నారు.

2019లో బ్రెగ్జిట్ సంక్షోభం ఏర్పడినప్పుడు బ్రిటన్ పార్లమెంటును రద్దు చేయాలా వద్దా అనే అంశం మీద ప్రభుత్వం, సుప్రీం కోర్టు మధ్య విభేదాలు తలెత్తాయి. నాడు పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

ఒక చట్టబద్ధమైన, స్పష్టంగా రాసుకున్న రాజ్యాంగ అవసరాన్ని ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయని రచయిత డేమ్ హిలరీ మాంటే అన్నారు. పార్లమెంటు వ్యవహారాల్లో అక్రమంగా ప్రధానులు వేలు పెట్టకుండా ఉండాలంటే రాసుకున్న రాజ్యాంగం కావాలని హిలరీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి, ఇప్పుడు అమలులో ఉన్న రాజ్యాంగానికి సంబంధం లేదని కొందరు నిపుణులు అంటున్నారు.

'పార్లమెంటు విశ్వాసాన్ని ప్రధాని కచ్చితంగా పొందాలి. పార్లమెంటు నమ్మకం కోల్పోయిన నాడు కచ్చితంగా దిగిపోవాలని బ్రిటన్ రాజకీయ వ్యవస్థ చెబుతోంది. రాసుకున్న రాజ్యాంగం ఉన్న భారత్, డెన్మార్క్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఇదే సూత్రం మీద ఆధారపడి పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తోంది' అని యూనివర్స్ కాలేజ్ లండన్‌లోని ప్రొఫెసర్ రాబర్ట్ హజెల్ అన్నారు.

ఒకవేళ ప్రధాని రాజీనామా చేయకుండా దీర్ఘకాలం పాటు అలాగే పదవిలో ఉంటే ఆ తరువాత ఏం చేయాలనేది పార్టీ లేదా పార్లమెంటు నిర్ణయిస్తాయని రాబర్ట్ చెప్పుకొచ్చారు.

రెండు మార్గాల ద్వారా బోరిస్ జాన్సన్ మీద ఒత్తిడి తీసుకు రావొచ్చని రాబ్ వాట్సన్ అన్నారు.

'ఒకటి త్వరగా వైదొలిగేలా ఆయన మీద పార్టీ ఒత్తిడి తీసుకురావడం. రెండు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. పార్లమెంటులో బోరిస్ జాన్సన్ విశ్వాసం కోల్పోతే ముందస్తు ఎన్నికలు వస్తాయి. కానీ ఎన్నికలు రాకూడదని కన్జర్వేటివ్ పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది'.

 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...